భువనేశ్వర్: చైనా–భారత్ మధ్య 1962లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న మేజర్ శ్యామ్‌సుందర్ మహంతి ధైర్య సాహసాలకు ప్రతీకగా ప్రదానం చేసిన భూమి(రికార్డ్ ఆఫ్ లైట్స్–ఆర్‌ఓఆర్)ని ఆయన భార్యకు అందజేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. నెల రోజుల వ్యవధిలో భూమి సంబంధిత పట్టా సిద్ధం చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి వారం రోజుల్లోగా సవరించిన ఆర్‌ఓఆర్‌ను పిటిషనర్ ఇంటికి వెళ్లి, ప్రత్యక్షంగా అందజేయాలని స్పష్టం చేసింది.
దివంగత మేజర్ శ్యామ్‌సుందర్ మహంతి భార్య పూర్ణిమా మహంతి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్‌తో కూడిన ధర్మాసనం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. ధైర్యసాహసి మేజర్ భార్యను వేధించడం పట్ల న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సత్వర చర్యలతో ఆర్‌ఓఆర్ సిద్ధం చేసి, ఇంటి వద్దకే వెళ్లి పిటిషర్‌కు అందజేయాలన్నారు.
అధికారి తీరుపై అసహనం..
1962 చైనా–భారత్ యుద్ధంలో మేజర్ మహంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను ప్రభుత్వం ఆయనకు శ్యామపూర్ ప్రాంతంలో 5 ఎకరాల భూమిని ప్రదానం చేసింది. 2004లో మహంతి మరణించగా.. కుటుంబ వ్యవహారాల నిమిత్తం ఆయనకు కేటాయించిన భూమిని భార్య పూర్ణిమ వివిధ సందర్భాలలో ఐదుగురు వేర్వేరు వ్యక్తులకు విక్రయించారు. మరికొంత భూమిని తనవద్దే ఉంచుకున్నారు.
దీనిపై భువనేశ్వర్ అసిస్టెంట్ సెటిల్‌మెంట్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేస్తూ భూమిని ప్రభుత్వ సాధారణ పాలనాశాఖ పేరిట నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఉత్వర్వులను పూర్ణిమ మహంతి హైకోర్టులో సవాల్ చేశారు. ఆమె అభ్యర్థన పట్ల హైకోర్టు సానుకూలంగా స్పందించింది. అధికారి తీరును తప్పుబడుతూ ఉత్తర్వులు చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని కొట్టివేసింది. ఈ భూమిని ధైర్య సాహసాలను గుర్తిస్తూ రిటైర్డ్ ఆర్మీ మేజర్‌కు కేటాయించడంతో ఈ విషయంలో సంబంధిత అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment