Aafrin Hirani: ఆదిలాబాద్‌ అమ్మాయికి రెక్కలొచ్చాయి | Aafrin Hirani: Adilabad Gets Their Second Woman Pilot | Sakshi
Sakshi News home page

Aafrin Hirani: ఆదిలాబాద్‌ అమ్మాయికి రెక్కలొచ్చాయి

Published Tue, Nov 1 2022 1:37 AM | Last Updated on Tue, Nov 1 2022 8:07 AM

Aafrin Hirani: Adilabad Gets Their Second Woman Pilot - Sakshi

తల్లిదండ్రులతో ఆఫ్రిన్‌ హిరానీ

అవును. ఇండిగో రంగు రెక్కలు. ఆకాశంలో దూసుకువెళ్లే రెక్కలు. ఆ రెక్కలు ఇకపై ఎందరినో గమ్యానికి చేర్చనున్నాయి. ఆదిలాబాద్‌ నుంచి మొదటి మహిళా పైలెట్‌ అయిన స్వాతి రావు స్ఫూర్తితో అదే అదిలాబాద్‌ జిల్లా నుంచి రెండో పైలెట్‌ అయ్యింది ఆఫ్రిన్‌ హిరానీ. ఇంద్రవెల్లిలో డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ నడిపే ఆమె తండ్రి ఆఫ్రిన్‌కు ఆపాయింట్‌మెంట్‌  లెటర్‌ రావడంతోటే తన దగ్గర పని చేసే 15 మంది గిరిజన ఉద్యోగులను విమానం ఎక్కించి తిరుపతి తీసుకెళ్లడం విశేషం.


తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులను విమానంలో తీసుకెళ్తున్న ఆఫ్రీన్‌ తండ్రి

ఆఫ్రిన్‌ హిరానీకి కొంత దారి ముందే పడింది.ఆ దారి వేసింది అదే జిల్లా నుంచి మొదటిసారి కమర్షియల్‌ పైలెట్‌ అయిన స్వాతి రావు. 2005లో స్వాతి రావు కమర్షియల్‌ పైలెట్‌ అవ్వాలని అనుకున్నప్పుడు వెనుకబడిన జిల్లా కావడం వల్ల ఆమెకు ఏ సమాచారం దొరకలేదు. ఇంటర్నెట్‌ లేదు. కోర్సు ఎక్కడ దొరుకుతుందో తెలియదు. తండ్రికి కూడా పెద్దగా వివరాలు తెలియలేదు. కాని అదే సమయంలో ఆమె తమ్ముడు బిట్స్‌ పిలానిలో చేరడంతో అక్కడి నుంచే వివరాలు తెలుసుకుని అక్కకు చెప్పాడు. దాంతో స్వాతి రావు మొదట హైదరాబాద్‌లో చదివి ఆ తర్వాత ఫిలిప్పైన్స్‌ వెళ్లి ‘కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌’ (సి.పి.ఎల్‌) చేసింది. ఇండియా తిరిగొచ్చి పైలెట్‌ అయ్యింది.

‘నేను పైలెట్‌ అవ్వాలనుకున్నప్పుడు ఆమె నుంచే స్ఫూర్తి పొందాను’ అంది ఆఫ్రిన్‌ హిరానీ. ‘మా జిల్లా నుంచి ఆమె పైలెట్‌ అయినప్పుడు నేనెందుకు కాకూడదు అని గట్టిగా అనుకున్నాను’ అంటుంది ఆఫ్రిన్‌. 28 ఏళ్ల ఆఫ్రిన్‌ ఇప్పుడు ఇండిగో పైలెట్‌. మనం ఏ చెన్నైకో, ఢిల్లీకో ఇండిగోలో వెళుతున్నప్పుడు మనం ఎక్కిన ఫ్లయిట్‌ను ఆఫ్రిన్‌ నడపవచ్చు. ‘నేను మీ పైలెట్‌ ఆఫ్రిన్‌ని’ అని మైక్రోఫోన్‌లో మనకు గొంతు వినిపించవచ్చు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచే మరో అమ్మాయి పైలెట్‌ కావడం అంటే చిన్న విషయం కాదు.



చిల్లర అంగడి నుంచి నింగికి
ఆఫ్రిన్‌ తండ్రి అజిజ్‌ హిరానీకి ఇంద్రవెల్లిలో పెద్ద డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ ఉంది. అతను స్కూల్‌ చదువు మాత్రమే చదువుకున్నాడు. భార్య నవీన హిరాని గృహిణి. వారి కుమార్తె ఆఫ్రిన్‌ పైలెట్‌ కావాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ ఆమెకు మద్దతు పలికారు. ‘నా కూతురికి ఎంత సపోర్ట్‌ కావాలంటే అంత సపోర్ట్‌ ఇవ్వాలనుకున్నాను’ అంటాడు అజిజ్‌. అతను ఇంద్రవెల్లిలోని గిరిజనేతర పిల్లలతో పాటు గిరిజన పిల్లలకు కూడా సమాన చదువు అందాలని ‘ఇంద్రవెల్లి పబ్లిక్‌ స్కూల్‌’ పేరుతో ఒక స్కూల్‌ కూడా నడుపుతున్నాడు. ఆఫ్రిన్‌ తన ప్రాథమిక విద్యను అక్కడే చదివింది. హైదరాబాద్‌లో ఇంటర్‌ చేసి మల్లారెడ్డి కాలేజ్‌ నుంచి ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో రెండళ్ల ఫ్లయింగ్‌ కోర్సు చేసింది. 2020 సంవత్సరం నాటికి పూర్తి యోగ్యతతో ఆమె ఇండియా తిరిగి వచ్చింది. అయితే కోవిడ్‌ వల్ల ఆమె అపాయింట్‌మెంట్‌ ఆలస్యమైంది. ఇటీవలే ఇండిగోలో జాయిన్‌ అయ్యింది. ‘ఎప్పుడెప్పుడు నా దేశంలో విమానం ఎగరేద్దామా అన్న నా కోరిక ఇన్నాళ్లకు తీరింది’ అంటుంది ఆఫ్రిన్‌.

మత సామరస్యం
ఆఫ్రిన్‌కు పైలెట్‌గా అపాయింట్‌మెంట్‌ రాగానే ఆమె తల్లిదండ్రులతో పాటు స్టోర్‌లో పని చేసే సిబ్బంది కూడా ఆనందించారు. వారంతా చుట్టుపక్కల పల్లెలకు చెందినవారు. చిరు సంపాదనాపరులు. ఆఫ్రిన్‌ తండ్రి వారి కోసమని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వెంట ఉండి మరీ అందరినీ మొదటిసారి హైదరాబాద్‌ నుంచి విమానంలో తిరుమల యాత్రకు తీసుకెళ్లాడు. జీవితంలో మొదటిసారి విమానం ఎక్కినందుకు వారు ఆనందించారు. ఆఫ్రిన్‌ అంతటి విమానాన్ని నడపబోతుందా అని ఆశ్చర్యపోయారు. ఏమో... రేపు ఈ సిబ్బంది పిల్లల నుంచి మరో స్వాతి, మరో ఆఫ్రిన్‌ రావచ్చు.
ఆడపిల్లలను స్కూల్‌ మాన్పించడం, చిన్న వయసులో వివాహం చేయడం వంటివి మానుకుని వారికి తగిన సపోర్ట్‌ ఇస్తే ఆకాశమే హద్దు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement