అభిప్రాయం
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదయిన సందర్భంలో అన్ని వర్గాల్లోనూ చర్చ చాలా లోతుగానే జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తొలి పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తమ ఆకాంక్ష లకు అనుగుణంగా లేదని చాలా స్పష్టంగా ప్రజలు చెప్పారు. తెలంగాణ కోసమే ఒక రాజకీయ పార్టీ స్థాపించి, తెలంగాణ పేరుతో ప్రతినిత్యం తన రాజకీయం నడిపించిన కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినా ప్రజలు శాశ్వతంగా పట్టం కట్టలేదనీ, కట్టరనీ ఏడాది క్రితం ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి.
నిజానికి 2014 ఎన్నికల్లో కేసీఆర్‌కు పట్టం కట్టిన ప్రజలు 2019 ఎన్నికలలోపే ఆ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తూ వచ్చారు. ఇది కనిపెట్టిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలతో (2019) పాటు అసెంబ్లీ ఎన్ని కలు జరిగితే మోదీ సునామీలో అధికారం కోల్పోవడం ఖాయం అని ఇంటెలిజెన్స్ వర్గాలు, ఇతర వర్గాల ద్వారా సమాచారం సేకరించారు. అందుకే ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ తనదైన టక్కు టమార విద్యలతో 2018 లోనే అసెంబ్లీకి ప్రత్యేకంగా ఎన్నికలు వచ్చే విధంగా ప్రయత్నం చేసి విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగి ఉంటే అదే స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉండేది.
రెండవ దఫా ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళనుంచి తెలంగాణ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. తెలంగాణలో అనుకోకుండా దుబ్బాక నియోజకవర్గంలో వచ్చిన ఉప ఎన్నిక ఈ వ్యతిరేకత చూపించడానికి తొలి వేదిక అయ్యింది. సొంత జిల్లా సిద్దిపేటలో అటు గజ్వేల్, ఇటు సిరిసిల్లకు మధ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజలు బీజేపీ తరఫున నిల బడిన నన్ను గెలిపించడం దీనికి నిదర్శనం.
ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ ప్రజలు తప్పని సరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపితే అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు... ఏడాది కాలంగా సరిగ్గా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నది. ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రకటించిన మేనిఫెస్టోలో 42 పేజీలలో వారు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మారి ఏడాది కూడా గడవక ముందే తెలంగాణలో కొత్త సర్కారుపై తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకతలు మొదలయ్యాయి.
కేసీఆర్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ‘ఆరు గ్యారెంటీల’ పేరుతో అలవి కాని హామీలను ఇచ్చి ప్రజల ఓట్లను కొల్లగొట్టి గద్దెనెక్కి... ఇప్పుడు ప్రజలపై స్వారీ చేస్తోంది రేవంత్ సర్కార్. 6 గ్యారంటీలలో నెర వేర్చినవి కూడా అరకొరగా మాత్రమే ఉండటం గమ నార్హం. ప్రజలకు అవసరం లేని... పేర్లలో మార్పు, విగ్రహాలలో మార్పు చేయడం మాత్రమే ప్రజా పాలనకు నిదర్శనమా? తెలంగాణ తల్లి విగ్రహం మలిదశ ఉద్యమంలో ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ప్రజల మన సుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ విగ్రహం మార్పు చేయడం వల్ల ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉన్నదా? నిజానికి తల్లి... దేవతతో సమానం. అట్లాంటి తెలంగాణ తల్లిని దేవత రూపంలో ఉండకూడదని కాంగ్రెస్ సర్కార్ అనుకోవడమే వారి మూర్ఖత్వానికి పరాకాష్ట. మార్పు చేసిన విగ్రహం కూడా తెలంగాణలో బలిదానాలకు మూల కారణమైన సోనియా గాంధీ పుట్టిన రోజున ఆవిష్కరణ చేయడం తెలంగాణ ఆత్మగౌరవ వంచనగా భావించాల్సిందే.
‘అన్ని బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం’ అని ప్రమాణ పత్రంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ... కేవలం ‘పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సు’ల్లో మాత్రమే ఆడపడుచులు ప్రయాణించడానికి అర్హులని అవమా నిస్తోంది. ఇలా ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ కొట్టు మిట్టాడుతోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటేసిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు అవుతాయని ఎదురుచూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి.
చదవండి: వ్యవసాయాన్ని పండుగ చేశాం!
అత్తాకోడళ్ళతో సహా కుటుంబంలోని మహిళలందరికీ ఇస్తానన్న నెలకు రూ. 2,500 ఎక్కడకు పోయినాయి? వరి ధాన్యానికి రూ. 500 బోనస్ అని... ఇప్పుడు కేవలం కొన్ని రకాల సన్న ధాన్యాలకు ఇస్తా మని చెప్పడం మోసం చేయడం కాదా? రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి, తర్వాత ‘షరతులు వర్తిస్తాయ’ని కార్పొరేట్ తరహా మోసం చేసిన ప్రభుత్వం ఇది. ‘రైతు భరోసా’ పెంచి కౌలు రైతులకు కూడా 15 వేల రూపా యలు ఇస్తామని ముఖం చాటేసిన గొప్ప సర్కారు ఇది. అందుకే మేనిఫెస్టోలో ఉన్న 42 పేజీలపై ప్రజాక్షేత్రంలో చర్చకు రావాలి. వారు అమలు చేశామని చెప్పుకుంటున్న హామీలపై కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంతృప్తిగా లేరన్న విషయాన్ని రుజువు చేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ తాము ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిపక్షంలో ఎన్నికల వరకు కూడా ప్రజలు తిరుగుబాటు చేయకుండా నిలిచే పరిస్థితి మాత్రం కనబడటం లేదు. తిరుగుబాటు సహజ గుణంగా ఉన్న తెలంగాణ ప్రజలకు ఇది కొత్త కూడా కాకపోవచ్చు.
- రఘునందన్ రావు
మెదక్ పార్లమెంట్ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment