భారత రాజ్యాంగం 7వ షెడ్యూలులోని ఆర్టికల్ 246 ప్రకారం ‘‘ప్రజారోగ్యం’’ రాష్ట్రాల పరిధిలోని అంశం. ఈ జాబితా ప్రకారం 6 వ అంశంలోని ప్రజారోగ్యం, ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, పరిశుభ్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రాలదే. అంటే అసుపత్రుల్లో సకల సౌకర్యాలు ఐసియూ బెడ్స్, మందులు, వెంటిలేటర్లు, అంతెందుకు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు బాధ్యత కూడా రాష్ట్రప్రభుత్వాలదే. వీటి ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనా మోదీ చెప్పట్లేదు. ఎందుకు? ఎందుకంటే, ఎవరినో నిందిస్తూ కూర్చుంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తాయి కాబట్టి. రాజకీయాలు చేసే సమయం కాదు కాబట్టి.
కేంద్రం ఇప్పటిదాకా కొత్తగా 14 ఎయిమ్స్ వైద్య కళాశాలలను మంజూరు చేయగా అందులో 11 కళాశాలలు పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఎన్ని వైద్య కళాశాలలు నెలకొల్పాయో మోదీ చెప్పట్లేదు ఎందుకు? ఎందుకంటే ప్రజలు నిజాలు గ్రహించాలని.
కేంద్రం ఇప్పటి దాకా విపత్తు నివారణ కోసం 2020–2021 ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా రాష్ట్రాలకు మొత్తం రూ. 11,092 కోట్లు విడుదల చేయగా అవి ఇప్పుడు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్న విషయాన్ని మోదీ ఎందుకు చెప్పట్లేదు? అంతేకాకుండా అదనంగా విపత్తు నివారణ నిధుల నుంచి రూ. 8,873 కోట్లు కోవిడ్ నివారణ చర్యల కోసం రాష్ట్రాలకు విడుదల చేసిన విషయాన్ని మోదీ ఎందుకు చెప్పట్లేదు? జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలలోనే చైనా వైరస్ ప్రమాదకరంగా ఉంటోందని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రలో పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించిన విషయాన్ని మోదీ చెప్పట్లేదు ఎందుకు? ఎందుకంటే ఎవరినో నిందిస్తూ కూర్చుంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తాయి కాబట్టి. రాజకీయాలు చేసే సమయం కాదు కాబట్టి.
చైనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవలసిన చర్యలపై పలుమార్లు ముఖ్యమంత్రుల సమావేశాలు నిర్వహించినా పలువురు సీఎంలు గైర్హాజరు కావడం లేదా సమావేశంలో చర్చించిన అంశాలపై సీరియస్‌గా తగిన చర్యలు తీసుకోలేని విషయాన్ని మోదీ ప్రజలకెందుకు చెప్పట్లేదు? ఎందుకంటే ఎవరినో నిందిస్తూ కూర్చుంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తాయి కాబట్టి. రాజకీయాలు చేసే సమయం కాదు కాబట్టి. పి.ఎం. కేర్స్ నిధుల నుంచి రాష్ట్రాలకు విరివిగా వెంటిలేటర్లు పంపించినా వాటిని ఉపయోగించకపోగా కనీసం ప్యాకేజి కూడా తీయని విషయాన్ని మోదీ చెప్పట్లేదు. ఎందుకు? ఎందుకంటే ఎవరినో నిందిస్తూ కూర్చుంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తాయి కాబట్టి. రాజకీయాలు చేసే సమయం కాదు కాబట్టి.
చైనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఇప్పటికే రూ. 7,000 కోట్లు పి. ఎం. కేర్స్ నిధుల నుంచి కేటాయించిన విషయాన్నిమోదీ చెప్పట్లేదు. ఎందుకు? ఎందుకంటే అది ప్రచార పటాటోపం చేసే అంశం కాదు కాబట్టి.
వాక్సిన్ భారత్ లోనే తయారు చేసేలాగా తగిన ఏర్పాట్లు ఎందుకు చేశారో మోదీ చెప్పట్లేదు ఎందుకని? విదేశీ సంస్థలపై ఆధార పడడం మంచిది కాదు కాబట్టి. ఎందుకంటే ఫైజర్ వ్యాక్సిన్‌తో అర్జెంటీనా, బ్రెజిల్‌లు దోపిడీకి గురవుతున్నాయి కాబట్టి. వారు డిమాండ్ చేసినంత రేటు కట్టి ఇవ్వాలి కాబట్టి. దీంతో సామాన్యులకు వాక్సిన్ అందే అవకాశం ఉండదు కాబట్టి. ఇది చెప్పినా కొంతమందికి ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులకు, కొన్ని ప్రతిపక్షాలకు, విదేశీ భక్తులకు నచ్చదు కాబట్టి.
విదేశీ సాయం కింద మన దేశానికి అందిన వైద్య పరికరాలు, మందులు, సామాగ్రి కేవలం ఒకటి, రెండు రోజుల్లోనే అత్యవసరంగా అవసరమున్న రాష్ట్రాలకు చెరవేస్తున్న విషయాన్ని మోదీ చెప్పట్లేదు. ఎందుకు? ఎందుకంటే ప్రచారం అక్కర్లేదు కాబట్టి.
స్వయంగా ఆక్సిజన్ ప్లాంట్‌లను నెలకొల్పే అధికారం రాష్ట్రాలకు ఉందనే విషయాన్ని మోదీ ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న విషయాన్ని మోదీ చెప్పట్లేదు ఎందుకు? ఎందుకంటే ఇది వారి వైఫల్యాన్ని ఎత్తి చూపే సమయం కాదు కాబట్టి.
చైనా వైరస్ వ్యాప్తి నిరోధానికి యుద్ధ ప్రాతిపదికన భారత్‌లో తయారు చేయించిన వాక్సిన్ వాడకం విషయంలో ప్రారంభంలో ప్రజలు అంతగా ముందుకు రాకపోవడంతో కొంత వాక్సిన్ వృధా అయిన విషయాన్ని మోదీ చెప్పట్లేదు ఎందుకు? ఎందుకంటే వాక్సిన్ వాడకం విషయంలో ప్రజలను ఉత్సాహపరచాల్సింది పోయి కొందరు ముఖ్యంగా ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు అనవసర భయాలను రేకెత్తించాయి కాబట్టి. ఆ విషయం చెబితే రాజకీయం చేసినట్లు అవుతుందని, ఇది సరైన సమయం కాదు కాబట్టి.
దేశంలో వాక్సిన్ కొరత ఉందని విమర్శిస్తున్న వారికి ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల మందికి వాక్సిన్ వేయించిన దేశం ప్రపంచంలో ఒక్క భారత్ మాత్రమేనని, అయితే రాత్రికి రాత్రి కావలసినంత వాక్సిన్ తయారు చేయించలేమని మోదీ చెప్పట్లేదు. ఎందుకు? ఎందుకంటే మంచి పని చేసినా విమర్శించే అలవాటున్న ప్రతిపక్షాలు.. ప్రభుత్వం ఏం చెప్పినా అర్థం చేసుకోవు కాబట్టి.
చైనాతో డోక్లామ్ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా అధికారులతో రహస్యంగా సమావేశం కావడాన్ని మోదీ చెప్పలేదు. ఎందుకు? రాహుల్ గాంధీ కుటుంబం గురించి అందరికీ తెలుసు కాబట్టి.
ఇలా చెబుతూ పోతే మోదీ ఇంకా చెప్పని ఎన్నో సత్యాలు మరుగున పడిపోతున్నా, ఇంతచేస్తున్నా తమ బాధ్యతలను విస్మరించి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలను, కొందరు ప్రతిపక్ష నాయకులను, తమకు తామే మేధావులమని భుజకీర్తులు తగిలించుకునే ‘సోకాల్డ్ మేధావులను’, ప్రజల్లో పట్టించుకునే వారే లేని కమ్యూనిస్టులను, అవార్డ్ వాపసి బ్యాచ్‌ని, ప్రజలకు వాస్తవాలు చెప్పలేని విదేశీ భక్త జర్నలిస్టులను ఏమనాలో ఇక ప్రజలే నిర్ణయించుకోవాలి.
వ్యాసకర్త: శ్యామ్ సుందర్ వరయోగి
కో–కన్వీనర్, బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ,
హైదరాబాద్, తెలంగాణ
మోదీ వాస్తవాలు ఎందుకు చెప్పట్లేదు?
Published Sun, May 16 2021 12:48 AM | Last Updated on Sun, May 16 2021 8:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment