సాక్షి, అమరావతి: పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడడంతోపాటు సుస్థిర జీవనోపాధిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూనా సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ శిక్షణలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులందరికీ సుస్థిర జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటికే 11 మునిసిపాలిటీల్లో జగనన్న మహిళా మార్టులు, జగనన్న ఈ–మార్ట్, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు, చేయూత జీవనోపాధి యూనిట్లు వంటివి ఏర్పాటు చేశారు.
వీటికి అదనంగా పట్టణ ప్రగతి యూనిట్లను కూడా ఈ నెలలోనే ఏర్పాటు చేయనున్నారు. మెప్మా పరిధిలో 123 పట్టణ స్థానిక సంస్థల(యూఎల్బీ)లో 25 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఉండగా, ఇప్పటిదాకా 13.50 లక్షల మంది ప్రత్యక్షంగా స్వయం ఉపాధి పొందుతున్నారు. మిగిలిన వారిలో అత్యధిక మందితో పట్టణ ప్రగతి యూనిట్లు, ఆహా క్యాంటీన్లు, మెప్మా అర్బన్ మార్కెట్లు, చేయూత, జీవనోపాధి యూనిట్లు ఏర్పాటుచేసి స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవాలని మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి ఇటీవల జిల్లాల మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు, సిబ్బందిని ఆదేశించారు.
ఇందుకోసం ప్రాంతాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు జిల్లాల పరిధిలో సమావేశాలు ముగిశాయి. రాయలసీమ జిల్లాల పథక సంచాలకులు, సిబ్బందికి నెల్లూరులో బుధవారం సమావేశం నిర్వహించనున్నారు.
ఎస్‌హెచ్‌జీలు బలోపేతం: మెప్మా ఎండీ
రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా వివిధ సంక్షేమ పథకాలు ఎంత మందికి అందాయి.. ఇంకా పొందాల్సిన వారు ఎవరైనా ఉన్నారా.. అనేదానిపై సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. అర్బన్ స్వయం సహాయక సంఘాలు బలోపేతం కావాలని, ప్రతి సభ్యురాలిని స్వయం ఉపాధి వైపు మెప్మా ప్రోత్సహిస్తుందని చెప్పారు. వారికి అందుతున్న చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, జగనన్న తోడు... వంటి పథకాలతో ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు.
ఆ నగదుతో వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే పలు దఫాలుగా మహిళలకు శిక్షణనిచ్చి, వారితో పలు వ్యాపార సంస్థలను ఏర్పాటుచేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మిగిలిన సభ్యులకు అవసరమైన సహకారం అందించేందుకు స్వయంగా సభ్యులతో మాట్లాడాలని తమ సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. ఇంటిని చక్కదిద్దుకునే మహిళలు వ్యాపారాన్ని విజయవంతంగా చేయగలరని తమ జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మార్టులు, ఆహా క్యాంటీన్లు నిరూపించాయన్నారు. ఆయా యూనిట్ల బలోపేతం కోసం నిరంతరం శిక్షణ, పర్యవేక్షణ అందించాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. ఏపీ టిడ్కో గృహాల లబ్ధిదారులకు యూఎల్బీల పరిధిలో 100శాతం బ్యాంకు రుణాలు అందించే ఏర్పాట్లు చేశామని ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment