2017 నుంచి 692 మంది ఎంఈవోలు అదే స్థానంలో..
విద్యాశాఖ నిర్వాకంపై ఎంఈవో–1ల ఆందోళన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ బదిలీల్లో విద్యాశాఖను మినహాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖలో గతేడాది ఉపాధ్యాయుల బదిలీలు పూర్తవడం, విడతల వారీగా డీఈవోలు, ఆర్జేడీల బదిలీలు పూర్తవడంతో ఈ శాఖను ప్రస్తుత సాధారణ బదిలీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రామీణ నేపథ్యం ఉన్న మండలాల్లో పనిచేస్తున్న వారు, ఆరోగ్య సమస్యలున్న ఎంఈవోలు మరోచోటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో ఐదు సంవత్సరాలు ఒకేచోట సర్వీసు ఉన్నవారికి తప్పనిసరిగా స్థానచలనం కల్పించాలని నిర్ణయించింది. అంతకంటే సర్వీసు ఉన్నవారి అభ్యర్థన (రిక్వెస్ట్) మేరకు జీరో సర్వీసును పరిగణనలోకి తీసుకుని బదిలీ చేయాలని నిబంధనల్లో పేర్కొన్న ప్పటికీ.. ఆ పరిధి నుంచి విద్యాశాఖను పక్కన పెట్టడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017లో సర్వీసులోకి వచ్చిన దాదాపు 679 మంది మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవో) గత ఏడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నా.. వారిని ప్రభుత్వం విస్మరించడం పట్ల వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా..
వాస్తవానికి విద్యాశాఖలో మండలానికి ఒకరు చొప్పున మొత్తం 679 మంది ఎంఈవో పోస్టులు ఎప్పటి నుంచో ఉన్నాయి. కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేయడంతో మొత్తం ఎంఈవో పోస్టుల సంఖ్య 692కి చేరింది. ఇదిలా ఉండగా, మండల స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు గత ప్రభుత్వం 2023లో మండలానికి రెండో ఎంఈవో పోస్టును మంజూరు చేసి, జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న 679 మంది ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి ఎంఈవో–2గా నియమించింది.
దీంతో ఎంఈవో పోస్టుల సంఖ్య 1,371కి పెరిగింది. ఎంఈవో–2లు తాజాగా రావడంతో పాటు దాదాపు అందరూ కోరుకున్న చోటనే పోస్టింగ్ పొందారు. కానీ, గత ఏడేళ్లుగా ఒకే మండలంలో పనిచేస్తున్న ఎంఈవో–1లకు ప్రస్తుతం చేపట్టిన సాధారణ బదిలీ ల్లో అవకాశం ఇవ్వకపోవడంపై వారిలో ఆందోళన వ్యక్తం అవుతుంది. సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని ఎంఈవో–1 రాష్ట్ర అసోసియేషన్ విద్యాశాఖ మంత్రితో పాటు విద్యాశాఖలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment