న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని రక్షణ కవచంగా ధరిస్తున్నానని ఉద్ఘాటించారు. విమర్శకుల దూషణలు, అబద్ధాలు, ఆరోపణలు తననేమీ చేయలేవని తేల్చిచెప్పారు. ప్రజలు తన పట్ల చూపుతున్న విశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. జీవితంలో ప్రతిక్షణం దేశం కోసమే పని చేస్తున్నానని చెప్పారు.
స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం వల్ల అంతర్జాతీయ సంస్థలకు భారత్‌పై నమ్మకం పెరిగిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రధాని మోదీ 85 నిమిషాలపాటు ప్రసంగించారు. కోవిడ్–19 మహమ్మారి, సంఘర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సంక్షోభం, అస్థిరత కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో భారత్ వైపు చూస్తోందని వివరించారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే..
తిట్లు, ఆరోపణలను జనం అంగీకరిస్తారా?
‘‘140 కోట్ల మంది భారతీయులు సాధించిన విజయాలను కొందరు(విపక్ష నేతలు) చూడలేకపోతున్నారు. భారత్ సాధించిన ప్రగతిని ఒప్పుకోవాలంటే వారికి కష్టంగా ఉంది. సంక్షోభ సమయంలో నేను అందించిన సాయం ఏమిటో ప్రజలకు తెలుసు. మీరు (ప్రతిపక్షాలు) నన్ను తిడుతున్న తిట్లు, నాపై చేస్తున్న ఆరోపణలను జనం అంగీకరిస్తారా? కేవలం పత్రికలు, టీవీల్లోని వార్తలను చూసి జనం నాపై నమ్మకం పెంచుకోలేదు. ప్రజాసేవ పట్ల చాలా ఏళ్లుగా నా అంకితభావాన్ని చూసి నన్ను విశ్వసిస్తున్నారు. నిర్మాణాత్మక విమర్శలు చేయాల్సింది పోయి పనికిమాలిన ఆరోపణలతో ప్రతిపక్షాలు గత తొమ్మిదేళ్ల కాలాన్ని వృథా చేశాయి. కొందరు వ్యక్తులు కేవలం వారి కుటుంబం కోసమే జీవిస్తున్నారు. 25 కోట్ల భారతీయ కుటుంబాల కోసం నేను జీవిస్తున్నా.
2030వ దశాబ్దం ‘భారతదేశ దశాబ్దం’
మీరు ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలను తప్పుపడుతున్నారు. ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు. మీకు అనుకూలమైన తీర్పులు ఇవ్వకపోతే సుప్రీంకోర్టును ఆక్షేపిస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధి సాధిస్తోందన్న మాట వినపడితే చాలు ఆర్‌బీఐపై నిప్పులు కక్కుతున్నారు. 2014 కంటే ముందున్న దశాబ్దం మనం ‘కోల్పోయిన దశాబ్దం’. కానీ, 2030వ దశాబ్దం ‘భారతదేశ దశాబ్దం’. మొబైల్ ఇంటర్నెట్ డేటా ఖర్చు గతంలో రూ.250 ఉండేది. ఇప్పుడు అది రూ.10కి దిగివచ్చింది. దేశంలో 70 ఏళ్లలో 70 ఎయిర్‌పోర్టులు నిర్మించారు. కానీ, గత తొమ్మిదేళ్లలోనే 70కిపైగా ఎయిర్‌పోర్టులు నిర్మించాం.
‘తయారీ కేంద్రం’గా భారత్
2008లో దేశంలో జరిగిన ఉగ్రవాద దాడులను ఎవరూ మర్చిపోలేరు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే దమ్ము అప్పటి ప్రభుత్వానికి లేకుండాపోయింది. అందుకే రక్తపాతం జరిగింది, అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. యూపీఏ దుష్పరిపాలనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ముంబైలో ఉగ్రదాడి జరిగినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. 2జీ, బొగ్గు గనుల కేటాయింపు, కామన్వెల్త్ క్రీడల కుంభకోణాలు యూపీఏలో పాలనలోనే చోటుచేసుకున్నాయి. 2004–2014 దశాబ్దం కుంభకోణాలమయంగా మారింది.
దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల వల్ల ప్రజల్లో అభద్రత నెలకొంది. 2014 నుంచి ఎన్డీయే సర్కారు పాలనలో మన దేశంలో స్టార్టప్‌ల బూమ్ పెరిగింది. ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొంటున్నాం. మౌలిక సదుపాయాల కల్పన వేగంగా సాగుతోంది. మన దేశం ఇప్పుడు ‘తయారీ కేంద్రం’గా ఎదుగుతోంది. ప్రపంచం తన భవిష్యత్తు, సౌభాగ్యాన్ని భారతదేశ అభివృద్ధిలో వెతుక్కుంటోంది. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం’’ అని ప్రధాని మోదీ వివరించారు. ప్రధాని ప్రసంగం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్, వామపక్షాల సభ్యులతోపాటు కొందరు కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
దృష్టికోణాన్ని బట్టే చూస్తారు
హిందీ వ్యంగ్య రచయిత కాకా హత్రాసీ, కవి దుష్యంత్ కుమార్ చెప్పిన ద్విపదలను మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘‘అటూ ఇటూ ఎందుకు చూస్తారు. ఎవరైనా ఏదైనా వారి దృష్టికోణాన్ని బట్టే సన్నివేశాన్ని చూస్తారు’’ అని ప్రతిపక్షాలను ఉద్దేశించి చెప్పారు. అలాగే ‘‘మీ పాదాల కింద భూమి లేదు. ఆశ్చర్యం ఏమిటంటే మీరు ఇప్పటికీ ఆ విషయం నమ్మడం లేదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment