‘‘తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష’’ అనే సత్యాన్ని రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం మరచిపోయినట్లుంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘోరపరా భవం ఎదుర్కోవడంతో కేసీఆర్‌లో అసహనం తీవ్ర స్థాయికి చేరింది. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంయమనంగా ఉండవలసిందిపోయి... విచక్షణా రహితంగా రైతు, నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఇంటర్ విద్యార్థులు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలిపేందుకు ప్రజల పక్షాన బీజేపీ నిలబడటాన్ని సహించలేక కేసీఆర్ ప్రభుత్వం దుందుడుకు చర్యలకు తెరలేపింది.
అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అయిన బండి సంజయ్‌ను అరెస్టు చేయించి జైలుకు పంపించారనేది విశ్లేషకుల మాట. హైకోర్టు బండి సంజయ్ అరెస్ట్, రిమాండ్‌ల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆయన్ని విడుదల చేయాలని ఆదేశించి న్యాయ వవస్థ ఔన్నత్యాన్ని మరోసారి చాటిచెప్పింది. బండి సంజయ్‌ని అరెస్టు చేసిన 15 నిమిషాల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఎలా సాధ్యమైందని హైకోర్టు ప్రశ్నించడం పోలీసు శాఖ ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
తెలంగాణలో 317 జీఓ విషయంలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. తెలంగాణ ఉద్యమ యోధులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు 317 జీఓ కారణంగా స్థానికత విషయంలో తీవ్ర భయాందోళనలకు గురవడమే కాకుండా, పలువురు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం. తెలంగాణ సాధనకు ప్రధాన అంశాలైన నిధులు, నియామకాలు, నీళ్ళ విషయాలను కేసీఆర్ ప్రభుత్వం ఆటకెక్కించింది. అందుకే ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలు/ఉప ఎన్నికల్లో ఓటర్లు టీఆర్‌ఎస్‌ను ఓడించి, బీజేపీని గెలిపించారు. (చదవండి: ఈ జీఓతో సమస్య మళ్లీ మొదటికి!)
ఇచ్చిన హామీలను కేసీఆర్ మరచిపోయారు. దళితు డిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తానే ముఖ్యమంత్రి పీఠమెక్కడమే కాకుండా... వారికి ఇస్తామన్న మూడెకరాల భూమి విషయంలోనూ కేసీఆర్ మాటతప్పారు. ఇటీవల హడావుడిగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కూడా ఇప్పటికీ అమలు చేయడం లేదు. ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన నిరుద్యోగుల్లో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక రైతులను వరి పంట వేయవద్దని, వరి వేస్తే ఉరే అన్న ధోరణిలో కేసీఆర్ భయపెడుతున్నారు.
ధాన్యం కొనుగోలులోని జాప్యం కారణంగా పలువురు రైతులు కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో వరి కుప్పలపైనే దిగులుతో ప్రాణాలు వదిలిన విషయం ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. వరి కొనకపోవడానికి కారణం కేంద్రమే అన్న ధోరణిలో రాష్ట్రం వ్యవహరించడం శోచనీయం. రైతులు వాస్తవాలు గ్రహించారు కాబట్టే బీజేపీ రైతులకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలకు పూర్తిగా అండగా నిలిచారు. దేశంలో బాయిల్డ్ రైస్ వాడకం తగ్గడమే కాకుండా వరి ఉత్పత్తి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం తాము బాయిల్డ్ రైస్ కొనబోమని ఎప్పుడో స్పష్టం చేసింది. అందుకు అంగీకరించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పి రైతుల ఊపిరి తీసింది. రాష్ట్రానికి కేంద్రం సహకారం, సహాయం అందే విషయంలో అన్ని విధాలా కృషి చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇటీవల కేసీఆర్ అభ్యంతర పదజాలంతో దూషించడం తనలో పెరిగిన అసహనానికి మరో ఉదాహరణగా చెప్పవచ్చు. (చదవండి: తప్పు చేసినా శిక్షకు అతీతులా?)
ప్రజామోదం లేకుండా ప్రభుత్వం ఏమీ సాధించలేదు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులు 317 జీఓ విషయంలో తీవ్ర భయాందోళనలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా వారికి ధైర్యం చెప్పాల్సిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికీ చలించకపోవడం శోచనీయం. ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న 317 జీఓలో తగిన సవరణలను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (చదవండి: ఈ కశ్మీర్ లెక్క కరెక్టేనా?)
- శ్యామ్ సుందర్ వరయోగి
బీజేపీ రాష్ట్ర నాయకులు
Comments
Please login to add a commentAdd a comment