తెలంగాణలో తాను చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్న ట్లుగా వ్యవహరించిన కేసీఆర్ సర్కారుకు ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టడం దుబ్బాక ఉపఎన్నికతో శ్రీకారం చుట్టి జీహెచ్‌ఎంసీ ఎన్నికల దాకా కొనసాగిం చారు. గతంలో కేవలం 4 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు ఒంటరిగా పోటీచేసి 48 స్థానాలను సాధించేలా ఎలా బలపడ గలిగింది? గతంలో 99 సీట్లు సాధించి తిరుగే లేదని పించుకున్న టీఆర్‌ఎస్ 55 స్థానాలకే ఎందుకు చతికిల పడింది? రథసారథిగా పగ్గాలు చేపట్టిన క్షణం నుంచి బండి సంజయ్ తనకు లభించిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా పార్టీలో అందరినీ కలుపుకొని బీజేపీ ‘బండి’ని విజయతీరాలకు చేర్చారు.
ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో వారినే నిర్లక్ష్యం చేయడం, కష్టాల్లో ఉన్నా పలకరించి ధైర్యం చెప్పక పోగా ఒక బాధ్యత గల మంత్రి వర్షం పడితే నీళ్లు రాక మరేం వస్తాయని వ్యంగ్యంగా మాట్లాడటంతో ప్రజలు ఎన్నికలు వస్తే ఫలితాలు ఇలా రాక ఇంకెలా వస్తాయని నిరూపించారు. ఇంటర్ పరీక్షల ఫలితాల వెల్లడిలో తప్పులు దొర్లినప్పుడు విద్యార్థులు ఆత్మహత్యలు చేసు కున్నా కనీసం ఆ కుటుంబీకులను పరామర్శించక పోవడం, నిర్బంధంగా రైతుల చేత తాము చెప్పిన పంటలనే పండించాలని ఆదేశించడం లాంటి అంశా లను ప్రజలు సహించలేకపోయారు. ఏ నిధులు, నీళ్లు, నియామకాలు అని చెప్పి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేయించారో వాటినే గాలికి వదిలేసి అంద రికీ ఉద్యోగాలివ్వడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యమా అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేముందు అంతమంది యువకుల ప్రాణాలు ఉద్యోగాల పేరుతో ఎందుకు తీశారో సమాధానమివ్వాల్సిన అవసరముంది. దళి తుడిని సీఎంగా చేస్తానని చెప్పి.. చేయకున్నా, వారికి ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఎటు పోయింది? ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని పాలించాలి తప్ప ఇష్టారీతిన పరిపాలిస్తాం, తప్పులను మాత్రం కేంద్రం మీదికి తోసేస్తాం అంటే ఎలా?
సరిగ్గా ఇలాంటి విధానాలనే అనుసరించిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఎలావుంది? రోజురోజుకు రాజకీయ రణక్షేత్రం నుంచి నిష్క్రమిస్తోంది. సమీప కాలంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్ని కలు ఉన్నాయని రైతుల ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. గతంలో కూడా ఇలాగే గుజరాత్ ఎన్నికల సందర్భంగా పటేళ్ల ఉద్యమం, ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల ముందు అత్యాచార ఘటనను ఆసరాగా చేసుకోవాలని మరో ఉద్యమం చేయాలని చూసి విఫలమైంది. కాంగ్రెస్‌కు తోడు కమ్యూనిస్టులు జమయ్యారు. రేపో మాపో వారి చేతిలో ఉన్న కేరళ కూడా జారిపోయే పరిస్థితి ఉంది. ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయమే గోల్డ్ స్కామ్‌కు కేంద్రం కావడం కమ్యూనిస్టులు కూడా అవినీతిపరులేనా అనే సందేహాలకు తావిచ్చింది. దీనికి భిన్నంగా ఇటీవల బిహార్‌తోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో, దుబ్బాక ప్రజలతో సహా అందరూ బీజేపీకి పట్టం కట్టిన విషయమే ఆ పార్టీ పాలన గురించి తెలియజేస్తోంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిపాలిస్తే పార్టీ ఏదైనా ప్రజలు ఆదరిస్తారనడానికి మరో ఉదాహరణ అవసరం లేదు. మరి టీఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టుల మాదిరిగా ఆలోచించి అతితొందరగా ప్రజలకు దూరమై అధికార పగ్గాలను బీజేపీకి అప్ప గిస్తామనుకుంటే ప్రజలకు సంతోషదాయకమే.
దుబ్బాక ఎన్నికలకు ముందు కేటీఆర్ శాంతి భద్రతలకు బీజేపీ విఘాతం కలిగించే అవకాశముం దనీ, పైపెచ్చు ఆ సమాచారం బీజేపీ క్యాంప్ నుంచే వచ్చిందనీ ప్రకటించి అభాసుపాలయ్యారు. మళ్ళీ సీఎం కేసీఆర్ ఇలాగే ప్రకటించి ప్రజలను భయాం దోళనలకు గురిచేశారు. బీజేపీ మీద మతతత్వ పార్టీ అని ముద్రవేసేందుకు ప్రయత్నించారు. తెలంగాణ ద్రోహులను చేరదీసి, మజ్లిస్ పార్టీతో దోస్తీ కోసం వారిని సంతృప్తిపరచడం కోసం నిజాం పాలనను మెచ్చుకుంటే ప్రజలు సహించే స్థితిలో లేరు. నిజామా బాద్‌లో కవిత, దుబ్బాకలో హరీశ్‌రావు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ దూకుడుకు పగ్గం వేసినట్లుగానే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని అధికారంలోకి తేవడం ఖాయం.
-శ్యామ్ సుందర్ వరయోగి
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
మొబైల్: 98669 66904
Comments
Please login to add a commentAdd a comment