సాక్షి, అమరావతి: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. దాదాపు 27 ఏళ్ల క్రితం పార్లమెంట్ గడప తొక్కిన బిల్లుకు ఎట్టకేలకు ప్రధాని మోదీ నాయకత్వంలో ఆమోదం లభించింది. అయితే ఎటువంటి ఉద్యమాలు, డిమాండ్‌లు లేకుండానే, ఎవరూ కోరకుండానే మహిళలకు ఏకంగా 50 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. మహిళలకు అందరికంటే ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతుగా నిలిచారు. సీఎం జగన్ దార్శనికతతో వేసిన అడుగులు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అగ్రతాంబూలం దక్కేలా చేశాయి.
ఆచరణలో అంతకుమించి...
అధికారం చేపట్టిన వెంటనే నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు ఏకంగా 50 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా సీఎం జగన్ చట్టం చేశారు. ఇక ఆచరణలో నామినేటెడ్ పదవుల్లో 51 శాతానికిపైగా పదవులు ఇచి్చన తొలి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీనే. గ్రామాల్లో వార్డు మెంబర్, పట్టణాల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ దగ్గరి నుంచి మంత్రి పదవుల దాకా మహిళలకు అగ్రపీఠం దక్కడం దేశంలోనే రికార్డు. తొలిసారిగా శాసన మండలి వైస్ ఛైర్మన్‌గా జకియా ఖానంను నియమించారు. రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నికి అవకాశం కల్పించారు.
విభజన అనంతరం మహిళా కమిషన్‌ను నియమించి మహిళల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని చాటారు. మహిళకు తొలిసారిగా హోంమంత్రి పదవి ఇచ్చి నాడు వైఎస్సార్ రికార్డు సృష్టిస్తే.. తండ్రి కంటే రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ నిరూపించుకున్నారు. తొలి మంత్రివర్గంలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరితను, ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్ప శ్రీవాణిని నియమించారు.
మలి విడత విస్తరణలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనితతోపాటు మరో ముగ్గురు మహిళలకు కీలక మంత్రి పదవులను అప్పగించారు. రాష్ట్రంలో 13 జెడ్పీ ఛైర్మన్ పదవుల్లో ఏడుగురు మహిళలే ఉన్నారు. 26 జెడ్పీ వైస్‌చైర్మన్ పదవుల్లో 15 మంది మహిళలున్నారు. 12 మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా 36 పదవుల్లో 18 మంది మహిళలే ఎన్నికయ్యేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 2.60 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం, 1.30 లక్షల సచివాలయాల ఉద్యోగాల్లో 51 శాతం మహిళలకే దక్కడం విశేషం.
మహిళలే కేంద్ర బిందువుగా సంక్షేమం
అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ దాకా ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తిస్తూ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మహిళలే కేంద్ర బిందువుగా వీటిని రూపొందించారు. నవరత్నాల పథకాల్లో 90 శాతానికి పైగా మహిళలే లబ్ధిదారులున్నారు. ప్రతి ఇంట్లో మహిళకు ప్రాధాన్యం, గౌరవం పెరగడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాలే కారణంగా నిలుస్తున్నాయి. మహిళల రక్షణ కోసం దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు లాంటి పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఆడబిడ్డల సంక్షేమంతోపాటు మహిళా సాధికారత కోసం సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా నిలవడం మన రాష్ట్రానికి గర్వ కారణం.
దశాబ్దాల ప్రస్థానం..
దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ హయాంలో 1989లో స్థానిక సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగ సవరణ ప్రతిపాదించారు. అనంతరం పీవీ నరసింహారావు హయాంలో 1992–93లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు చట్టం రూపం వచ్చింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలో 1996లో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఆమోదానికి నోచుకోలేదు. 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో పెండింగ్‌లోనే ఉండిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment