AP: గుడ్‌న్యూస్‌! 10 వేల మందికి పైగా టీచర్లకు పదోన్నతి.. | More than 10 thousand teachers have been promoted Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: గుడ్‌న్యూస్‌! 10 వేల మందికి పైగా టీచర్లకు పదోన్నతి..

Published Tue, Aug 30 2022 3:09 AM | Last Updated on Tue, Aug 30 2022 3:25 PM

More than 10 thousand teachers have been promoted Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదివేల మందికిపైగా ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త అందించనుంది. పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ అందడంతో టీచర్లకు మేలు చేసే ప్రక్రియకు త్వరలో శ్రీకారం చుట్టనుంది. 10 వేల మందికిపైగా టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా, ప్రధానోపాధ్యాయులుగా, మండల విద్యాశాఖాధికారులుగా, జిల్లా ఉప విద్యాశాఖాధికారులుగా పదోన్నతులు కల్పించనుంది. సెప్టెంబర్‌ నెల మొదటి వారంలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ చేపట్టేలా షెడ్యూల్‌ సిద్ధం చేసింది.

7 వేల మంది ఎస్జీటీలకు ఎస్‌ఏలుగా పదోన్నతి
రాష్ట్రంలో విద్యావ్యవస్థను పునాది నుంచి బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఫౌండేషనల్‌ విద్యా విధానాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్లలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. 3 నుంచి 8 ఏళ్ల మధ్య పిల్లల్లో మేథోపరమైన వికాసం గరిష్టంగా ఉంటుందని పలు శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించిన నేపథ్యంలో వారికి నాణ్యమైన బోధన అందేలా ఏర్పాట్లు చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి ఫౌండేషనల్‌ స్కూళ్లుగా తీర్చిదిద్దింది.

3 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల పిల్లలను హైస్కూళ్లకు అనుసంధానిస్తూ సబ్జెక్టుల వారీగా బోధనకు చర్యలు తీసుకుంది. అందుకు అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్‌ చేపట్టింది. విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలను కల్పిస్తూ ఈ చర్యలు తీసుకుంటోంది. మ్యాపింగ్‌తో ఆయా హైస్కూళ్లు, ప్రీ హైస్కూళ్లలో అవసరమైన అదనపు తరగతి గదులు, ఇతర సదుపాయాలను కల్పిస్తోంది.

ఈ స్కూళ్లలో సబ్జెక్టుల బోధనకు స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లు అవసరం కావడంతో ఎస్జీటీలలో అర్హులైన వారికి ఎస్‌ఏలుగా పదోన్నతులు కల్పించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు 7 వేల మందికి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.

హెడ్మాస్టర్లను కూడా పూర్తి స్థాయిలో నియమించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 500 హైస్కూళ్లలో హెడ్మాస్టర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో వాటిలో సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించనున్నారు. 

పదోన్నతుల కోసం అదనంగా 666 ఎంఈవో పోస్టులు
మండల విద్యాధికారుల పోస్టులు కొన్ని దశాబ్దాలుగా పూర్తిస్థాయిలో భర్తీకి నోచుకోలేదు. దీనివల్ల ప్రభుత్వం ఎన్ని రకాల విద్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నా పర్యవేక్షణ కొరవడింది. టీచర్లకు అందాల్సిన పదోన్నతులూ నిలిచిపోయాయి. రాష్ట్రంలో 666 మండల విద్యాధికారుల పోస్టులుండగా 421 మంది పనిచేస్తున్నారు. అయితే ఈ పోస్టులన్నీ తమకు సంబంధించినవని, స్థానిక సంస్థల స్కూళ్ల టీచర్లకు కేటాయించవద్దని ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదం పరిష్కారానికి సీఎం జగన్‌ చొరవ చూపారు. ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున ఎంఈవోలు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఎంఈవో పోస్టులు రెట్టింపై 1,332కి చేరాయి. 666 పోస్టులు ప్రభుత్వ టీచర్లకు, మిగతా 666 పోస్టులు స్థానిక సంస్థల (జడ్పీ) స్కూళ్ల టీచర్లకు కేటాయించారు. ఫలితంగా టీచర్లకు పదోన్నతులు రెట్టింపు అయ్యాయి. అర్హులైన హెడ్మాస్టర్లకు పదోన్నతుల ద్వారా ఈ పోస్టులలో అవకాశం కల్పించనున్నారు. 

అదనంగా 36 డిప్యుటీ డీఈవో పోస్టులు
రాష్ట్రవ్యాప్తంగా 53 డిప్యూటీ డీఈవో పోస్టులుండగా వీటిపైనా ప్రభుత్వ, స్థానిక సంస్థల టీచర్లకు సంబంధించి వివాదం నెలకొంది. దీంతో ఈ సాకుతో గత ప్రభుత్వాలు పోస్టుల భర్తీ చేపట్టకుండా వదిలేశాయి. ముఖ్యమంత్రి జగన్‌ ఈ పోస్టులన్నీ భర్తీ కావాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో పాటు అదనంగా మరో 36 డిప్యూటీ డీఈవో పోస్టుల ఏర్పాటుకు అనుమతిచ్చారు. దీంతో ప్రభుత్వ టీచర్లు, స్థానిక సంస్థల టీచర్లకు న్యాయం చేసేందుకు మార్గం సుగమమైంది.

ఈ 89 డిప్యూటీ డీఈవో పోస్టులలో  నిబంధనలను అనుసరించి పదోన్నతులపై అర్హులైన వారిని నియమించనున్నారు. వీటితో పాటు మున్సిపల్‌ టీచర్లకు సంబంధించిన బాధ్యతలను కూడా ప్రభుత్వం విద్యాశాఖకు అప్పగించిన సంగతి తెలిసిందే. వీరికి సంబంధించిన సర్వీసు అంశాలు, పదోన్నతులు, వేతనాలు, బదిలీలను కూడా పాఠశాల విద్యాశాఖ చేపట్టనుంది. వీరికి కూడా ఎస్‌ఏలు, హెచ్‌ఎంలు, ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలుగా పదోన్నతులు లభించనున్నాయి.

ఎలాంటి న్యాయపరమైన సమస్యలకు తావు లేకుండా పదోన్నతులను చేపట్టేలా పాఠశాల విద్యాశాఖ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ పదోన్నతుల ప్రక్రియను సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి చేపట్టనుంది. వాటిని ముగించిన అనంతరం టీచర్ల సాధారణ బదిలీలను చేపడుతుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. 

22 ఏళ్ల కల సాకారం
వేల మంది స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లు తమ సబ్జెక్టుల మార్పుకోసం దాదాపు 22 ఏళ్లుగా ప్రభుత్వానికి విన్నపాలు చేస్తూ వచ్చారు. వారి గోడును గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. సీఎం వారి విన్నపాన్ని సానుకూలంగా పరిష్కరించేలా ఆదేశాలిచ్చారు. ఈమేరకు స్కూల్‌ అసిస్టెంట్లు తమ అర్హతలను అనుసరించి సబ్జెక్టుల మార్పునకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దీనివల్ల 2,300 మంది టీచర్లకు లబ్ధి చేకూరనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement