అక్కసుతోనే సీఎంపై విమర్శలు: ఆనం రామనారాయణరెడ్డి | Dinesh reddy alleged on kiran kumar reddy, says anam rama narayana reddy | Sakshi
Sakshi News home page

అక్కసుతోనే సీఎంపై విమర్శలు: ఆనం రామనారాయణరెడ్డి

Published Wed, Oct 9 2013 4:15 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

Dinesh reddy alleged on kiran kumar reddy, says anam rama narayana reddy

సాక్షి, హైదరాబాద్: భూకబ్జాలు, సీబీఐ విచారణ, సుప్రీంకోర్టులో కేసు కారణంగా డీజీపీ పదవీ కాలాన్ని పొడిగించలేదన్న అక్కసుతోనే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై, ఆయన కుటుంబంపై మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. రెండేళ్ల కిందట నలుగురు సీనియర్ అధికారులు కె.ఆర్.నందన్, గౌతంకుమార్, శివశంకర్, ఉమేష్‌కుమార్‌లను కాదని దినేశ్‌రెడ్డ్డిని డీజీపీగా నియమించడం కుట్రేనా అని ప్రశ్నించారు.
 
 మంగళవారం సచివాలయంలో మంత్రి పితాని సత్యనారాయణతో కలిసి ఆనం విలేకరులతో మాట్లాడారు. ‘‘గ్రామస్థాయి రాజకీయ నాయకులు చేసేలా ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం వల్ల నీ స్థాయి దిగజారుతుందే కాని ముఖ్యమంత్రిది కాదు. డీజీపీ పదవి ముఖ్యమంత్రి నీకు పెట్టిన భిక్ష’’ అని వ్యాఖ్యానించారు. సీఎం సోదరుడు సంతోష్‌రెడ్డిపై చేసిన ఆరోపణలకు సంబంధించి దినేశ్‌రెడ్డి వద్ద సాక్ష్యాలు ఉంటే బయటపెట్టాలని, వాటిని సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆనం సవాల్ చేశారు. తనపై ఉన్న సీబీఐ కేసు నుంచి తప్పించుకోవడానికి సీఎం బంధువులపై మాజీ డీజీపీ ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని సీఎం చెప్పమన్నారని పేర్కొనడాన్ని  ఆనం తప్పుబట్టారు.
 
  ‘‘కేంద్రానికి అన్నీ తెలుసు. సీఎంకు నీ సలహా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తనకున్న సమాచారం మేరకు సీఎం కేంద్రానికి, పార్టీ అధిష్టానానికి ఇంతకంటే ఎక్కువే చెప్పారు’’ అని వివరించారు. డీజీపీగా ఆయన ఉద్యోగం ఊడిందని, ఇప్పుడు సీఎం ఉద్యోగం ఊడగొట్టాలని ప్రయత్నిస్తున్నారా ప్రశ్నించారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతి కోసం సీఎం ఒత్తిడి చేశారన్న దినేశ్ వ్యాఖ్యలపై ఆనం మండిపడ్డారు. ‘ఆయనేమైనా కమిషనరా? డీసీపీనా? అనుమతి ఇవ్వడానికి డీజీపీకి సంబంధం ఏమిటి’ అని ధ్వజమెత్తారు. క్యాంపు కార్యాలయం చీకటిరాజ్యానికి అడ్డాగా మారిందన్న దినేశ్‌రెడ్డి.. మరి రెండేళ్లు దానిచుట్టూ ఎందుకు తిరిగారని ప్రశ్నించారు. ఆయన ముందుగా ఆస్తుల లెక్కలు సీబీఐకి, సుప్రీంకోర్టుకు చెప్పుకో అని పేర్కొన్నారు.
 
 పలు ప్రశ్నలకు సమాధానం దాటవేసిన మంత్రి
 కాగా,  దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో సరిగా వ్యవహరించలేని దినేశ్‌ను ఇంతకాలం ఎందుకు కొనసాగించారు? నలుగురు సీనియర్లను కాదని ఆయనకు డీజీపీ పదవిని ఎలా కట్టబెట్టారు?  మీపై ఆరోపణలు చేసే సరికి ఆయన అసమర్థుడని, పోలీసు బాస్‌గా వ్యవహరించాడని చెప్పడం సరైనదేనా అన్న ప్రశ్నలకు మంత్రి జవాబు చెప్పలేక దాటవేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement