సాక్షి ప్రతినిధి, అనంతపురం :
జిల్లా నూతన ఎస్పీగా మస్తీపురం రమేష్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. జిల్లా ఎస్పీగా పనిచేస్తోన్న ఎస్.శ్యాంసుందర్‌పై బదిలీ వేటు పడింది. ఏఎస్పీ(పరిపాలన) నవదీప్ సింగ్‌ను కూడా బదిలీ చేయడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు జిల్లా ఎస్పీగా ఎస్.శ్యాంసుందర్‌ను నియమిస్తూ జూలై 11న సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. మూడున్నర నెలలు తిరగక ముందే ఆయనపై బదిలీ వేటు పడటం గమనార్హం. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎస్పీ శ్యాంసుందర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారిన విషయం విదితమే.
ఇటీవల సీఎం కిరణ్‌పై మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి ఆరోపణలు చేసిన సందర్భంలోనూ శ్యాంసుందర్ పేరును ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు పడుతుందనే ఊహాగానాలు ఈ నెల ఎనిమిది నుంచి విన్పిస్తున్నాయి. అవి ఆదివారం వాస్తవరూపం దాల్చాయి. ఇక ఎస్పీ శ్యాంసుందర్ కన్నా పక్షం రోజులు ముందు ఏఎస్పీగా నియమితులైన నవదీప్‌సింగ్‌పై కూడా సర్కారు బదిలీ వేటు వేసింది. ఈయనను మల్కాజిగిరి డీసీపీగా నియమించింది. ఏఎస్పీగా నియమితులైన నాలుగు నెలల్లోగానే నవదీప్‌సింగ్‌ను బదిలీ చేయడం గమనార్హం. ఐపీఎస్ అధికారులను ఒక పోస్టులో నియమించాక కనీసం రెండేళ్లపాటు బదిలీ చేయకూడదన్నది నిబంధన. దాన్ని ఉల్లంఘించి ఎస్పీ, ఏఎస్పీలపై బదిలీవేటు వేయడం గమనార్హం. శ్యాంసుందర్ స్థానంలో కొత్త ఎస్పీగా నియమితులైన ఎం.రమేష్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మస్తీపురం గ్రామానికి చెందిన వారు.
1996 గ్రూప్-1 బ్యాచ్‌కు చెందిన ఈయన.. డీఎస్పీగా పోలీస్ శాఖలో ప్రవేశించారు. అప్పాలో పని చేసిన ఈయన 2001లో అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. రామగుండం, వరంగల్‌లో ఓఎస్‌డీగాను, 2004 నుంచి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. 2009లో ఇంటెలిజెన్స్ ఎస్పీగా చేరిన ఆయన అదే ఏడాది డిసెంబర్‌లో అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) జాయింట్ డెరైక్టర్(తెలంగాణ రీజియన్)గానూ విధులు నిర్వర్తించారు. 2011లో ఐపీఎస్ హోదా పొందారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆ జిల్లాలో 18 నెలల పాటు సేవలందించారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే రమేష్‌రెడ్డికి నిజాయితీ అధికారిగా పేరుంది. ఆయన బుధవారం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని పోలీసువర్గాలు వెల్లడించాయి.
ఎస్పీ, ఏఎస్పీ బదిలీ
Published Mon, Oct 28 2013 2:54 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement