Job transfers
-
ఐదేళ్లు ఒకేచోట ఉంటే స్థానచలనం అంటూనే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ బదిలీల్లో విద్యాశాఖను మినహాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖలో గతేడాది ఉపాధ్యాయుల బదిలీలు పూర్తవడం, విడతల వారీగా డీఈవోలు, ఆర్జేడీల బదిలీలు పూర్తవడంతో ఈ శాఖను ప్రస్తుత సాధారణ బదిలీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రామీణ నేపథ్యం ఉన్న మండలాల్లో పనిచేస్తున్న వారు, ఆరోగ్య సమస్యలున్న ఎంఈవోలు మరోచోటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో ఐదు సంవత్సరాలు ఒకేచోట సర్వీసు ఉన్నవారికి తప్పనిసరిగా స్థానచలనం కల్పించాలని నిర్ణయించింది. అంతకంటే సర్వీసు ఉన్నవారి అభ్యర్థన (రిక్వెస్ట్) మేరకు జీరో సర్వీసును పరిగణనలోకి తీసుకుని బదిలీ చేయాలని నిబంధనల్లో పేర్కొన్న ప్పటికీ.. ఆ పరిధి నుంచి విద్యాశాఖను పక్కన పెట్టడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017లో సర్వీసులోకి వచ్చిన దాదాపు 679 మంది మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవో) గత ఏడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నా.. వారిని ప్రభుత్వం విస్మరించడం పట్ల వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా..వాస్తవానికి విద్యాశాఖలో మండలానికి ఒకరు చొప్పున మొత్తం 679 మంది ఎంఈవో పోస్టులు ఎప్పటి నుంచో ఉన్నాయి. కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేయడంతో మొత్తం ఎంఈవో పోస్టుల సంఖ్య 692కి చేరింది. ఇదిలా ఉండగా, మండల స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు గత ప్రభుత్వం 2023లో మండలానికి రెండో ఎంఈవో పోస్టును మంజూరు చేసి, జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న 679 మంది ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి ఎంఈవో–2గా నియమించింది. దీంతో ఎంఈవో పోస్టుల సంఖ్య 1,371కి పెరిగింది. ఎంఈవో–2లు తాజాగా రావడంతో పాటు దాదాపు అందరూ కోరుకున్న చోటనే పోస్టింగ్ పొందారు. కానీ, గత ఏడేళ్లుగా ఒకే మండలంలో పనిచేస్తున్న ఎంఈవో–1లకు ప్రస్తుతం చేపట్టిన సాధారణ బదిలీ ల్లో అవకాశం ఇవ్వకపోవడంపై వారిలో ఆందోళన వ్యక్తం అవుతుంది. సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని ఎంఈవో–1 రాష్ట్ర అసోసియేషన్ విద్యాశాఖ మంత్రితో పాటు విద్యాశాఖలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. -
నేలవిడిచి సాముచేయవద్దు!
‘‘తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష’’ అనే సత్యాన్ని రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం మరచిపోయినట్లుంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరపరా భవం ఎదుర్కోవడంతో కేసీఆర్‌లో అసహనం తీవ్ర స్థాయికి చేరింది. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంయమనంగా ఉండవలసిందిపోయి... విచక్షణా రహితంగా రైతు, నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఇంటర్ విద్యార్థులు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలిపేందుకు ప్రజల పక్షాన బీజేపీ నిలబడటాన్ని సహించలేక కేసీఆర్ ప్రభుత్వం దుందుడుకు చర్యలకు తెరలేపింది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అయిన బండి సంజయ్‌ను అరెస్టు చేయించి జైలుకు పంపించారనేది విశ్లేషకుల మాట. హైకోర్టు బండి సంజయ్ అరెస్ట్, రిమాండ్ల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆయన్ని విడుదల చేయాలని ఆదేశించి న్యాయ వవస్థ ఔన్నత్యాన్ని మరోసారి చాటిచెప్పింది. బండి సంజయ్‌ని అరెస్టు చేసిన 15 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఎలా సాధ్యమైందని హైకోర్టు ప్రశ్నించడం పోలీసు శాఖ ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. తెలంగాణలో 317 జీఓ విషయంలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. తెలంగాణ ఉద్యమ యోధులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు 317 జీఓ కారణంగా స్థానికత విషయంలో తీవ్ర భయాందోళనలకు గురవడమే కాకుండా, పలువురు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం. తెలంగాణ సాధనకు ప్రధాన అంశాలైన నిధులు, నియామకాలు, నీళ్ళ విషయాలను కేసీఆర్ ప్రభుత్వం ఆటకెక్కించింది. అందుకే ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలు/ఉప ఎన్నికల్లో ఓటర్లు టీఆర్ఎస్ను ఓడించి, బీజేపీని గెలిపించారు. (చదవండి: ఈ జీఓతో సమస్య మళ్లీ మొదటికి!) ఇచ్చిన హామీలను కేసీఆర్ మరచిపోయారు. దళితు డిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తానే ముఖ్యమంత్రి పీఠమెక్కడమే కాకుండా... వారికి ఇస్తామన్న మూడెకరాల భూమి విషయంలోనూ కేసీఆర్ మాటతప్పారు. ఇటీవల హడావుడిగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కూడా ఇప్పటికీ అమలు చేయడం లేదు. ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన నిరుద్యోగుల్లో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక రైతులను వరి పంట వేయవద్దని, వరి వేస్తే ఉరే అన్న ధోరణిలో కేసీఆర్ భయపెడుతున్నారు. ధాన్యం కొనుగోలులోని జాప్యం కారణంగా పలువురు రైతులు కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో వరి కుప్పలపైనే దిగులుతో ప్రాణాలు వదిలిన విషయం ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. వరి కొనకపోవడానికి కారణం కేంద్రమే అన్న ధోరణిలో రాష్ట్రం వ్యవహరించడం శోచనీయం. రైతులు వాస్తవాలు గ్రహించారు కాబట్టే బీజేపీ రైతులకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలకు పూర్తిగా అండగా నిలిచారు. దేశంలో బాయిల్డ్ రైస్ వాడకం తగ్గడమే కాకుండా వరి ఉత్పత్తి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం తాము బాయిల్డ్ రైస్ కొనబోమని ఎప్పుడో స్పష్టం చేసింది. అందుకు అంగీకరించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పి రైతుల ఊపిరి తీసింది. రాష్ట్రానికి కేంద్రం సహకారం, సహాయం అందే విషయంలో అన్ని విధాలా కృషి చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇటీవల కేసీఆర్ అభ్యంతర పదజాలంతో దూషించడం తనలో పెరిగిన అసహనానికి మరో ఉదాహరణగా చెప్పవచ్చు. (చదవండి: తప్పు చేసినా శిక్షకు అతీతులా?) ప్రజామోదం లేకుండా ప్రభుత్వం ఏమీ సాధించలేదు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులు 317 జీఓ విషయంలో తీవ్ర భయాందోళనలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా వారికి ధైర్యం చెప్పాల్సిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికీ చలించకపోవడం శోచనీయం. ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న 317 జీఓలో తగిన సవరణలను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (చదవండి: ఈ కశ్మీర్ లెక్క కరెక్టేనా?) - శ్యామ్ సుందర్ వరయోగి బీజేపీ రాష్ట్ర నాయకులు -
ఈ జీఓతో సమస్య మళ్లీ మొదటికి!
ఘన చరిత్ర గల తెలంగాణ ఉద్యమం ముల్కీ నిబంధనలతో మొదలై 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సుఖాంతం అయిందని అను కున్నాం. కానీ 317 జీ.ఓ తో సమస్య మళ్లీ మొదటికి వస్తుందని అనుకోలేదు. తెలంగాణ ఉద్యమ చరిత్ర గలవారి ప్రభుత్వంలో ఈ విధమైన పరిస్థితి దాపురించడం శోచనీయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 371డి అధికరణ అవసరం లేదని కొందరు, భౌగోళిక తెలంగాణలో కూడ చాలా అంతరాలు ఉన్నాయని 371డి అధికరణ కొత్త రాష్ట్రంలో కూడా అవసరమని మెజార్టీ సమాజం అభి ప్రాయం వ్యక్తం చేసింది. దానికి అనుగుణంగానే కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు 2018లో వెలువడ్డాయి. అయితే ఇక్కడే అసలు సమస్య ప్రారంభమయ్యింది. నూతన రాష్ట్రపతి ఉత్తర్వులు– 95:5 ప్రకారం కొత్త నియామకాలు చేపట్టనున్నందువల్ల స్థానికతకు పెద్దపీట వేస్తున్నట్లు అర్థమయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం కూడా అదే. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 124 తేదీ 30–8–2018 ప్రకారం 31 జిల్లాలను 7 జోన్లుగా, 2 మల్టీ జోన్లుగా ఏర్పరచడం, తదుపరి 128 జీవో ప్రకారం ముప్పై మూడు జిల్లాలకు అనుమతి పొందడం చాలా మంచి పరిణామమే. అయితే 10 జిల్లాల ఉద్యోగ, ఉపాధ్యాయులను 33 జిల్లాలకు కేటాయించడానికి కొత్తగా విడుదలైన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానికత అనే పదం లేకపోవడం సీనియార్టీ అనే పదం మాత్రమే ఉండటంతో ఏ స్థానికత కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందో, ఏ స్థానికులకు ప్రయోజనం కల్పించాలని కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయో... ఆ స్థానికులే ఉద్యోగ, ఉపాధ్యాయ కేటాయింపుల్లో స్థానికేతరులు అవుతున్నారు. స్థానికతను వదిలిపెట్టి సీనియారిటీని కొలమానంగా తీసుకోవడం వల్ల సీనియర్లు రంగారెడ్డి లాంటి నగర జిల్లాలకు, ఉమ్మడి జిల్లా కేంద్ర పట్టణాలకు పరిమితమై జూనియర్లు గ్రామీణ ప్రాంతాలకే కాకుండా ఏకంగా సొంత జిల్లాలను వదిలి వేరే జిల్లాలకు కేటాయింపునకు గురయ్యారు. సర్వీస్‌లో సీనియర్ అయినా, క్యాడర్లో జూనియర్ ఉపాధ్యాయులు అయితే కూడా వేరే జిల్లాలకు వెళ్లవలసిన అవసరం లేదు. వీరందరూ పదవీ విరమణ పొందే వరకు అదే జిల్లాలో పని చేయాల్సి వస్తుంది. మల్టీ జోనల్ పోస్టులు నిర్ణయించేటప్పుడు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాన్ని తీసుకుని స్కూల్ అసిస్టెంట్ పోస్టు జోనల్ పోస్టులుగా పేర్కొని ఉండాల్సింది. ఏఎన్ఎం,హెడ్ కానిస్టేబుల్, సీనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులు జోనల్ పోస్టులు చేసి ఆయా పోస్టులతో సమానమైన, అంతకంటే ఎక్కువ బేసిక్ పే ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టు జిల్లా పోస్ట్ చేయడం వల్ల ఆందోళన ఇంత తీవ్ర స్థాయిగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం మరో ప్రధాన సమస్య స్పౌజ్ కేటగిరి. సీనియర్ అయిన ఉద్యోగి, ఈ కేటగిరీ ద్వారా జీవిత భాగస్వాములను తమ ప్రాంతాలకు తెచ్చుకునే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని జిల్లాలో మొత్తం సీనియర్లు, మరికొన్ని జిల్లాలో మొత్తం జూనియర్లు కేటాయింపునకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే రాబోయే కాలంలో కొన్ని జిల్లాల్లో ఉద్యోగ ప్రకటన ఉండకపోవచ్చు. కొన్ని జిల్లాల్లో పెద్ద మొత్తంలో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉండొచ్చు. ఈ విధానం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే ఉద్యోగ, ఉపాధ్యా యుల కేటాయింపుల్లో సీనియార్టీ ప్రాతిపదిక కాకుండా 80:20 ప్రకారం స్థానిక, స్థానికేతరులకు పాఠశాల బోనఫైడ్ ఆధారంగా ఆయా జిల్లాలను కేటాయిం చినట్లయితే 90 శాతం సమస్య పరిష్కారం అవుతుంది. ఏ జిల్లాలో కూడా 20 శాతం కన్నా ఎక్కువ స్థానికేతరులు ఉండకపోవచ్చు. ఒకవేళ ఎక్కువగా ఉన్నా అందులో సీనియర్లకు అవకాశం ఇచ్చి స్థానికేతరులైన జూనియర్లను వారి సొంత జిల్లాలకు పంపడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కార మార్గం. - జుర్రు నారాయణ యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ టీచర్స్ యూనియన్ -
పేరుకే బదిలీ.. ఉన్నచోటే ఉద్యోగం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగంలో బదిలీలు సాధారణం. సాధారణ బదిలీల్లో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖలో కొంతమంది స్టాఫ్‌నర్సులకు స్థాన చలనం కలిగించారు. అయితే వారు కూడా బదిలీ చేసిన చోటకి వెళ్లి విధుల్లో చేరారు. కానీ, విధుల్లో చేరిన రెండు రోజులకే తిరిగి వారిని వెనక్కు పంపించేశారు. స్టాఫ్ నర్సులకు బదిలీ జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా పాత స్థానాల్లోనే ఉద్యోగ విధులు నిర్వర్తిస్తుండటం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. అదేమని అడిగితే పాతస్థానంలో కొత్తవారిని నియమించే వరకూ అక్కడే విధులు నిర్వర్తి్తంచాలని చెబుతున్న వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మొత్తంగా ప్రభుత్వ ఆదేశాలకు తూట్లు పొడిచి బదిలీల ప్రక్రియను అపహాస్యం చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 187 మంది స్టాఫ్ నర్సులకు జూన్‌లో సాధారణ బదిలీలు జరిగాయి. వారి వినతుల మేరకు వేర్వేరు ప్రాంతాల్లో ఆ స్టాఫ్ నర్సులకు పోస్టింగ్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. విధుల్లో చేరిన రెండు రోజులకే తిరిగి పాత స్థానాల్లోనే కొన్నాళ్లు పనిచేయాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. అలా ఏకంగా 150 మందిని వెనక్కు పంపించారు. బదిలీ చేసి ఇప్పటికి నాలుగు నెలలైనా పాత స్థానంలోనే వారిని కొనసాగిస్తున్నారు. తమను కొత్త స్థానంలోకి మార్చాలంటూ స్టాఫ్ నర్సులు ప్రతి రోజూ వైద్య విధాన పరిషత్ కమిషనర్‌ను వేడుకుంటున్నారు. కమిషనర్ ప్రతిపాదనను పట్టించుకోని ఉన్నతాధికారులు బదిలీ అయి తిరిగి వెనక్కి వచ్చిన స్టాఫ్ నర్సులు తమకు న్యాయం చేయాలని కోరుతూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ శివప్రసాద్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇదే విషయాన్ని కమిషనర్ ఉన్నతాధికారులకు విన్నవించినా కూడా ఆయన గోడును ఎవరూ పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని నర్సులు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దృష్టికి కూడా తీసుకొచ్చినా సమస్య పరిష్కారం కాకపోవటంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత చోట సిబ్బంది కొరత ఉంటే ముందే ఆలోచించాలి లేదా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి గానీ బదిలీ అయ్యాక మళ్లీ పాతస్థానంలో పనిచేయించడం సరికాదని స్టాఫ్ నర్సులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని అవసరమైతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకూ విన్నవించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
25 నుంచి బదిలీలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల కసరత్తు మొదలైంది. ఈ నెల 25 నుంచి జూన్ 15 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. బదిలీల మార్గదర్శకాల రూపకల్పనకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా సభ్యుడిగా, ఆర్థిక ముఖ్య కార్యదర్శి ఎన్.శివశంకర్ మెంబర్ కన్వీనర్‌గా ఉన్నారు. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను పది రోజుల్లో సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సంప్రదింపులు జరిపి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని నిర్దేశించింది. కమిటీ గురువారం నుంచే కసరత్తు ప్రారంభించింది. అజయ్ మిశ్రా అందుబాటులో లేకపోవటంతో అధర్ సిన్హా ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సచివాలయంలో కాసేపు సమావేశమయ్యారు. బదిలీల మార్గదర్శకాలకు అనుసరించాల్సిన రూట్ మ్యాప్‌పై చర్చించారు. గతంలో ఉన్న నిబంధనలు కట్టుదిట్టంగా ఉన్నాయని, వాటినే ఈసారి అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిపాదించారు. శుక్రవారం అజయ్ మిశ్రా నేతృత్వంలో జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. వారంలోనే మార్గదర్శకాలు! పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీ శాఖ అధికారులతోనూ కమిటీ సంప్రదింపులు జరపనుంది. ఎన్నికల షెడ్యూల్ అంచనాలను దృష్టిలో పెట్టుకొని బదిలీ తేదీలు ఖరారు చేయనుంది. పది రోజుల గడువిచ్చినా వారం రోజుల్లోనే బదిలీల మార్గదర్శకాలు రూపొందించేందుకు కమిటీ కసరత్తు చేస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా జూన్ 15 లోపు బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పారదర్శకతకు పెద్దపీట వేయాలని, అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ఏడాది ఉపాధ్యాయుల బదిలీల సందర్భంగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇది పలువురు అధికారులను సస్పెండ్ చేసేంత వరకు వెళ్లింది. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, అప్పట్నుంచీ బదిలీలపై నిషేధం విధించింది. తాజాగా సీఎం బదిలీలకు పచ్చజెండా ఊపడంతోపాటు తప్పు జరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కమిటీ సత్వర సాధారణ బదిలీలపైనే దృష్టి కేంద్రీకరించనుంది. ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలను ఆన్లైన్లో నిర్వహించే ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉంది. -
ఉద్యోగ బదిలీల మార్గదర్శకాలు విడుదల
- భార్యాభర్తలు, పరస్పర బదిలీలకు వెసులుబాటు - మార్గదర్శకాలు జారీ చేసిన రెండు రాష్ట్రాల సీఎస్‌లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. అంతర్ రాష్ట్ర బదిలీలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు.. తాజాగా సంబంధిత మార్గదర్శకాలు విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వం తుది కేటాయింపులు చేసినా, రాష్ట్ర కేడర్‌లో పనిచేసే ఉద్యోగుల పరస్పర బదిలీలకు ఆమోదం తెలిపాయి. భార్యాభర్తలతో పాటు స్థానిక, జిల్లా, జోనల్, మల్టీజోనల్ వారీగా పరస్పర బదిలీలకు వీలు కల్పిం చాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సంయుక్తంగా మార్గదర్శకాలు రూపొందించారు. స్థానికత ఆధారం గా విడివిడిగా రెండు రాష్ట్రాల్లో పని చేస్తున్న భార్యాభర్తలకు బదిలీ అవకాశం కల్పించారు. వీరితో పాటు జిల్లా, మండల పరిషత్, మున్సిపాలిటీల్లో పని చేస్తున్న ఉద్యోగులు పరస్పర అంగీకారంతో బదిలీ చేసుకునే వీలుంది. అంతర్ రాష్ట్ర బదిలీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సిఫార్సుల ఆధారంగా బదిలీలకు అవకాశం కల్పించనున్నారు. బదిలీ కోరుకునే ఉద్యోగులు సంబంధిత ఉత్తర్వులు విడుదలైన నెల రోజుల్లో తమ శాఖల హెచ్‌వోడీల వద్ద దరఖాస్తు చేసుకోవాలి. 4 పేజీలున్న ఈ మార్గదర్శకాల్లో దరఖాస్తు నమూనాను సైతం పొందుపరిచారు. దరఖాస్తులు పెరగొచ్చు! పరస్పర బదిలీలకు ఇప్పటికే దాదాపు 347 మంది దరఖాస్తు చేసుకున్నారు. భార్యాభర్తల కేటగిరీలో 176, వ్యక్తిగతంగా 1,432 మంది దరఖాస్తు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బదిలీలకు రెండు రాష్ట్రాలు పచ్చజెండా ఊపడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలుండగా.. ఏపీలో 60 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. బదిలీల సందర్భంగా వయోపరి మితి కూడా ప్రధానంగా మారుతుందని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భార్యాభర్తల కేటగిరీలో ఏపీ ఉద్యోగులు ఎక్కువగా హైదరాబాద్‌కు వచ్చేందుకు మొగ్గు చూపుతారనే వాదనలు వినిపిస్తున్నాయి.