ఉద్యోగ బదిలీల మార్గదర్శకాలు విడుదల
- భార్యాభర్తలు, పరస్పర బదిలీలకు వెసులుబాటు
- మార్గదర్శకాలు జారీ చేసిన రెండు రాష్ట్రాల సీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. అంతర్ రాష్ట్ర బదిలీలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు.. తాజాగా సంబంధిత మార్గదర్శకాలు విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వం తుది కేటాయింపులు చేసినా, రాష్ట్ర కేడర్‌లో పనిచేసే ఉద్యోగుల పరస్పర బదిలీలకు ఆమోదం తెలిపాయి. భార్యాభర్తలతో పాటు స్థానిక, జిల్లా, జోనల్, మల్టీజోనల్ వారీగా పరస్పర బదిలీలకు వీలు కల్పిం చాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సంయుక్తంగా మార్గదర్శకాలు రూపొందించారు. స్థానికత ఆధారం గా విడివిడిగా రెండు రాష్ట్రాల్లో పని చేస్తున్న భార్యాభర్తలకు బదిలీ అవకాశం కల్పించారు.
వీరితో పాటు జిల్లా, మండల పరిషత్, మున్సిపాలిటీల్లో పని చేస్తున్న ఉద్యోగులు పరస్పర అంగీకారంతో బదిలీ చేసుకునే వీలుంది. అంతర్ రాష్ట్ర బదిలీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సిఫార్సుల ఆధారంగా బదిలీలకు అవకాశం కల్పించనున్నారు. బదిలీ కోరుకునే ఉద్యోగులు సంబంధిత ఉత్తర్వులు విడుదలైన నెల రోజుల్లో తమ శాఖల హెచ్‌వోడీల వద్ద దరఖాస్తు చేసుకోవాలి. 4 పేజీలున్న ఈ మార్గదర్శకాల్లో దరఖాస్తు నమూనాను సైతం పొందుపరిచారు.
దరఖాస్తులు పెరగొచ్చు!
పరస్పర బదిలీలకు ఇప్పటికే దాదాపు 347 మంది దరఖాస్తు చేసుకున్నారు. భార్యాభర్తల కేటగిరీలో 176, వ్యక్తిగతంగా 1,432 మంది దరఖాస్తు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బదిలీలకు రెండు రాష్ట్రాలు పచ్చజెండా ఊపడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలుండగా.. ఏపీలో 60 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. బదిలీల సందర్భంగా వయోపరి మితి కూడా ప్రధానంగా మారుతుందని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భార్యాభర్తల కేటగిరీలో ఏపీ ఉద్యోగులు ఎక్కువగా హైదరాబాద్‌కు వచ్చేందుకు మొగ్గు చూపుతారనే వాదనలు వినిపిస్తున్నాయి.