Promotion of teachers
-
నెరవేరిన టీచర్ల కల
సాక్షి, హైదరాబాద్: పదోన్నతుల కోసం దాదాపు దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కల ఎట్టకేలకు నెరవేరింది. రంగారెడ్డి జిల్లా మినహా రెండు జోన్లలోనూ పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. చివరిసారిగా 2015లో పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ప్రమోషన్ల ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. టీచర్ల హేతుబదీ్ధకరణ చేపట్టాలని కొన్నాళ్లు భావించారు. కోర్టు కేసుల కారణంగా మరికొంత జాప్యం జరిగింది. 2023లో బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మల్టీజోన్–1లో కొంత వరకూ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ముందుకెళ్లింది. అంతలోనే స్పౌజ్ కేసుల కారణంగా ఇది ఆగిపోయింది. పండిట్లు తమ పోస్టులు తమకే ఇవ్వాలన్న డిమాండ్‌తో కోర్టును ఆశ్రయించారు. వీటిని పక్కనబెట్టి ప్రమోషన్లు ఇవ్వాలని భావించారు. ఈ సమయంలో ప్రమోషన్లకు టెట్ ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనను కొంతమంది టీచర్లు ముందుకు తెచ్చారు. న్యాయస్థానం స్టే కారణంగా 2023లో ఇది ఆగిపోయింది. ఈలోగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోషన్లు, బదిలీలు చేయాలని అధికారులు కంకణం కట్టుకున్నారు. ఈ వ్యవహారంలో పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యూహాత్మకంగా న్యాయ పరమైన చిక్కులు తొలగించారు. దీంతో 18,942 మందికి ఒకేసారి పదోన్నతులు దక్కాయి. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా, కొంతమంది, స్కూల్ అసిస్టెంట్ల నుంచి హెచ్ఎంలుగా మరికొంతమంది ప్రమోషన్లు పొందారు. వీళ్లందరినీ బదిలీ చేశారు. దీంతో ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఖాళీలు 22 వేల పైనే... బదిలీలు, పదోన్నతుల తర్వాత వాస్తవ ఖాళీలు అధికారులు లెక్కగట్టాల్సి ఉంది. ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది. 18,942 మందికి ప్రమోషన్లు ఇచ్చినా... వీరిలో 3 వేల మంది ఒకటికి మించి పదోన్నతులకు అర్హత ఉన్నవారున్నారు. ఉదాహరణకు సైన్స్, మేథ్స్ సబ్జెక్టులు రెండింటికీ అర్హత ఉంటుంది. పదోన్నతి రెండింటికీ లభిస్తుంది. అయితే, టీచర్ ఒకే సబ్జెక్టులో పదోన్నతి తీసుకోవాలి. ఈ రకంగా 3 వేల ఖాళీలు ఏర్పడే వీలుంది. జిల్లాల వారీగా ఈ లెక్కలు తేలితే... ఈ స్థానంలో మరికొన్ని పదోన్నతులు లభించే అవకాశముంది. జూలైలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ప్రస్తుతం 11 వేల పోస్టులను చేర్చారు. పదోన్నతుల ద్వారా మరో 11 వేల వరకూ ఖాళీ అయ్యే వీలుంది. వీటిని కూడా చేర్చి, పూర్తిస్థాయిలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇదో చరిత్ర : ముఖ్యమంత్రి కార్యాలయం ఇంత పెద్ద మొత్తంలో టీచర్లకు పదోన్నతులు కల్పించడం రాష్ట్ర చరిత్రలోనే గొప్ప విషయమని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఓ ప్రకటనలో పేర్కొంది. ఎక్కడా ఎలాంటి వివాదానికి తావివ్వకుండా, చట్టపరమైన చిక్కులను అధిగమించడంలో ప్రభుత్వం చూపిన చొరవను ఉపాధ్యాయ సంఘాలు ప్రశంసిస్తున్నాయని తెలిపింది. టీచర్ల కష్టాన్ని, శ్రమను ప్రభుత్వం గుర్తించిందని, సముచిత రీతిలో గౌరవించిందని, ఈ కారణంగా టీచర్లు మరింత కంకణబద్దులై పనిచేస్తారన్న ఆశాభావాన్ని సీఎంవో వ్యక్తం చేసింది. ఖాళీలు 22 వేల పైనే...బదిలీలు, పదోన్నతుల తర్వాత వాస్తవ ఖాళీలను అధికారులు లెక్కగట్టాల్సి ఉంది. ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది. 18,942 మందికి ప్రమోషన్లు ఇచ్చినా.. వీరిలో 3 వేల మంది ఒకటికి మించి పదోన్నతులకు అర్హత ఉన్నవారున్నారు. ఉదాహరణకు సైన్స్, మేథ్స్ సబ్జెక్టులు రెండింటికీ అర్హత ఉంటుంది. పదోన్నతి రెండింటికీ లభిస్తుంది. అయితే, టీచర్ ఒకే సబ్జెక్టులో పదోన్నతి తీసుకోవాలి. ఈ రకంగా 3 వేల ఖాళీలు ఏర్పడే వీలుంది. జిల్లాల వారీగా ఈ లెక్కలు తేలితే... ఈ స్థానంలో మరికొన్ని పదోన్నతులు లభించే అవకాశముంది. జూలైలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ప్రస్తుతం 11 వేల పోస్టులను చేర్చారు. పదోన్నతుల ద్వారా మరో 11 వేల వరకూ ఖాళీ అయ్యే వీలుంది. వీటిని కూడా చేర్చి, పూర్తిస్థాయిలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. -
AP: గుడ్‌న్యూస్! 10 వేల మందికి పైగా టీచర్లకు పదోన్నతి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదివేల మందికిపైగా ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త అందించనుంది. పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందడంతో టీచర్లకు మేలు చేసే ప్రక్రియకు త్వరలో శ్రీకారం చుట్టనుంది. 10 వేల మందికిపైగా టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా, ప్రధానోపాధ్యాయులుగా, మండల విద్యాశాఖాధికారులుగా, జిల్లా ఉప విద్యాశాఖాధికారులుగా పదోన్నతులు కల్పించనుంది. సెప్టెంబర్ నెల మొదటి వారంలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ చేపట్టేలా షెడ్యూల్ సిద్ధం చేసింది. 7 వేల మంది ఎస్జీటీలకు ఎస్ఏలుగా పదోన్నతి రాష్ట్రంలో విద్యావ్యవస్థను పునాది నుంచి బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఫౌండేషనల్ విద్యా విధానాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్లలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. 3 నుంచి 8 ఏళ్ల మధ్య పిల్లల్లో మేథోపరమైన వికాసం గరిష్టంగా ఉంటుందని పలు శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించిన నేపథ్యంలో వారికి నాణ్యమైన బోధన అందేలా ఏర్పాట్లు చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి ఫౌండేషనల్ స్కూళ్లుగా తీర్చిదిద్దింది. 3 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల పిల్లలను హైస్కూళ్లకు అనుసంధానిస్తూ సబ్జెక్టుల వారీగా బోధనకు చర్యలు తీసుకుంది. అందుకు అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్ చేపట్టింది. విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలను కల్పిస్తూ ఈ చర్యలు తీసుకుంటోంది. మ్యాపింగ్‌తో ఆయా హైస్కూళ్లు, ప్రీ హైస్కూళ్లలో అవసరమైన అదనపు తరగతి గదులు, ఇతర సదుపాయాలను కల్పిస్తోంది. ఈ స్కూళ్లలో సబ్జెక్టుల బోధనకు స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కావడంతో ఎస్జీటీలలో అర్హులైన వారికి ఎస్ఏలుగా పదోన్నతులు కల్పించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు 7 వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. హెడ్మాస్టర్లను కూడా పూర్తి స్థాయిలో నియమించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 500 హైస్కూళ్లలో హెడ్మాస్టర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో వాటిలో సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించనున్నారు. పదోన్నతుల కోసం అదనంగా 666 ఎంఈవో పోస్టులు మండల విద్యాధికారుల పోస్టులు కొన్ని దశాబ్దాలుగా పూర్తిస్థాయిలో భర్తీకి నోచుకోలేదు. దీనివల్ల ప్రభుత్వం ఎన్ని రకాల విద్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నా పర్యవేక్షణ కొరవడింది. టీచర్లకు అందాల్సిన పదోన్నతులూ నిలిచిపోయాయి. రాష్ట్రంలో 666 మండల విద్యాధికారుల పోస్టులుండగా 421 మంది పనిచేస్తున్నారు. అయితే ఈ పోస్టులన్నీ తమకు సంబంధించినవని, స్థానిక సంస్థల స్కూళ్ల టీచర్లకు కేటాయించవద్దని ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదం పరిష్కారానికి సీఎం జగన్ చొరవ చూపారు. ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున ఎంఈవోలు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఎంఈవో పోస్టులు రెట్టింపై 1,332కి చేరాయి. 666 పోస్టులు ప్రభుత్వ టీచర్లకు, మిగతా 666 పోస్టులు స్థానిక సంస్థల (జడ్పీ) స్కూళ్ల టీచర్లకు కేటాయించారు. ఫలితంగా టీచర్లకు పదోన్నతులు రెట్టింపు అయ్యాయి. అర్హులైన హెడ్మాస్టర్లకు పదోన్నతుల ద్వారా ఈ పోస్టులలో అవకాశం కల్పించనున్నారు. అదనంగా 36 డిప్యుటీ డీఈవో పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా 53 డిప్యూటీ డీఈవో పోస్టులుండగా వీటిపైనా ప్రభుత్వ, స్థానిక సంస్థల టీచర్లకు సంబంధించి వివాదం నెలకొంది. దీంతో ఈ సాకుతో గత ప్రభుత్వాలు పోస్టుల భర్తీ చేపట్టకుండా వదిలేశాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ పోస్టులన్నీ భర్తీ కావాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో పాటు అదనంగా మరో 36 డిప్యూటీ డీఈవో పోస్టుల ఏర్పాటుకు అనుమతిచ్చారు. దీంతో ప్రభుత్వ టీచర్లు, స్థానిక సంస్థల టీచర్లకు న్యాయం చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ 89 డిప్యూటీ డీఈవో పోస్టులలో నిబంధనలను అనుసరించి పదోన్నతులపై అర్హులైన వారిని నియమించనున్నారు. వీటితో పాటు మున్సిపల్ టీచర్లకు సంబంధించిన బాధ్యతలను కూడా ప్రభుత్వం విద్యాశాఖకు అప్పగించిన సంగతి తెలిసిందే. వీరికి సంబంధించిన సర్వీసు అంశాలు, పదోన్నతులు, వేతనాలు, బదిలీలను కూడా పాఠశాల విద్యాశాఖ చేపట్టనుంది. వీరికి కూడా ఎస్ఏలు, హెచ్ఎంలు, ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలుగా పదోన్నతులు లభించనున్నాయి. ఎలాంటి న్యాయపరమైన సమస్యలకు తావు లేకుండా పదోన్నతులను చేపట్టేలా పాఠశాల విద్యాశాఖ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ పదోన్నతుల ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారం నుంచి చేపట్టనుంది. వాటిని ముగించిన అనంతరం టీచర్ల సాధారణ బదిలీలను చేపడుతుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. 22 ఏళ్ల కల సాకారం వేల మంది స్కూల్ అసిస్టెంట్ టీచర్లు తమ సబ్జెక్టుల మార్పుకోసం దాదాపు 22 ఏళ్లుగా ప్రభుత్వానికి విన్నపాలు చేస్తూ వచ్చారు. వారి గోడును గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. సీఎం వారి విన్నపాన్ని సానుకూలంగా పరిష్కరించేలా ఆదేశాలిచ్చారు. ఈమేరకు స్కూల్ అసిస్టెంట్లు తమ అర్హతలను అనుసరించి సబ్జెక్టుల మార్పునకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దీనివల్ల 2,300 మంది టీచర్లకు లబ్ధి చేకూరనుంది. -
బదిలీలు చేపట్టాల్సిందే!
హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాల్సిందేనని 40 ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. రెండేళ్లుగా రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టలేదని, ఈసారి బదిలీలు చేయాల్సిందేనని పట్టుబట్టాయి. గురువారం పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు అన్ని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించారు. మొదట పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డితో చర్చించారు. చర్చించేందుకు ఒక్కో సంఘానికి 10 నిమిషాల పాటు సమయం కేటాయించారు. వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపాలని నిర్ణయించారు. చిరంజీవులుతో సమావేశమైన వారిలో టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, చావ రవి, ఎస్టీయూ నేతలు రాజిరెడ్డి, భుజంగరావు, టీటీయూ నేతలు మణిపాల్‌రెడ్డి, వేణుగోపాలస్వామి, పీఆర్టీయూ తెలంగాణ నేతలు హర్షవర్దన్‌రెడ్డి, చెన్నయ్య, టీఆర్టీఎఫ్ నేతలు మల్లయ్య, లక్ష్మారెడ్డి, టీటీఎఫ్ నేతలు రామచంద్రం, రఘునందన్, హెచ్ఎంల సంఘం నేత మల్లికార్జునశర్మ, టీఎస్టీఎన్యూఎస్ నేత ధమనేశ్వర్‌రావు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నేతలు రాజన్న, వెంకట్రావ్, తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ నేతలు రహమాన్, ఆడమ్స్, టీపీటీఏ నేతలు షౌకత్‌అలీ, శర్మ ఉన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే జూన్ 2లోగా ఉపాధ్యాయులు రేషనలైజేషన్, పదోన్నతులు, బదిలీలు పూర్తి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు సంఘాల నేతలు వెల్లడించారు. ఇవీ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు విద్యాహక్కు చట్టం ప్రకారం హేతుబద్ధీకరణ చేపట్టాలి. పాఠశాలల మూసివేత ఉపసంహరిస్తూ జీవో నంబరు 6కు సవరణ చేయాలి. అన్ని పాఠశాలలకు సరిపడ పోస్టులను మంజూరు చేయాలి. ఉన్నత పాఠశాలల్లో తెలుగు, హిందీ గ్రేడ్-2 పండిట్లు, పీఈటీల స్థానంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఫిజికల్ డెరైక్టర్ పోస్టులు మంజూరు చేయాలి. 2013లో బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయాలి. ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొంటే వారికి అదనపు పాయింట్లు కేటాయించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో నియామకాలు, పదోన్నతుల జీవో 3లో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించాలి. ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లను ఇవ్వాలి. గిరిజన ప్రాంతాల్లో 10 మంది విద్యార్థులు ఉన్నా పాఠశాలలను కొనసాగించాలి. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను ప్రారంభించాలి.