సాక్షి హైదరాబాద్: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో నగర మహిళకు ఎర వేసి, ఆమె నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో కీలక సూత్రధారితో పాటు అతడికి సహకరించిన వ్యక్తీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రజిత్ పతారియా సూత్రధారిగా ఓ ముఠా ఏర్పడింది. అదే ప్రాంతానికి చెందిన అశ్విన్ ఇతడికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరించాడు.
ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన వీళ్లు అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపారు. నగరానికి చెందిన మహిళకు వీరి నుంచి సాక్షి మెహతా పేరుతో వచ్చి రిక్వెస్ట్‌ను ఆమె యాక్సెప్ట్ చేయడంతో ఇరువురి మధ్యా చాటింగ్స్ నడిచాయి. అలా ఆమెను ముగ్గులోకి దింపిన నేరగాళ్లు ఆన్‌లైన్ ట్రేడింగ్, పెట్టుబడులు, భారీ లాభాలంటూ మొత్తం రూ.1.2 కోట్లు తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకుని మోసం చేశారు.
ఈ మేరకు బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ హరిభూషణ్ రావు నేతృత్వంలోని బృందం బ్యాంకు ఖాతాల వివరాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా ముందుకు వెళ్లింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లలో గాలించిన బృందాలు ఇప్పటికే అజయ్ ఓజా, సుమిత్ వర్మ, రాహుల్, మహేష్, తరుణ్ ప్రజాపతి, బాలు చౌహాన్, సందీప్‌లను అరెస్టు చేశారు. వీరి విచారణ నేపథ్యంలోనే ఈ గ్యాంగ్ మొత్తానికి రజిత్ పతారియా సూత్రధారని, అతడి సహాయకుడు అశ్విన్ సైతం కీలక పాత్ర పోషించాడని తేలింది. దీంతో వీరిని భోపాల్‌లో అరెస్టు చేసిన అధికారులు సిటీకి తీసుకువచ్చారు. వీరిపై ఛత్తీస్‌గడ్‌లోనూ అనేక కేసులు నమోదై ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment