రోడ్డుపై బోల్తా పడిన కారు , శ్యాంసుందర్‌రావు
భువనగిరిఅర్బన్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం భువనగిరి– వలిగొండ మార్గంలో నందనం వద్ద ఆయన వెళ్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో మూడు ఫల్టీలు కొట్టింది. కారు బోల్తా పడటంతో ప్రమాదం నుంచి శ్యాంసుందర్‌రావు క్షేమంగా బయటపడగా, ఆయన కారు డ్రైవర్ నానికి బలమైన దెబ్బలు తగిలాయి. వివరాల్లోకి వెళితే స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీవీ శ్యాంసుందర్‌రావు వలిగొండలో జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి కల్యాణానికి హాజరయ్యేందుకు తన కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో నందనం గ్రామంలో ఉన్న కాటమయ్య ఆలయం వద్ద ఉన్న మూలమలుపు వద్దకు చేరుకోగానే వలిగొండ నుంచి భువనగిరి వైపు వస్తున్న స్వీఫ్ట్ డిజైర్ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు మూడు çఫల్టీలు కొట్టుకుంటు వెళ్లి రోడ్డు పక్కన వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదానికి గురికాగానే గాలిబెలూన్లు తెరుచుకోవడంతో ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా బయటపడ్డారు. కారులో ఉన్న శ్యాంసుందర్‌రావు, కారు డ్రైవర్ ఇద్దరు కారు లోపలి నుంచి బయటకు వచ్చారు. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి.కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ కారు కిందికి దూసుకుపోయింది. బైక్ పై వెళ్తున్న నరాల జంగయ్య, బి. వేదేశ్వర్ చాకచక్యంగా బైక్‌ను వదిలి కిందకు దూకడంతో వారు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
బైక్ రాకపోతే కారు బావిలో పడేదా ?
ఈ రోడ్డు ప్రమాదంలో శ్యాంసుందర్‌రావు కారు కిందకు నరాల జంగయ్య బైకు వెళ్లక పోతే ఆ కారు అలాగే ఫల్టీలు కోట్టుకుంటూ పక్కనే ఉన్న బావిలో పడేదని స్థానికులు చెబుతున్నారు. ఆసమయంలో బైకు కారు కిందికి రావడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. కారు మీద ఉన్న ఇద్దరు కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. అదే సమయంలో వారి బైక్ కారు కిందికి దూసుకుపోవడంతో అక్కడే ఆగిపోయింది. రోడ్డు పక్కన గల వ్యవయాసాయ బావిలో కారు పడిపోకుండా ఆగిపోవడంతో రెండు నిండు ప్రాణాలు నిలిచిపోయాయి. గాయపడ్డ శ్యాంసుందర్‌రావును, డ్రైవర్‌ను ప్రాథమికి చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలియగానే బీజేపీ కార్యకర్తలు, నాయకులు, శ్యాంసుందర్ అభిమానులు పెద్ద ఎత్తున ఏరియా ఆస్పత్రికి తరలి వచ్చారు. ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగ్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు భువనగిరి రూరల్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment