ఘనంగా వీడ్కోలు పలికిన హైకోర్టు
ఆయన సేవలను కొనియాడిన సీజే జస్టిస్ ఠాకూర్
ఘనంగా సన్మానించిన హైకోర్టు న్యాయవాదుల సంఘం
సాక్షి, అమరావతి : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బండారు శ్యాం సుందర్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమై ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ.. జస్టిస్ శ్యాం సుందర్ 33 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి, న్యాయవ్యవస్థకు ఎన్నో రకాలుగా సేవలు అందించారని తెలిపారు.
ఇంత సుదీర్ఘ కాలం పని చేయడం చిన్న విషయం కాదన్నారు. జస్టిస్ శ్యాం సుందర్ విలువలకు పెద్ద పీట వేశారని, తండ్రి చెప్పిన మాటలను తూచా తప్పకుండా ఇప్పటివరకు పాటించారని తెలిపారు. క్లిష్టమైన కేసులను చాలా సులభంగా పరిష్కరించారని చెప్పారు.
సత్వర న్యాయం కోసం కృషి చేశారు
అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిలిగినీడి చిదంబరం, బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ) పసల పొన్నారావు తదితరులు జస్టిస్ శ్యాం సుందర్ సేవలను కొనియాడారు. న్యాయవ్యవస్థకు ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు.
సత్వర న్యాయం కోసం ఎంతో కృషి చేశారని, న్యాయవ్యవస్థ సమర్థతను పెంచేందుకు కృషి చేశారని తెలిపారు. ఎన్నో క్లిష్టమైన కేసులను సమర్థతతో, స్పష్టతతో పరిష్కరించారన్నారు. పని చేసిన ప్రతి చోటా ఎంతో హుందాగా, సమర్థవంతంగా వి«ధులు నిర్వర్తించారన్నారు. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని వారు చెప్పారు.
ఈ స్థాయికి వస్తానని ఊహించలేదు
అనంతరం జస్టిస్ శ్యాం సుందర్ మాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి వస్తానని ఎన్నడూ ఊహించలేదన్నారు. ఎంతో మంది తనకు మార్గదర్శకంగా ఉండి, ఇక్కడి వరకు వచ్చేందుకు సహకరించారని తెలిపారు. తన గురువు, సీనియర్ అయిన తన తండ్రి ఎంతో నేర్పారన్నారు. విధి నిర్వహణలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలన్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థతో తనకు ఎన్నో మధుర స్మృతులున్నాయని, వాటిని గుండెల్లో దాచుకుంటున్నానని తెలిపారు. తాను చేసిన ప్రమాణానికి కట్టుబడి విధులు నిర్వర్తించానని చెప్పారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ శ్యాం సుందర్ కుటుంబ సభ్యులు, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, న్యాయవాదులు, రిజి్రస్టార్లు పాల్గొన్నారు.
అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ శ్యాం ప్రసాద్ దంపతులను ఘనంగా సన్మానించింది. వారికి శాలువా కప్పి, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు చిదంబరం, ఉపా«ధ్యక్షుడు ఎన్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి నన్నపనేని శ్రీహరి, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment