ఆదిలాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలకు తెరలేవడంతో గ్రామాల్లో వాతావరణం వేడెక్కింది. జనవరి 10లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఖరారుకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఏ పంచాయతీలో ఎవరికి రిజర్వేషన్ దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఆదేశాలు, మార్గదర్శకాలు, జీవోలు విడుదల చేయడం, అందుకనుగుణంగా జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేయడం లాంటివి చూస్తుంటే రిజర్వేషన్ల ఖరారుపైనే ఆసక్తి కలుగుతుంది.
పంచాయతీ ఎన్నికల కోసం ఈసారి ప్రత్యేకంగా బీసీ ఓటర్ల గణన చేపట్టారు. మరోవైపు సుప్రీం కోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఆదేశాలు జారీ చేయడంతో రిజర్వేషన్ల అంశం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా జిల్లాలో నూతనంగా ఏర్పడిన 226 గ్రామ పంచాయతీల్లో ఆశావహులు మరింత ఆసక్తితో పరిణామాలను గమనిస్తున్నారు. తమ గ్రామంలో తొలిసారిగా సర్పంచు ఎన్నికలు జరుగబోతున్నందున ఇప్పటికే చర్చలు మొదలెట్టారు. కాగా హడావిడి చూస్తుంటే మరో రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
మహిళలపైనే దృష్టి..
జిల్లా అధికారులు తాజాగా విడుదల చేసిన పంచాయతీ ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 3,36,647 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో బీసీలు 1,33,632 మంది ఓటర్లతో 39.69 శాతం ఉన్నారు. ఎస్టీలు 1,29,152 మంది ఓటర్లతో 38.36 శాతం ఉండగా, ఎస్సీలు 52,076 మంది ఓటర్లతో 15.46 శాతం ఉన్నారు. ఇతర వర్గానికి చెందిన వారు 21,787 మంది ఓటర్లతో 6.47 శాతం ఉన్నారు. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటి పరిధిలో 3,822 వార్డులు ఉన్నాయి. ఎస్టీలకు 248 పంచాయతీలు రిజర్వు కాగా, వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న జీపీలు సైతం ఇందులోనే ఉన్నాయి.
219 జీపీలకే రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశాలు కన్పించగా, ఈ పంచాయతీల్లోనే బీసీ, ఎస్సీ, ఇతరుల రిజర్వేషన్ల అంశం తేలనుంది. రిజర్వేషన్ వల్ల ఏ వర్గం లాభపడుతుందోనని ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మహిళల రిజర్వేషన్ ఆసక్తి కలిగిస్తుంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తే జిల్లాలో 233 సర్పంచు స్థానాలు మహిళలకు దక్కేలా కనిపిస్తున్నాయి. కాగా 2013 సర్పంచు ఎన్నికల్లో 243 పంచాయతీలకు గానూ 126 చోట్ల మహిళలకు అవకాశం దక్కింది.
ఈసారి ఎన్ని స్థానాలు సొంతం చేసుకుంటారనేది వేచి చూడాలి.
మరో రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్లు..
రిజర్వేషన్ల ఖరారుపై ఉత్కంఠకు మరో రెండు, మూడు రోజుల్లో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పంచాయతీ రాజ్ చట్టంలోని మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేయడం, జనవరి 2లోగా పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏ గ్రామంలో చూసినా రిజర్వేషన్ల ఖరారుపైనే చర్చ జరుగుతోంది. ఎన్నికల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించడం, వారికి శిక్షణ ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణపై కొత్త ఉత్సాహం నెలకొంది. కొత్త గ్రామాల్లో ఎన్నికలు జరుగనుండడంతో రిజర్వేషన్ల కోసం రెట్టింపు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment