న్యూఢిల్లీ: కోవిడ్ మహా సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధంతో విశ్వవ్యాప్తంగా దేశాల మధ్య వేళ్లూనుకుపోయిన అపనమ్మకాలు, భయాలను పారద్రోలాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జీ20 సదస్సులో తొలి రోజు అగ్రరాజ్యాధినేతలతో శిఖరాగ్ర చర్చల సందర్భంగా ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్లను మోదీ ప్రస్తావించారు. ‘కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల్లో కొత్త భయాలు, అపనమ్మకాలు గూడుకట్టుకున్నాయి. వెనువెంటనే వచి్చపడిన ఉక్రెయిన్ యుద్ధ భయాలు ఆ అగాథాలను మరింత పెంచాయి.
ఇప్పుడు అపనమ్మకాలను పోగొట్టాల్సిన సమయం వచ్చింది. విశ్వాసం దిశగా ప్రపంచదేశాలు కలిసి నడవాలి. అవిశ్వాసంపై మనం విజయం సాధించాలి. విశ్వ శ్రేయస్సు కోసం కలసి ముందడుగేద్దాం’ అని పిలుపునిచ్చారు. ప్రసంగం ప్రారంభంలోనే మొరాకోను పెను భూకంపం కుదిపేసిన దుర్ఘటనను ప్రస్తావించి వందలాది మంది మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా సహా జీ20 అధినాయకగణం సమక్షంలో మోదీ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆయన మాటల్లోనే..
ఏటా 100 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందే
పెను వాతావరణ మార్పులు సంభవించకుండా ముందస్తు నివారణ చర్యలకు సమాయత్తమవుదాం. శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వ్యవస్థల వైపు మారాలంటే ట్రిలియన్ల కొద్దీ భూరి నిధులు అత్యావశ్యకం. ఈ సమూల మార్పు ప్రక్రియలో అభివృద్ధి చెందిన దేశాలు అత్యంత కీలకమైన పాత్ర పోషించాలి. 2009లో కోపెన్‌హాగెన్‌లో ఐక్యరాజ్యసమితి ‘వాతావరణ’ చర్చల సందర్భంగా 2020 నాటికల్లా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్ల నిధులు ఇస్తామన్న వాగ్దానాలను సంపన్న దేశాలు నిలబెట్టుకోవాల్సిందే. 55 దేశాల ఆఫ్రికన్ కూటమిని జీ20లోకి ఆహ్వానించడం నాకు గర్వకారణం. కోవిడ్ తెచి్చన మహా విషాదం దేశాల మధ్య విశ్వాసం తగ్గించేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశి్చతి, ఉత్తరార్థ గోళ దేశాలు, దక్షిణార్ధ గోళ దేశాల మధ్య లోపించిన సఖ్యత, ఆహారం, ఇంధనం, ఎరువులు, ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, ఇంధనం, నీటి భద్రత అంశాల్లో పరిష్కారాలు వెతికి ప్రపంచ సుస్థిరాభివృద్ధికి సమష్టిగా పాటుపడదాం.
‘ఒకే కుటుంబం’ స్ఫూర్తితో సుస్థిరాభివృద్ధి
‘ఒకే కుటుంబం’ స్ఫూర్తితో అభివృద్ధిని సుస్థిరం చేసుకుందాం. దీనిని సాంకేతికత వారధి తోడుగా నిలవనుంది. ప్రతి వర్గం, ప్రతి ప్రాంతాన్ని అనుసంధానిస్తూ సహాయ వ్యవస్థను నిర్మించుకుందాం.
అప్పుడే గణనీయమైన మార్పు
మహిళల సారథ్యంలో జరిగే అభివృద్ధితోనే 21వ శతాబ్దంలో గణనీయమైన మార్పును చూడగలం. ఇప్పుడు భారత్‌లో సైన్స్, టెక్నాలజీ, గణితం, ఇంజనీరింగ్ విభాగాల్లో పట్టభద్రులైన వారిలో 45 శాతం మంది అమ్మాయిలే. సైన్స్, టెక్నాలజీలో ప్రతిభ చూపిన వారికి అంతర్జాతీయ అవకాశాలు కలి్పంచేందుకు ‘జీ20 టాలెంట్ వీసా’ అనే ప్రత్యేక కేటగిరీని త్వరలో ప్రారంభిస్తాం.
గ్లోబల్ బయో–బ్యాంక్‌లు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గ్లోబల్ బయో–బ్యాంక్‌ల ఏర్పాటు సంతోషదాయకం. హృద్రోగాలు, సికెల్ సెల్ అనీమియా, రొమ్ము క్యాన్సర్‌లపై దృష్టిసారించేందుకు మరింత అవకాశం చిక్కుతుంది. దేశాలను, మనుషులను కేవలం మార్కెట్ల కోణంలో చూడొద్దు. మనకు సహానుభూతి, దీర్ఘకాలిక లక్ష్యాలు తప్పనిసరి.
47 ఏళ్లు కాదు ఆరేళ్లలో సాధించాం
ఆర్థిక సమ్మిళితకు 47 ఏళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. కానీ దానిని భారత్ కేవలం ఆరేళ్లలోనే సాధించింది. గత పదేళ్లలో ఏకంగా 360 బిలియన్ డాలర్ల మొత్తాలను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమచేసింది. 33 బిలియన్ డాలర్ల నిధులు పక్కదారి పట్టకుండా నివారించింది. ఇది స్థూల దేశీయోత్పత్తిలో 1.25 శాతానికి సమానం. మహిళా సాధికారత ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు జీ20 ఎంతగానో కృషిచేస్తోంది. అంతర్జాతీయ సరకు రవాణా గొలుసులో విశ్వాసం, పారదర్శకత పెరగాలి.
Comments
Please login to add a commentAdd a comment