ఒంగోలు టౌన్: ఒంగోలులోని శ్రీకృష్ణనగర్‌లో బ్యూటీషియన్‌పై దాడి చేసి చోరీకి పాల్పడిన కేసులో ఒంగోలు మార్గదర్శి బ్రాంచి మేనేజర్ కరణం నాగేశ్వరరావు భార్య కరణం మోహన దీప్తి ఉరఫ్ దీప్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మలికా గర్గ్ కేసు వివరాలను వెల్లడించారు. ఒంగోలుకి చెందిన షేక్ రజియా శ్రీకృష్ణ నగర్‌లోని తన ఇంటిలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు.
ఆమె భర్త షేక్ మీరా ఉద్యోగ నిమిత్తం ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తారు. కూతురు కాలేజికి వెళ్లి సాయంత్రం వస్తుంది. దీంతో రజియా ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. రజియాకు షేక్ సాహెర భాను అనే స్నేహితురాలు ఉంది. ఆమెకు రజియా వద్ద రూ.10 లక్షలకు పైగా విలువైన బంగారు నగలు ఉన్నాయని తెలుసుకుని ఆ విషయాన్ని తనకు పరిచయమున్న కరణం దీప్తి, ముండ్రు లక్ష్మి నవత ఉరఫ్ నవ్య, అలహరి అపర్ణలకు చెప్పింది. దీంతో అప్పటికే అనేక చోరీలు చేసి ఉన్న ఈ కిలాడీ ముఠా బ్యూటీ పార్లర్ మీద కన్నేశారు.
వీరు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బ్యూటీపార్లర్‌కు వచ్చారు. మేకప్ చేయించుకునేందుకు వచ్చినట్లు నమ్మించారు. మొదట ఇద్దరు ఐ బ్రోస్ చేయించుకున్నారు. మరొకరికి పెడిక్యూర్ చేస్తుండగా అదను చూసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రజియా మీద ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న మత్తు కలిగించే ద్రావణాన్ని స్ప్రే చేశారు. తేలికపాటి యాసిడ్ లాంటి ద్రావణాన్ని ఆమె మీద చల్లారు.
క్లోరోఫాం ప్రయోగించడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. ఆ తరువాత వాళ్లు చేతికి అందిన కాడికి దోచుకొని పోయారు. రజియా మెడలోని బంగారు నగలు, ఇంట్లో కప్‌బోర్డులో దాచిన నగలు, రూ.40 వేల నగదు దోచుకొని వెళ్లారు. ఈ కేసు వివరాలను తెలుసుకున్న ఎస్పీ మలికా గర్గ్ వెంటనే పోలీసులను రంగంలోకి దించారు. సీఐ భక్తవత్సలరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.
చదవండి: అవమానించడంతోనే పెట్రోల్ పోసుకున్నా
సీసీ కెమెరాల్లో ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు హైడ్రామా మధ్య వారిని అదుపులోకి తీసుకున్నారు. కరణం మోహన దీప్తితో పాటుగా బజాజ్ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేసే ముండ్ర వెంకటరావు భార్య లక్ష్మి నవత, శ్రీనివాసరావు భార్య అలహరి అపర్ణ, దాసరి భాను ఉరఫ్ షేక్ సాహెరా భానులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఒంగోలు తాలూకా పరిధిలో పెళ్లూరు, పొదిలి, దొనకొండలలో కూడా చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. 24 గంటల్లోపే కేసును ఛేదించడమే కాకుండా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, సీఐ భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment