సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో చేపట్టిన విద్యారంగ సంస్కరణల్లో భాగంగా మరో కీలక నిర్ణయం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. పాఠశాల విద్యా ప్రమాణాలను పెంపొందించేలా ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున మండల విద్యాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం జీవో 154 జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఒక ఎంఈవో విద్యా వ్యవహారాలు (అకడమిక్) పర్యవేక్షించనుండగా మరో ఎంఈవో పరిపాలన (అడ్మినిస్ట్రేటివ్) బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఇందుకోసం మండల విద్యాధికారుల పోస్టులను రెట్టింపు చేస్తూ కొత్తగా 692 పోస్టులను మంజూరు చేశారు. తద్వారా దశాబ్దాలుగా ఉపాధ్యాయులు నిరీక్షిస్తున్న ఎంఈవో పోస్టుల భర్తీకి మార్గం సుగమం కావడంతోపాటు వివిధ యాజమాన్య స్కూళ్ల వివాదానికి తెర పడింది. ఇది చరిత్రాత్మక ఘట్టమని, గతంలో ఏ ప్రభుత్వమూ సాహసించని విధంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.
పటిష్ట విద్యా వ్యవస్థకు పునాది
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పునాది స్థాయి నుంచి బలోపేతం చేస్తూ కీలక సంస్కరణలతో పాటు మౌలిక సదుపాయాలతో పాఠశాలలను తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రైమరీ నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తూ రూ.16 వేల కోట్లతో మనబడి నాడు – నేడు ద్వారా మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది.
తొలిదశలో ఇప్పటికే 15,715 స్కూళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రెండో విడత స్కూళ్ల పనులు కూడా ప్రారంభించింది. ఫౌండేషన్ విద్య ప్రవేశపెడుతూ ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులమ్‌ను మార్పు చేయడంతోపాటు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు వీలుగా 1.80 లక్షల మంది ఉపాధ్యాయులకు ఇప్పటికే తర్ఫీదు ఇచ్చింది.
విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉండేలా బైలింగ్యువల్ (ద్విభాషా) పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. అత్యున్నత ప్రమాణాలు నెలకొనేలా సీబీఎస్‌ఈ బోధన అనుసరిస్తోంది. విద్యార్ధులకు జగనన్న విద్యాకానుక అందచేస్తోంది. పోటీ ప్రపంచంలో రాణించేలా డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తోంది.
మరోపక్క ప్రఖ్యాత బైజూస్ సంస్థ నుంచి అత్యుత్తమ కంటెంట్ విద్యార్ధులకు ఉచితంగా అందించేలా చర్యలు చేపట్టింది. 4వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్ధులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎనిమిదో తరగతి నుంచే ట్యాబ్‌లు సమకూరుస్తోంది.
ఏటా నాలుగు లక్షల మందికి పైగా విద్యార్ధులతోపాటు టీచర్లకు కూడా ట్యాబ్‌లను పంపిణీ చేయనుంది. వీటికోసం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధిక బడ్జెట్‌ను విద్యారంగానికి కేటాయిస్తోంది. మౌలిక సదుపాయాలు పెంచడమే కాకుండా విద్యా ప్రమాణాల్లో గుణాత్మక మార్పుల కోసం ప్రాధాన్యమిస్తోంది.
క్షేత్రస్థాయిలో పక్కా పర్యవేక్షణ
పాఠశాల విద్యలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలవుతుండడంతో ఎంఈవోలు, ఇన్‌చార్జ్‌లపై భారం పెరిగింది. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను ఒక్కరే పర్యవేక్షించడం కష్టంగా మారుతోంది. విద్యారంగ సంస్కరణలు సత్ఫలితాలనివ్వాలంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కీలకం. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలకు వేర్వేరుగా ఎంఈవోలను నియమించాలని నిర్ణయించింది.
ప్రతి మండలంలో ఎంఈవో–1, ఎంఈవో–2 పోస్టులుండేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో 679 మండలాల్లో ఒక్కో మండలానికి రెండు చొప్పున 1,358 ఎంఈవో పోస్టులను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం 666 ఎంఈవో పోస్టులుండగా కొత్తగా 692 పోస్టులను మంజూరు చేసింది. దీనికి ప్రతిగా 1,145 క్రాఫ్ట్, డ్రాయింగ్, ఆర్ట్ టీచర్ పోస్టులను సర్దుబాటు చేయనుంది. ఎంఈవో పోస్టులకు స్కేల్ పే రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో హర్షం
ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంపై అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నారు.
► మండలానికి రెండు ఎంఈవో పోస్టులు ఏర్పాటు చేస్తూ కొత్తగా 692 ఎంఈవో పోస్టులను మంజూరు చేయడం విద్యాశాఖ చరిత్రలో మరపురాని రోజు.
– ఎమ్మెల్సీ కల్పలత
► కొత్తగా 692 ఎంఈవో పోస్టులను మంజూరు చేయడం చరిత్రాత్మకం. నా 23 ఏళ్ల సర్వీసులో ఇది ఎన్నడూ ఊహించనిది. ఉపాధ్యాయులందరికీ
సంతోషకరమైన రోజు ఇది.
– బి.ప్రతాప్‌రెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్
► విద్య, పరిపాలనా కార్యక్రమాల పర్యవేక్షణకు వీలుగా మండలానికి రెండు ఎంఈవో పోస్టుల ఏర్పాటు శుభవార్త. దీనిద్వారా విద్యారంగ పునాదులు మరింత పటిష్టమవుతాయి.
– డి.దేవానందరెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్
► కొత్తగా 692 ఎంఈవో పోస్టుల మంజూరుతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వివాదానికి తెర పడుతుంది. ఉపాధ్యాయుల పదోన్నతులకు మార్గం సుగమం కావడంతోపాటు విద్యారంగం బలోపేతం అవుతుంది.
– కాకర్ల వెంకటరామిరెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్
► మండలానికి ఇద్దరు ఎంఈవోల నియామకానికి వీలుగా కొత్త పోస్టుల మంజూరు హర్షణీయం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– సీకే వెంకటనాథ్‌రెడ్డి, గెడ్డం సుధీర్, వైఎస్సార్ టీఎఫ్
► రెండు ఎంఈవో పోస్టుల ఏర్పాటు హర్షణీయం. ఈ తరహాలోనే అర్బన్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (యూఈవో) పోస్టులను ఏర్పాటు చేయాలి.
– టి.వెంకటరెడ్డి, రవి సిద్దార్ధ, ఏపీ ఎంటీఎఫ్
► ప్రభుత్వ నిర్ణయం ఆనందదాయకం. సర్వీసు రూల్స్ రూపొందించి ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు దామాషా పద్ధతిలో పదోన్నతులు కల్పించాలి.
– గిరిప్రసాద్‌రెడ్డి, మల్లు శ్రీధర్‌రెడ్డి, ఎం.కృష్ణయ్య, కరుణానిధిమూర్తి, పీఆర్టీయూ
► ఉపాధ్యాయుల దశాబ్దాల కలను సీఎం జగన్ నెరవేర్చారు.
– కె.హరికృష్ణ, ఎం.శ్రీనివాసరావు, ఎన్‌టీఏ
► మండలానికి ఇద్దరు ఎంఈవోల నియామకంతో పాఠశాల విద్య బలోపేతమై విద్యార్ధులకు మేలు జరుగుతుంది.
– ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, ఎస్.సింహాచలం (పోర్టో), శ్రావణ్‌కుమార్, బాలాజీ (ఆపస్)
► దశాబ్దాలుగా టీచర్లు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి వీలుగా రెండు చొప్పున
ఎంఈవో పోస్టులను మంజూరు చేయడం సంతోషకరం. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.
– సీహెచ్ కృష్ణమోహన్‌రావు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం.
► రెండో ఎంఈవో పోస్టు మంజూరు చేయడం మంచి విధానం. ఇందుకోసం ఇతర పోస్టులు రద్దు చేయడం సరికాదు.
–జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి, ఏపీటీఎఫ్
► విద్యారంగంలో 25 ఏళ్లుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు హర్షణీయం.
– సరికొండ సతీష్, విద్యారంగ సంస్కరణల వేదిక వికాసం
► ప్రభుత్వ నిర్ణయంతో టీచర్లతోపాటు విద్యా ప్రమాణాలు మెరుగుపడి విద్యార్ధులకు ప్రయోజనం చేకూరుతుంది.
– శరత్‌చంద్ర, సురేష్‌బాబు, బహుజన్ టీచర్స్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment