ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల కసరత్తు మొదలైంది. ఈ నెల 25 నుంచి జూన్ 15 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. బదిలీల మార్గదర్శకాల రూపకల్పనకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా సభ్యుడిగా, ఆర్థిక ముఖ్య కార్యదర్శి ఎన్.శివశంకర్ మెంబర్ కన్వీనర్‌గా ఉన్నారు. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను పది రోజుల్లో సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సంప్రదింపులు జరిపి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని నిర్దేశించింది. కమిటీ గురువారం నుంచే కసరత్తు ప్రారంభించింది. అజయ్ మిశ్రా అందుబాటులో లేకపోవటంతో అధర్ సిన్హా ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సచివాలయంలో కాసేపు సమావేశమయ్యారు. బదిలీల మార్గదర్శకాలకు అనుసరించాల్సిన రూట్ మ్యాప్‌పై చర్చించారు. గతంలో ఉన్న నిబంధనలు కట్టుదిట్టంగా ఉన్నాయని, వాటినే ఈసారి అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిపాదించారు. శుక్రవారం అజయ్ మిశ్రా నేతృత్వంలో జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి.
వారంలోనే మార్గదర్శకాలు!
పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీ శాఖ అధికారులతోనూ కమిటీ సంప్రదింపులు జరపనుంది. ఎన్నికల షెడ్యూల్ అంచనాలను దృష్టిలో పెట్టుకొని బదిలీ తేదీలు ఖరారు చేయనుంది. పది రోజుల గడువిచ్చినా వారం రోజుల్లోనే బదిలీల మార్గదర్శకాలు రూపొందించేందుకు కమిటీ కసరత్తు చేస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా జూన్ 15 లోపు బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పారదర్శకతకు పెద్దపీట వేయాలని, అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ఏడాది ఉపాధ్యాయుల బదిలీల సందర్భంగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇది పలువురు అధికారులను సస్పెండ్ చేసేంత వరకు వెళ్లింది. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, అప్పట్నుంచీ బదిలీలపై నిషేధం విధించింది. తాజాగా సీఎం బదిలీలకు పచ్చజెండా ఊపడంతోపాటు తప్పు జరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కమిటీ సత్వర సాధారణ బదిలీలపైనే దృష్టి కేంద్రీకరించనుంది. ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలను ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment