
పోలింగ్ సరళితో గెలుపు చాలా కష్టమని అంతర్గతంగా అభిప్రాయాలు
మహిళలు, వృద్ధుల ఓటింగ్ పెరగడంతో నష్టం జరుగుతుందని అంచనా
వారి ఓట్లు తమకు పడే అవకాశం లేదంటున్న తమ్ముళ్లు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పైన, ఆయన ప్రభుత్వం పైన ఎంతగా విష ప్రచారం చేసినా ఉపయోగంలేకపోయిందని, ప్రజలంతా వారికి మేలు చేసే జగన్ వైపే ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేతలకు తెలిసొచ్చింది. సోమవారం జరిగిన పోలింగ్ సరళిని చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచే అవకాశాల్లేవని, ఈసారీ పరా జయం తప్పదని, మళ్లీ తమది ప్రతిపక్ష పాత్రేనని టీడీపీ నేతలు అంచనాకు వచ్చేశారు.
టీడీపీ నేతలు పైకి గెలుస్తున్నామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతర్గత లెక్కలు మాత్రం అనుకూలంగా లేవని పార్టీ సీనియర్ నేతల ద్వారా తెలుస్తోంది. మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని వారు చర్చించుకుంటున్నారు. పోలింగ్ మొదలైనప్పటి నుంచి రెండు, మూడు గంటలు పో లింగ్ సరళి టీడీపీకి అనుకూలంగా ఉందని ఊదరగొట్టినా, ఆ తర్వాత పరిస్థితి మరింత తేటతెల్లం కావడంతో ఆ గాలి ప్రచారాన్ని తగ్గించేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, కొందరు ఎన్‌ఆర్‌ఐలు, టీడీపీ శ్రేణులతో కలిసి స్థానికంగా ఎక్కడికక్కడ ఓటర్లను మభ్యపెట్టేందుకు, తికమకపెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించారు.
మహిళలు బారులు తీరడంతో కలవరం
మహిళలు, వృద్ధులు గతంలోకంటె ఎక్కువగా పోలింగ్ బూత్‌లలో బారులు తీరి గంటల తరబడి నిలుచున్న దృశ్యాలు టీడీపీ శ్రేణుల్ని నివ్వెరపరిచాయి. తాము ఆశించిన దానికి భిన్నంగా సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలు అధికార వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్లేస్తుండటంతో తప్పుడు ప్రచారాలను నమ్ముకుని విర్రవీగిన టీడీపీ శిబిరమంతా నీరసించిపోయింది. ప్రతి నెలా ఇంటి వద్దే పింఛన్లు అందుకున్న వృద్ధులు వైఎస్ జగన్‌కు ఓటేయడం తమ బాధ్యతగా భావించినట్లు ఓటింగ్ సరళి తెలియజెప్పింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఈ సెంటిమెంటు మరింత ఎక్కువగా కనిపించడంతో చంద్రబాబును నమ్ముకున్న పచ్చ మూకలన్నీ అంతర్మథనంలో మునిగిపోయాయి. పట్టణాల్లోకంటే గ్రామాల్లో ఓ టింగ్ పూర్తిగా తమకు వ్యతిరేకంగా జరిగిందనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. యువత ఓట్లపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నప్పటికీ, అది కూడా నెరవేరలేదని చెబుతున్నారు. గత ప్ర భుత్వాలకంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎక్కువగానే ఉద్యోగాలు రావడంతో యువత మద్దతును టీడీపీ పూర్తిగా పొందలేకపోయినట్లు అంచనా .
ఎన్ని దుష్ప్రచారాలు చేసినా పనిచేయలేదే?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా, టీడీపీకి అనుకూలంగా ఎంత హడా వుడి చేసినా ఉపయోగం కనిపించలేదని రాజకీయ వర్గాలు అంచనకు వచ్చాయి. ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం కూడా బెడిసికొట్టిందని భావిస్తున్నారు. ఎంత తప్పుడు ప్రచారం చేసినా, చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రజలు నమ్మలేదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆయన ఏడాది క్రితమే సూపర్ సిక్స్ పేరుతో జగన్ పథకాలను కాపీ కొట్టి ప్రకటించుకున్నారు.
సీఎం వైఎస్ జగన్ సమర్థవంతంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి, రైతు భరోసా పథకాల పేర్లు మార్చి కొంచెం ఎక్కువ ఇస్తానని చెప్పినా చంద్రబాబును జనం పట్టించుకోలేదని తేలినట్లు చెబుతున్నారు. చివరికి పింఛన్లను రూ.4 వేలకు పెంచి ఇస్తానని, ఏప్రిల్ నుంచే ఇస్తానని చెప్పినా వృద్ధులు లెక్క చేయలేదని స్పష్టమైంది. తాము అనుకున్నవేమీ జరగకపోవడం, ఓటింగ్ సరళి తమకు వ్యతిరేకంగా ఉండడంతో టీడీపీ శ్రేణులన్నీ నైరాశ్యంలో మునిగిపోయాయి. మరోవైపు పోలింగ్ జరుగుతున్నప్పుడే చంద్రబాబు కూడా చేతులెత్తేసినట్లు మాట్లాడటంతో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ శ్రేణులకు అర్థమైపోయింది.
Comments
Please login to add a commentAdd a comment