సాక్షి ప్రతినిధి, అనంతపురం :
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు’ తయారైంది ఎస్పీ శ్యాంసుందర్ పరిస్థితి! సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి మధ్య సాగిన మాటల యుద్ధం ఎస్పీపై బదిలీ వేటు పడేలా చేసిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. దినేష్‌రెడ్డి సీఎం కిరణ్‌పై ఆరోపణలు చేసిన 20 రోజుల్లోగానే ఎస్పీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడటం ఇందుకు బలం చేకూర్చుతోంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూలు వెలువడటానికి సరిగ్గా ఒక్క రోజు ముందు.. అంటే జూలై 2న అప్పటి ఎస్పీ షహనవాజ్ ఖాసీంను ప్రభుత్వం బదిలీ చేసింది. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే ఖాసీం ఉంటే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆటలు సాగవనే ఉద్దేశంతోనే ఆయన్ను బదిలీ చేసింది.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల కొత్త ఎస్పీని నియమించే అవకాశాలు లేవని, కిందిస్థాయి అధికారులను గుప్పిట్లో పెట్టుకుని యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడి.. దొడ్డిదారిన ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని అధికార పార్టీ నేతలు ఎత్తులు వేశారు. అయితే.. రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో డీసీపీ-2గా పనిచేస్తోన్న ఎస్.శ్యాంసుందర్‌ను జిల్లా ఎస్పీగా నియమించాలని సర్కారుకు సూచించింది. ఆ మేరకు శ్యాంసుందర్‌ను జిల్లా ఎస్పీగా నియమిస్తూ జూలై 11న సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. జూలై 12న ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. పలు సందర్భాల్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియగానే తనను బదిలీ చేస్తారని బాహటంగానే చెబుతూ వచ్చారు. అయితే.. తెలంగాణ ఏర్పాటుకు సీడబ్ల్యూసీ, యూపీఏ పక్షాలు నిర్ణయం తీసుకోవడంతో ‘అనంత’లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీన్ని నీరుగార్చేందుకు ఎస్పీ శ్యాంసుందర్ శతవిధాలా ప్రయత్నించారు. ఉద్యమకారులపై విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించారు.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో రౌడీలు, ఫ్యాక్షనిస్టులు తిష్ట వేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ తీరుపై సమైక్యవాదులు విరుచుకుపడ్డారు. ఆయన ఎక్కడికెళ్లినా అడ్డుతగిలారు. ఉద్యమవేడి తగ్గేదాకా ఎస్పీ అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే శ్యాంసుందర్‌పై బదిలీ వేటు పడుతుందనే అభిప్రాయం అప్పట్లోనే పోలీసు వర్గాల్లో బలంగా వ్యక్తమైంది. అయితే.. అప్పట్లో బదిలీ ఉత్తర్వులు వెలువడలేదు. డీజీపీ దినేష్‌రెడ్డి సెప్టెంబరు 30న ఉద్యోగ విరమణ చేసిన విషయం విదితమే. పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు ఆయన తీవ్రప్రయత్నాలు చేశారు. అవి ఫలించలేదు. ఈ క్రమంలో ఈ నెల 8న సీఎం కిరణ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.‘అనంతపురం జిల్లా ఎస్పీ శ్యాంసుందర్‌ను బదిలీ చేయాలని సీఎం నాపై ఒత్తిడి తెచ్చారు.
శ్యాంసుందర్‌ను నిజామాబాద్ ఎస్పీగా నియమించడం ద్వారా సీఎం రాజకీయ ప్రత్యర్థి అయిన డి.శ్రీనివాస్‌కు చెక్ పెట్టాలన్నది ఆయన ఉద్దేశం. కానీ.. నేను ఆ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. అందుకే డీజీపీగా నా పదవీకాలాన్ని సీఎం పొడిగించలేదు’ అంటూ దినేష్‌రెడ్డి ఆరోపించారు. ఇవి అప్పట్లో సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే ఎస్పీ శ్యాంసుందర్‌పై బదిలీ వేటుకు సీఎం కిరణ్ సిద్ధమయ్యారు. దినేష్‌రెడ్డి ఆరోపణలు చేసిన 20 రోజుల్లోగానే శ్యాంసుందర్‌పై బదిలీ వేటు వేయించారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో పనిచేసిన హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం డీసీపీ-2 పోస్టుకే శ్యాంసుందర్‌ను బదిలీ చేయడం గమనార్హం. శ్యాంసుందర్ ఎక్కడ పనిచేసినా వివాదాస్పదంగా మారడం.. ఆ తర్వాత బదిలీ కావడం రివాజుగా మారింది. గుంటూరు, వరంగల్‌జిల్లాల్లో పనిచేసినప్పుడూ ఇదే రీతిలో బదిలీవేటు పడింది. ముచ్చటగా మూడోసారి కూడా వివాదాస్పదం కావడంతో బదిలీ వేటు పడినట్లు పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఎస్పీ బదిలీ వెనుక...
Published Mon, Oct 28 2013 2:59 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement