meo posts
-
ఐదేళ్లు ఒకేచోట ఉంటే స్థానచలనం అంటూనే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ బదిలీల్లో విద్యాశాఖను మినహాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖలో గతేడాది ఉపాధ్యాయుల బదిలీలు పూర్తవడం, విడతల వారీగా డీఈవోలు, ఆర్జేడీల బదిలీలు పూర్తవడంతో ఈ శాఖను ప్రస్తుత సాధారణ బదిలీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రామీణ నేపథ్యం ఉన్న మండలాల్లో పనిచేస్తున్న వారు, ఆరోగ్య సమస్యలున్న ఎంఈవోలు మరోచోటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో ఐదు సంవత్సరాలు ఒకేచోట సర్వీసు ఉన్నవారికి తప్పనిసరిగా స్థానచలనం కల్పించాలని నిర్ణయించింది. అంతకంటే సర్వీసు ఉన్నవారి అభ్యర్థన (రిక్వెస్ట్) మేరకు జీరో సర్వీసును పరిగణనలోకి తీసుకుని బదిలీ చేయాలని నిబంధనల్లో పేర్కొన్న ప్పటికీ.. ఆ పరిధి నుంచి విద్యాశాఖను పక్కన పెట్టడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017లో సర్వీసులోకి వచ్చిన దాదాపు 679 మంది మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవో) గత ఏడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నా.. వారిని ప్రభుత్వం విస్మరించడం పట్ల వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా..వాస్తవానికి విద్యాశాఖలో మండలానికి ఒకరు చొప్పున మొత్తం 679 మంది ఎంఈవో పోస్టులు ఎప్పటి నుంచో ఉన్నాయి. కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేయడంతో మొత్తం ఎంఈవో పోస్టుల సంఖ్య 692కి చేరింది. ఇదిలా ఉండగా, మండల స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు గత ప్రభుత్వం 2023లో మండలానికి రెండో ఎంఈవో పోస్టును మంజూరు చేసి, జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న 679 మంది ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి ఎంఈవో–2గా నియమించింది. దీంతో ఎంఈవో పోస్టుల సంఖ్య 1,371కి పెరిగింది. ఎంఈవో–2లు తాజాగా రావడంతో పాటు దాదాపు అందరూ కోరుకున్న చోటనే పోస్టింగ్ పొందారు. కానీ, గత ఏడేళ్లుగా ఒకే మండలంలో పనిచేస్తున్న ఎంఈవో–1లకు ప్రస్తుతం చేపట్టిన సాధారణ బదిలీ ల్లో అవకాశం ఇవ్వకపోవడంపై వారిలో ఆందోళన వ్యక్తం అవుతుంది. సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని ఎంఈవో–1 రాష్ట్ర అసోసియేషన్ విద్యాశాఖ మంత్రితో పాటు విద్యాశాఖలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. -
AP: మండలానికి ఇద్దరు ఎంఈవోలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో చేపట్టిన విద్యారంగ సంస్కరణల్లో భాగంగా మరో కీలక నిర్ణయం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. పాఠశాల విద్యా ప్రమాణాలను పెంపొందించేలా ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున మండల విద్యాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం జీవో 154 జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఒక ఎంఈవో విద్యా వ్యవహారాలు (అకడమిక్) పర్యవేక్షించనుండగా మరో ఎంఈవో పరిపాలన (అడ్మినిస్ట్రేటివ్) బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందుకోసం మండల విద్యాధికారుల పోస్టులను రెట్టింపు చేస్తూ కొత్తగా 692 పోస్టులను మంజూరు చేశారు. తద్వారా దశాబ్దాలుగా ఉపాధ్యాయులు నిరీక్షిస్తున్న ఎంఈవో పోస్టుల భర్తీకి మార్గం సుగమం కావడంతోపాటు వివిధ యాజమాన్య స్కూళ్ల వివాదానికి తెర పడింది. ఇది చరిత్రాత్మక ఘట్టమని, గతంలో ఏ ప్రభుత్వమూ సాహసించని విధంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. పటిష్ట విద్యా వ్యవస్థకు పునాది రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పునాది స్థాయి నుంచి బలోపేతం చేస్తూ కీలక సంస్కరణలతో పాటు మౌలిక సదుపాయాలతో పాఠశాలలను తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రైమరీ నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తూ రూ.16 వేల కోట్లతో మనబడి నాడు – నేడు ద్వారా మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. తొలిదశలో ఇప్పటికే 15,715 స్కూళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రెండో విడత స్కూళ్ల పనులు కూడా ప్రారంభించింది. ఫౌండేషన్ విద్య ప్రవేశపెడుతూ ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులమ్‌ను మార్పు చేయడంతోపాటు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు వీలుగా 1.80 లక్షల మంది ఉపాధ్యాయులకు ఇప్పటికే తర్ఫీదు ఇచ్చింది. విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉండేలా బైలింగ్యువల్ (ద్విభాషా) పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. అత్యున్నత ప్రమాణాలు నెలకొనేలా సీబీఎస్ఈ బోధన అనుసరిస్తోంది. విద్యార్ధులకు జగనన్న విద్యాకానుక అందచేస్తోంది. పోటీ ప్రపంచంలో రాణించేలా డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తోంది. మరోపక్క ప్రఖ్యాత బైజూస్ సంస్థ నుంచి అత్యుత్తమ కంటెంట్ విద్యార్ధులకు ఉచితంగా అందించేలా చర్యలు చేపట్టింది. 4వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్ధులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎనిమిదో తరగతి నుంచే ట్యాబ్‌లు సమకూరుస్తోంది. ఏటా నాలుగు లక్షల మందికి పైగా విద్యార్ధులతోపాటు టీచర్లకు కూడా ట్యాబ్‌లను పంపిణీ చేయనుంది. వీటికోసం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధిక బడ్జెట్‌ను విద్యారంగానికి కేటాయిస్తోంది. మౌలిక సదుపాయాలు పెంచడమే కాకుండా విద్యా ప్రమాణాల్లో గుణాత్మక మార్పుల కోసం ప్రాధాన్యమిస్తోంది. క్షేత్రస్థాయిలో పక్కా పర్యవేక్షణ పాఠశాల విద్యలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలవుతుండడంతో ఎంఈవోలు, ఇన్‌చార్జ్‌లపై భారం పెరిగింది. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను ఒక్కరే పర్యవేక్షించడం కష్టంగా మారుతోంది. విద్యారంగ సంస్కరణలు సత్ఫలితాలనివ్వాలంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కీలకం. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలకు వేర్వేరుగా ఎంఈవోలను నియమించాలని నిర్ణయించింది. ప్రతి మండలంలో ఎంఈవో–1, ఎంఈవో–2 పోస్టులుండేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో 679 మండలాల్లో ఒక్కో మండలానికి రెండు చొప్పున 1,358 ఎంఈవో పోస్టులను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం 666 ఎంఈవో పోస్టులుండగా కొత్తగా 692 పోస్టులను మంజూరు చేసింది. దీనికి ప్రతిగా 1,145 క్రాఫ్ట్, డ్రాయింగ్, ఆర్ట్ టీచర్ పోస్టులను సర్దుబాటు చేయనుంది. ఎంఈవో పోస్టులకు స్కేల్ పే రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో హర్షం ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంపై అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నారు. ► మండలానికి రెండు ఎంఈవో పోస్టులు ఏర్పాటు చేస్తూ కొత్తగా 692 ఎంఈవో పోస్టులను మంజూరు చేయడం విద్యాశాఖ చరిత్రలో మరపురాని రోజు. – ఎమ్మెల్సీ కల్పలత ► కొత్తగా 692 ఎంఈవో పోస్టులను మంజూరు చేయడం చరిత్రాత్మకం. నా 23 ఏళ్ల సర్వీసులో ఇది ఎన్నడూ ఊహించనిది. ఉపాధ్యాయులందరికీ సంతోషకరమైన రోజు ఇది. – బి.ప్రతాప్‌రెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ► విద్య, పరిపాలనా కార్యక్రమాల పర్యవేక్షణకు వీలుగా మండలానికి రెండు ఎంఈవో పోస్టుల ఏర్పాటు శుభవార్త. దీనిద్వారా విద్యారంగ పునాదులు మరింత పటిష్టమవుతాయి. – డి.దేవానందరెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ► కొత్తగా 692 ఎంఈవో పోస్టుల మంజూరుతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వివాదానికి తెర పడుతుంది. ఉపాధ్యాయుల పదోన్నతులకు మార్గం సుగమం కావడంతోపాటు విద్యారంగం బలోపేతం అవుతుంది. – కాకర్ల వెంకటరామిరెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ ► మండలానికి ఇద్దరు ఎంఈవోల నియామకానికి వీలుగా కొత్త పోస్టుల మంజూరు హర్షణీయం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – సీకే వెంకటనాథ్‌రెడ్డి, గెడ్డం సుధీర్, వైఎస్సార్ టీఎఫ్ ► రెండు ఎంఈవో పోస్టుల ఏర్పాటు హర్షణీయం. ఈ తరహాలోనే అర్బన్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (యూఈవో) పోస్టులను ఏర్పాటు చేయాలి. – టి.వెంకటరెడ్డి, రవి సిద్దార్ధ, ఏపీ ఎంటీఎఫ్ ► ప్రభుత్వ నిర్ణయం ఆనందదాయకం. సర్వీసు రూల్స్ రూపొందించి ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు దామాషా పద్ధతిలో పదోన్నతులు కల్పించాలి. – గిరిప్రసాద్‌రెడ్డి, మల్లు శ్రీధర్‌రెడ్డి, ఎం.కృష్ణయ్య, కరుణానిధిమూర్తి, పీఆర్టీయూ ► ఉపాధ్యాయుల దశాబ్దాల కలను సీఎం జగన్ నెరవేర్చారు. – కె.హరికృష్ణ, ఎం.శ్రీనివాసరావు, ఎన్టీఏ ► మండలానికి ఇద్దరు ఎంఈవోల నియామకంతో పాఠశాల విద్య బలోపేతమై విద్యార్ధులకు మేలు జరుగుతుంది. – ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, ఎస్.సింహాచలం (పోర్టో), శ్రావణ్‌కుమార్, బాలాజీ (ఆపస్) ► దశాబ్దాలుగా టీచర్లు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి వీలుగా రెండు చొప్పున ఎంఈవో పోస్టులను మంజూరు చేయడం సంతోషకరం. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – సీహెచ్ కృష్ణమోహన్‌రావు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం. ► రెండో ఎంఈవో పోస్టు మంజూరు చేయడం మంచి విధానం. ఇందుకోసం ఇతర పోస్టులు రద్దు చేయడం సరికాదు. –జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి, ఏపీటీఎఫ్ ► విద్యారంగంలో 25 ఏళ్లుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు హర్షణీయం. – సరికొండ సతీష్, విద్యారంగ సంస్కరణల వేదిక వికాసం ► ప్రభుత్వ నిర్ణయంతో టీచర్లతోపాటు విద్యా ప్రమాణాలు మెరుగుపడి విద్యార్ధులకు ప్రయోజనం చేకూరుతుంది. – శరత్చంద్ర, సురేష్‌బాబు, బహుజన్ టీచర్స్ అసోసియేషన్ -
ఎంఈఓ పోస్టుల భర్తీకి 9న కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారి పోస్టుల్లో అర్హులైన ప్రధానోపాధ్యాయులను బదిలీపై నియమించేందుకు ఈనెల 9న కడప ఆర్జేడీ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇదివరకే ఆమోదించిన సీనియార్టీ జాబితా ప్రకారమే ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. సీరియల్ నంబరు 220 నుంచి (పాండరంగ) అర్హులైన హెచ్ఎంలు హాజరుకావాలని కోరారు. -
45 మందికి ఎంఈఓ పోస్టింగ్‌లు
► 18 ఏళ్ల తరువాత పోస్టుల భర్తీ ► పుల్లలచెరువుపై కొనసాగుతున్న సందిగ్ధత ► ఖాళీగా సీఎస్‌పురం, లింగసముద్రం ఒంగోలు: జిల్లాలో సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారుల పోస్టింగ్‌లు ఖరారయ్యాయి. గుంటూరు ఆర్జేడీ కె.శ్రీనివాసరెడ్డి ఆదివారం సాయంత్రం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ మేరకు మొత్తం 48 మండలాల్లో ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండగా 45 మందికి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఈ నియామకాలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే ఎంఈఓలుగా ప్రకటించాలంటూ ఒక వైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులను సైతం రూరల్ మండలాల ఎంఈఓలుగా కొనసాగించేందుకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులను అర్బన్ మండలాల ఎంఈఓలుగా కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగానే ఈ పోస్టింగ్‌లు ఖరారయ్యాయి. మొత్తం మీద 18 సంవత్సరాల తరువాత జిల్లాలో మండల విద్యాశాఖ అధికారుల పోస్టులను విద్యాశాఖ భర్తీచేసింది. అయితే సీఎస్ పురం, లింగసముద్రం మండలాల్లో మాత్రం ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. పుల్లలచెరువుకు సంబంధించి మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. దీనిపై సోమవారం నాటికి స్పష్టత వస్తుందని అంచనా. ఎంఈఓలు వీరే! కోటేశ్వరరావు–రాచర్ల, జి.సుబ్బరత్నం–కనిగిరి, దయానందం–సంతనూతలపాడు, ఎం.ఎస్.రాంబాబు–కందుకూరు, జి.శేషయ్య–నాగులుప్పలపాడు, వి.కోటేశ్వరరావు–సంతమాగులూరు, పద్మావతి–కొత్తపట్నం, జయరాజ్–ఇంకొల్లు, ఎం.కృష్ణ–కంభం, కాలెయ్య–గుడ్లూరు, ఏకాంబరేశ్వరరావు–వేటపాలెం, ఎంవీ సత్యన్నారాయణ–కారంచేడు, కె.ఎల్ నారాయణ–చీరాల, డి.నాగేశ్వరరావు–పర్చూరు, వెంకటరెడ్డి–పెద్దారవీడు, వెంకటేశ్వర్లు–బి.పేట, వి.రాఘవులు–బల్లికురవ, కె.వెంకటేశ్వర్లు–చినగంజాం, ఎల్.పున్నయ్య–కొరిశపాడు, డి.సుజాత–తర్లుబాడు, ఆంజనేయులు–వై.పాలెం, మస్తాన్‌నాయక్–పెద్ద దోర్నాల, ఇ.శ్రీనివాసరావు–ముండ్లమూరు, కిశోర్‌బాబు–చీమకుర్తి, వెంకటేశ్వర్లు–కొమరోలు, వస్త్రాంనాయక్–కురిచేడు, మల్లికార్జుననాయక్–త్రిపురాంతకం, నరసింహారావు – పి.సి. పల్లి, నాగేంద్రవదన్–జరుగుమల్లి, సురేఖ –కొండపి, వెంకటేశ్వర్లునాయక్–అర్ధవీడు, డాంగే–కొనకనమిట్ల, రవిచంద్ర–పొన్నలూరు, కోటేశ్వరరావు– ఉలవపాడు, టి.శ్రీనివాస్–పొదిలి, కె.రఘురామయ్య–దర్శి, సుబ్బయ్య–తాళ్లూరు, పెద్దిరాజు–హనుమంతునిపాడు, సుబ్బారావు– మర్రిపూడి, సాంబశివరావు–దొనకొండ, సుబ్రహ్మణ్యేశ్వర్–వలేటివారిపాలెం, వెంకటరెడ్డి–పామూరు, దాసు ప్రసాద్–వెలిగండ్ల, చెంచుపున్నయ్య–టంగుటూరు యథావిధిగా పది పరీక్షల విధులు వీరంతా ఎంఈఓలుగా నియమితులైనప్పటికీ పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నవారు మాత్రం తప్పనిసరిగా పరీక్షలు పూర్తయ్యేవరకు అదే స్థానంలో కొనసాగాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.విజయభాస్కర్ స్పష్టం చేశారు. పది పరీక్షలకు హాజరవుతూనే పరీక్ష అనంతరం రిలీవ్ అయి, నూతన స్థానంలో చేరవచ్చని, అయినప్పటికీ పరీక్షల డ్యూటీకి మాత్రం హాజరుకావాలన్నారు. -
కొత్త మండలాలకు ఎంఈవో పోస్టులు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన మండలాలకు మండల విద్యాధికారి (ఎంఈవో) పోస్టులను మంజూరు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. కొత్త మండలాలకి ఒక పోస్టును సృష్టించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్థిక శాఖకు ఫైలు పంపించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని గ్రామాలు పక్క మండలాలకు, పక్క జిల్లాలకు వెళ్లిపోవడంతో 125 వరకు కొత్త మండలాల్లో ఎంఈవో పోస్టులు అవసరమయ్యాయి. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించగానే ఈ పోస్టులను భర్తీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అయితే సర్వీసు రూల్స్ సమస్య ఉన్న కారణంగా వాటిని రెగ్యులర్‌గా భర్తీ చేసే అవకాశం లేనందునా, ఇన్‌ఛార్జి ఎంఈవోలుగా ఆయా మండలాల పరిధిలోని ఉన్నత పాఠశాలలకు చెందిన సీనియర్ హెడ్ మాస్టర్లకు బాధ్యతలు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటీ రెండు రోజుల్లో వె లువడే అవకాశం ఉంది. -
‘ఉమ్మడి’ ముడి వీడదా?
ఏళ్లుగా పరిష్కారం కాని టీచర్ల ఉమ్మడి రూల్సు సమస్య నిలిచిన పదోన్నతులు, పోస్టుల భర్తీ 55 డివిజన్లకు ఇన్చార్జి డీవైఈవోలే.. 555 మండలాల విద్యాధికారులు ఇన్‌చార్జీలే.. చొరవ చూపని ప్రభుత్వం సాక్షి, విజయవాడ బ్యూరో: ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు నిబంధనల వ్యవహారం అనేక సంవత్సరాలుగా పాఠశాల విద్యాశాఖను కుంగదీస్తోంది. దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండడంతో ఈ విషయం గురించి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఫలితంగా పదోన్నతులు నిలిచిపోయి కీలకమైన డీవైఈవో, ఎంఈవో పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉంటున్నాయి. గతంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్ల సర్వీసు నిబంధనలు వేర్వేరుగా ఉండేవి. 1998లో రెండు యాజమాన్యాల్లో పనిచేస్తున్న టీచర్లకు ఒకే సీనియారిటీ జాబితా తయారుచేసి ఉమ్మడి సర్వీసు నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఈ నిబంధనల ప్రకారమే ఇద్దరికీ కలిపి పదోన్నతులు ఇచ్చారు. 2005లో దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పంచాయతీరాజ్ టీచర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు పదోన్నతులపై స్టే ఇచ్చింది. కేసు అక్కడే పెండింగ్‌లో ఉంది. ఈ సమస్య పరిష్కారమైతేగానీ పదోన్నతులు ఇచ్చే అవకాశం ఉండదు. మధ్యలో 2009లో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అనుమతితో తాత్కాలిక పద్ధతిలో టీచర్లకు మాత్రం పదోన్నతులు ఇచ్చింది. ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు లేకపోవడంతో డీవైఈవో, ఎంఈవో పోస్టులు పెద్దసంఖ్యలో ఖాళీగా ఉంటున్నాయి. ఆ తర్వాత దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని ఈ సమస్యను రాష్ట్రం విడిపోయిన తర్వాత సులువుగా పరిష్కరించే అవకాశం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వ టీచర్లు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో రెండు యాజమాన్యాల్లోని ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి కోర్టులో ఉన్న ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు విద్యాశాఖ ఉన్నతాధికారులకు సూచిం చారు. కానీ ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవడంలేదు. కేసు కోర్టులో ఉంది కాబట్టి తాము ఏమీ చేయలేమని పాఠశాల విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. 10 డివిజన్లు, 107 మండలాలకే పూర్తి స్థాయి విద్యాధికారులు ఈ సమస్య పరిష్కారమవని కారణంగా అనేక సంవత్సరాల నుంచి డివిజన్, మండల స్థాయిలో విద్యాశాఖాధికారుల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. జిల్లా స్థాయిలో డీఈవో, డివిజన్ స్థాయిలో డీవైఈవో, మండల స్థాయిలో ఎంఈవో పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో డీఈవోల నియామకం వరకు చేస్తున్నా ఆ తరువాత స్థాయి నియామకాలు ఏళ్ల తరబడి నిలిచిపోయాయి. రాష్ట్రంలో డివిజన్ల స్థాయిలో 65 మంది డీవైఈవోలు పనిచేయాల్సి ఉండగా పదిమంది మాత్రమే రెగ్యులర్ డీవైఈవోలు పనిచేస్తున్నారు. మిగిలిన 55 డివిజన్లలో సీనియర్ ప్రధానోపాధ్యాయులే ఇన్చార్జి డీవైఈవోలుగా వ్యవహరిస్తున్నారు. 662 మండలాలుంటే 107 మండలాలకు మాత్రమే పూర్తిస్థాయి విద్యాశాఖాధికారులున్నారు. 555 మండలాల్లో ప్రధానోపాధ్యాయులే ఇన్చార్జి ఎంఈవోలుగా వ్యవహరిస్తున్నారు. వీరు అటు స్కూల్లో సరిగా పనిచేయలేక, ఇటు మండల స్థాయిలో అన్ని పాఠశాలల్నీ పర్యవేక్షించలేక సతమతమవుతున్నారు. ప్రధానోపాధ్యాయుల పోస్టులు కూడా పెద్దసంఖ్యలో ఖాళీగా ఉండటంతో రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు ఒకరికే అప్పగిస్తున్నారు. దీంతో ఏ స్కూలుకూ న్యాయం జరగడంలేదు. ఉమ్మడి సర్వీసు నిబంధనల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టిపెడితేగానీ ఈ పోస్టుల్ని పూర్తిస్థాయిలో భర్తీచేసే అవకాశం కనిపించడంలేదు. ఉమ్మడి రూల్స్‌తోనే న్యాయం మొత్తం ఉపాధ్యాయుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆరుశాతం మందే ఉన్నారు. 94 శాతం మంది పంచాయతీరాజ్, మున్సిపల్ ఉపాధ్యాయులున్నారు. మెజారిటీగా ఉన్న ఉపాధ్యాయులకు న్యాయం జరగాలంటే ఉమ్మడి సర్వీసు నిబంధనలు అమలు చేయాలి. కేసు కోర్టులో ఉన్నా ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. ఈ అంశం రాష్ట్ర స్థాయిలో కూడా లేదు. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో మాట్లాడితే ఉపయోగం ఉంటుంది. - సి.వి.ఎస్.మణి, పీఆర్టీయూ రాష్ట్ర నేత సుప్రీం మేరకు పదోన్నతులు ప్రభుత్వం పంచాయతీరాజ్ టీచర్ల సంఘాలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. వ్యవహారం కోర్టులో ఉందనే సాకు చూపుతూ సమస్యను పరిష్కరించడానికి ముందుకురావడంలేదు. సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ప్రభుత్వ ఉపాధ్యాయులతోనే డీవైఈవో, ఎంఈవో పోస్టులను భర్తీచేయాలి. - ఎం.సూర్యనారాయణమూర్తి, ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం గౌరవాధ్యక్షుడు