► 18 ఏళ్ల తరువాత పోస్టుల భర్తీ
► పుల్లలచెరువుపై కొనసాగుతున్న సందిగ్ధత
► ఖాళీగా సీఎస్‌పురం, లింగసముద్రం
ఒంగోలు: జిల్లాలో సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారుల పోస్టింగ్‌లు ఖరారయ్యాయి. గుంటూరు ఆర్‌జేడీ కె.శ్రీనివాసరెడ్డి ఆదివారం సాయంత్రం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ మేరకు మొత్తం 48 మండలాల్లో ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండగా 45 మందికి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఈ నియామకాలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే ఎంఈఓలుగా ప్రకటించాలంటూ ఒక వైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులను సైతం రూరల్ మండలాల ఎంఈఓలుగా కొనసాగించేందుకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులను అర్బన్ మండలాల ఎంఈఓలుగా కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగానే ఈ పోస్టింగ్‌లు ఖరారయ్యాయి. మొత్తం మీద 18 సంవత్సరాల తరువాత జిల్లాలో మండల విద్యాశాఖ అధికారుల పోస్టులను విద్యాశాఖ భర్తీచేసింది. అయితే సీఎస్ పురం, లింగసముద్రం మండలాల్లో మాత్రం ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. పుల్లలచెరువుకు సంబంధించి మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. దీనిపై సోమవారం నాటికి స్పష్టత వస్తుందని అంచనా.
ఎంఈఓలు వీరే!
కోటేశ్వరరావు–రాచర్ల, జి.సుబ్బరత్నం–కనిగిరి, దయానందం–సంతనూతలపాడు, ఎం.ఎస్.రాంబాబు–కందుకూరు, జి.శేషయ్య–నాగులుప్పలపాడు, వి.కోటేశ్వరరావు–సంతమాగులూరు, పద్మావతి–కొత్తపట్నం, జయరాజ్–ఇంకొల్లు, ఎం.కృష్ణ–కంభం, కాలెయ్య–గుడ్లూరు, ఏకాంబరేశ్వరరావు–వేటపాలెం, ఎంవీ సత్యన్నారాయణ–కారంచేడు, కె.ఎల్ నారాయణ–చీరాల, డి.నాగేశ్వరరావు–పర్చూరు, వెంకటరెడ్డి–పెద్దారవీడు, వెంకటేశ్వర్లు–బి.పేట, వి.రాఘవులు–బల్లికురవ, కె.వెంకటేశ్వర్లు–చినగంజాం, ఎల్.పున్నయ్య–కొరిశపాడు, డి.సుజాత–తర్లుబాడు, ఆంజనేయులు–వై.పాలెం, మస్తాన్‌నాయక్–పెద్ద దోర్నాల, ఇ.శ్రీనివాసరావు–ముండ్లమూరు, కిశోర్‌బాబు–చీమకుర్తి, వెంకటేశ్వర్లు–కొమరోలు, వస్త్రాంనాయక్–కురిచేడు, మల్లికార్జుననాయక్–త్రిపురాంతకం, నరసింహారావు – పి.సి. పల్లి, నాగేంద్రవదన్–జరుగుమల్లి, సురేఖ –కొండపి, వెంకటేశ్వర్లునాయక్–అర్ధవీడు, డాంగే–కొనకనమిట్ల, రవిచంద్ర–పొన్నలూరు, కోటేశ్వరరావు– ఉలవపాడు, టి.శ్రీనివాస్–పొదిలి, కె.రఘురామయ్య–దర్శి, సుబ్బయ్య–తాళ్లూరు, పెద్దిరాజు–హనుమంతునిపాడు, సుబ్బారావు– మర్రిపూడి, సాంబశివరావు–దొనకొండ, సుబ్రహ్మణ్యేశ్వర్–వలేటివారిపాలెం, వెంకటరెడ్డి–పామూరు, దాసు ప్రసాద్–వెలిగండ్ల, చెంచుపున్నయ్య–టంగుటూరు
యథావిధిగా పది పరీక్షల విధులు
వీరంతా ఎంఈఓలుగా నియమితులైనప్పటికీ పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నవారు మాత్రం తప్పనిసరిగా పరీక్షలు పూర్తయ్యేవరకు అదే స్థానంలో కొనసాగాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.విజయభాస్కర్ స్పష్టం చేశారు. పది పరీక్షలకు హాజరవుతూనే పరీక్ష అనంతరం రిలీవ్ అయి, నూతన స్థానంలో చేరవచ్చని, అయినప్పటికీ పరీక్షల డ్యూటీకి మాత్రం హాజరుకావాలన్నారు.