సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళా స్వయంశక్తితో ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటు సత్ఫలితాలనిస్తోంది. వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అందించిన నిధులతో అక్క చెల్లెమ్మలు స్వయం ఉపాధి మార్గాలపై దృష్టి పెట్టారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అండగా నిలిచి ‘పొదుపు’ మహిళలకు దిశానిర్దేశం చేస్తోంది.
మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన నిధులను సమకూర్చి విజయం దిశగా ప్రోత్సహిస్తున్నారు గత నాలుగున్నరేళ్లల్లో వివిధ పథకాల ద్వారా 25 లక్షల మంది పట్టణ ప్రాంత పొదుపు సంఘాల్లోని మహిళలతో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లను నెలకొల్పి అద్భుత ఫలితాలను సాధించారు. దీంతోపాటు మహిళలు తయారు చేసే చేతి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు పొదుపు మహిళలతో పరిశ్రమలు నెలకొల్పేందుకు ‘మెప్మా’ ముందడుగు వేసింది. పర్యావరణహితంగా సరికొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ మహిళలతో ‘ప్రగతి యూనిట్లు’ ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టారు. ఏ పరిశ్రమ స్థాపించాలి? మూలధనం, శిక్షణ లాంటి అంశాలపై చర్చించేందుకు మెప్మా ఎండీ తాజాగా సంఘాల లీడర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
25 లక్షల మంది సభ్యులుగా ఉన్న పట్టణ సమాఖ్యలకు చెందిన టీఎల్‌ఎఫ్ రిసోర్స్ పర్సన్లు, సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు (ఆఫీస్ బేరర్స్) దాదాపు 700 మంది పాల్గొన్న ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోని మహిళా సంఘాలు తీర్మానాలు చేసిన ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల్లోని పట్టణ మహిళా సంఘాలు సంఘటితంగా సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ఎండీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
9 పట్టణాల్లోని జగనన్న మహిళా మార్టుల ద్వారా ఆగస్టు వరకు రూ.25 కోట్ల వ్యాపారం చేసినట్లు లబ్ధిదారులు వివరించారు. 110 యూఎల్బీల్లో ప్రతినెలా ఒకరోజు ఏర్పాటు చేసే అర్బన్ మార్కెట్ ద్వారా ఒక్కోచోట సగటున రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా వ్యాపారం చేస్తున్నట్టు తెలిపారు. వీటితోపాటు ఆస్పత్రులు, మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 140 మెప్మా ఆహా క్యాంటీన్ల ద్వారా సంఘాల సభ్యులు ఆదాయం పొందుతున్న తీరును, వాటికున్న డిమాండ్‌ను సదస్సులో పంచుకున్నారు.
వ్యాపారం చేసుకుంటున్నాం
గతంలో బ్యాంకు రుణం వస్తే డబ్బులు పంచుకుని ఇంట్లో ఖర్చు చేసేవాళ్లం. ఇప్పుడు బ్యాంకు రుణాలు ఇప్పించడంతోపాటు వ్యాపారం దిశగా ‘మెప్మా’ ప్రోత్సహిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లుగా అన్ని పథకాలు అందుతున్నాయి. బ్యాంకులు మాకు పిలిచి మరీ రుణాలు ఇస్తు న్నాయి. ఈ డబ్బులతో సంఘాల్లోని సభ్యులు తమకు నైపుణ్యం ఉన్న అంశంలో వ్యాపారం చేస్తున్నారు. స్థిరమైన ఆదాయం వస్తోంది. వ్యాపార ఆలోచన ఉంటే మెప్మా శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తోంది.
– పి.కృష్ణకుమారి, నరసరావుపేట
మహిళలకు అండగా సీఎం
మహిళా సాధికారత అంటే ఇన్నాళ్లూ మాకు తెలియదు. ఇంటికే పరిమితమైన మమ్మల్ని సీఎం జగన్ ప్రగతి వైపు అడుగులు వేయించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆర్థికంగా ఎదుగుతున్నాం. తిరుపతిలో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేసుకున్నాం. పెద్దపెద్ద మార్ట్‌లతో పోటీ పడి వ్యాపారంలో లాభాలు పొందుతున్నాం. నవరత్నాల పథకాలను ప్రధానంగా మహిళల కోసమే అమలు చేస్తున్నారు. – ప్రతిమారెడ్డి, తిరుపతి
ఆహా క్యాంటీన్‌తో ఉపాధి
గతంలోనూ పట్టణ మహిళా పొదుపు సంఘాలు ఉన్నా పావలా వడ్డీ రుణాలు తప్ప మిగతావి పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక రుణాలు మంజూరు చేయడంతో పాటు అవగాహన ఉన్న రంగంలో వ్యాపారం దిశగా ప్రోత్సహించి ఆదాయ మార్గాన్ని కూడా చూపించింది. మెప్మా ప్రోత్సాహంతో ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కపూటకు అన్ని ఖర్చులు పోను రూ.1,000 లాభం వస్తోంది. – శ్యామల, అమలాపురం
గత ప్రభుత్వంలో మోసపోయాం
ఎన్నో ఏళ్లుగా పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్నా ఏనాడు ఆర్థికంగా బాగున్నది లేదు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో సభ్యులు ఎంతో ఆశతో రుణాలు చెల్లించడం ఆపేశారు. దాంతో బ్యాంకు మా సంఘాన్ని డిఫాల్టర్‌గా ప్రకటించింది. ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని చెల్లిస్తూ వ్యాపారం దిశగా ప్రోత్సహించింది. ఇప్పుడు బ్యాంకులు పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. – షేక్ ఫాతిమా, నరసరావుపేట
ప్రతి రూపాయీ మాకే..
గత ప్రభుత్వంలో పట్టణ మహిళా పొదుపు సంఘాల పేరుతో చాలా వరకు బోగస్ సంఘాలు ఉండేవి. మాకు రావాల్సిన నిధులు వారికే పోయేవి. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి సంఘాన్ని, ప్రతి సభ్యురాలి వివరాలను ఆన్‌లైన్ చేశారు. దీంతో బోగస్ సంఘాలు పోయాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి ఇప్పుడు నేరుగా సంఘాలకే అందుతోంది. శిక్షణనిచ్చి మున్సిపల్ స్థలాల్లో వ్యాపారాలు పెట్టిస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారు. – మీనాక్షి, విజయవాడ
మహిళా సాధికారతే లక్ష్యం
మెప్మాలోని సభ్యులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్ల నిర్వహణతో మహిళలు విజయం సాధించారు. అనుకున్న దానికంటే మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. గతంలో మహిళా పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు ఎంతో ఆలోచించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు.
మహిళల్లో అద్భుతమైన వ్యాపార దక్షత ఉంది. వారు తయారు చేసే చేతి వస్తువులు, ఆహార పదార్థాలను ఈ–కామర్స్ సైట్ల ద్వారా విక్రయించేలా ప్రణాళిక రూపొందించాం. మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. వారిని మరో మెట్టు ఎక్కించేందుకు మెప్మా ద్వారా తయారీ యూనిట్లు కూడా నెలకొల్పే ఏర్పాట్లు చేస్తున్నాం. ఉచితంగా శిక్షణనిచ్చి ఆర్థిక సాయం చేసి వ్యాపార యూనిట్లు పెట్టిస్తాం. పట్టణ ప్రగతి యూనిట్లు నెలకొల్పే దిశగా సాయం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment