Afreen
-
నడిపించేది నాన్న
కల నిజం అయ్యేది కష్టంతోనే. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆఫ్రీన్ కుటుంబానికి కలలు కనేంత వెసులుబాటు లేకపొవచ్చు. అయినా సరే.... ఆ తండ్రి కల కన్నాడు. ఆయన కూతురు కల కన్నది. ఆ కల సాకారం అయింది. ఖమ్మంకు చెందిన షేక్ ఆఫ్రీన్ జాతీయ స్థాయిలో అథ్లెట్‌గా రాణిస్తోంది....‘ఇది వేరే ప్రపంచం’ అనుకున్నారు అక్కాచెల్లెళ్లు సమ్రీన్, ఆఫ్రీన్. ఆ ప్రపంచం పేరు....స్టేడియం. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కొందరు రన్నింగ్ చేస్తున్నారు. కొందరు జంపింగ్ చేస్తున్నారు. ఒకవైపు క్రికెట్ ఆడుతున్నారు. కొందరు వాలీబాల్ ఆడుతున్నారు. వారి ఒంటికి పట్టిన చెమటల మాట ఎలా ఉన్నా...అందరి కళ్లల్లోనూ అంతులేని ఉత్సాహం పొంగిపొర్లుతుంది.ఆ ఉత్సాహమే పద్నాలుగు సంవత్సరాల ఆఫ్రీన్‌ను ఆ స్టేడియంకు దగ్గర చేసింది. ‘పప్పా... మేము నీతో పాటు రోజూ స్టేడియంకు వస్తాం’ అని అడిగారు. ఆఫ్రీన్ తండ్రి రహీమ్ హోంగార్డ్. స్పోర్స్›్టపర్సన్ కూడా. రోజూ తప్పకుండా స్టేడియంకు వచ్చి ఎక్సర్సైజ్లు చేయడం ఆయన దినచర్యలో భాగం. కుమార్తె విన్నపాన్ని విన్న రహీమ్... ‘అలాగే’ అన్నాడు. దీనికి ముందు ‘ఇక్కడికి వచ్చి ఏంచేస్తారు?’ అన్నాడు నవ్వుతూ. ‘మీలాగే ఎక్సర్సైజ్లు చేస్తాం’ అన్నారు సీరియస్‌గా.‘వీరిది ఒకటి రెండు రోజుల ఉత్సాహం. ఆ తరువాత అంతా మామూలే!’ అనుకున్నాడు రహీమ్. కానీ, అతడి అంచనా తప్పయింది. రకరకాల ఎక్సర్సైజ్లు చేయడం నుంచి ఆటల వరకు ఆఫ్రీన్‌కు స్టేడియం ప్రాణం అయింది. స్టేడియంకు రాని రోజూ అంటూ ఉండేది కాదు. ‘ఎప్పుడూ స్టేడియంలోనే కనిపిస్తావు. ఎప్పుడు చదువుకుంటావు!’ అని అడిగే వాళ్లు కొందరు.‘స్టేడియంలో కూడా చదువుకుంటూనే ఉన్నాను’ అని ఆఫ్రీన్ అన్నదో లేదు తెలియదుగానీ స్టేడియంలో తాను ఆటల ప్రపంచాన్ని చదువుతోంది. కట్ చేస్తే... షేక్ అఫ్రీన్ ప్రస్తుతం ఖమ్మంలోని ‘కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్’లో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు అథ్లెటిక్స్‌లోనూ రాణిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పొటీల్లో ఎన్నో పతకాలు సాధించింది. ఎంతో మంది పేదింటి అమ్మాయిలకు రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. మొదట్లో కుమార్తెల ఉత్సాహానికి సంతోషపడిపొయిన రహీం ఆ ఇద్దరికి పరుగు పందెం నిర్వహించాడు. రన్నింగ్‌లో వారి ప్రతిభను చూసి ‘ఈ వజ్రాలకు సానబెట్టాల్సిందే’ అనుకున్నాడు. అదే సమయంలో కోచ్ గౌస్.... ‘ఆఫ్రీన్‌కు శిక్షణ ఇస్తే మంచి అథ్లెట్ అవుతుంది’ అన్నాడు. అతడి నోటి వాక్కు ఫలించింది. ఆఫ్రీన్ తో పాటు సమ్రీన్ కూడా అథ్లెటిక్స్‌లో రాణించింది. జాతీయ, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో పాల్గొంది. ఆఫ్రీన్ ట్రాక్ రికార్డ్2016లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 600 మీటర్ల పరుగులో మూడో స్థానం, 2017లో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో 800 మీటర్ల పరుగులో మొదటిస్థానం, 400 మీటర్లలో రెండోస్థానంలో నిలిచింది. (నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)2022లో జరిగిన తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 300 మీటర్ల పరుగులో ద్వితీయస్థానం, లాంగ్‌జంప్‌లో ద్వితీయస్థానం సాధించింది. 2023లో వరంగల్‌లో నిర్వహించిన సౌత్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో ట్రిపుల్‌జంప్‌లో 5వ స్థానంలో నిలిచింది. 2023లో కరీంనగర్లో జరిగిన తెలంగాణ సౌత్‌జోన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో ట్రిపుల్ జంప్‌లో ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి 19 వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించినసౌత్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో మిడిల్రిలేలో 3వ స్థానం సాధించింది.ఇంకా ఎన్నో సాధించాలి...సాధిస్తానుపొటీల్లో పాల్గొనేటప్పుడు ఆటపైనే ధ్యాస ఉంటుంది. ఫలితం గురించి ఆలోచించను. మా నాన్న కూడా అదే చెబుతారు. నీ వంతుగా శ్రమిస్తే ఓడిపొయినా ఫర్వాలేదని ధైర్యం చెబుతారు. నేను పొటీల్లో రాణించడానికి నాన్న, అమ్మ కష్టపడుతున్నారు. అమ్మ జమీలా అసలు చదువుకోలేదు. నేను అథ్లెటిక్స్‌లో పాల్గొన్న వీడియోలు చూస్తూ నన్ను అభినందిస్తోంది. దేశం తరుపున పొటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించాలనేదే లక్ష్యం. – షేక్ ఆఫ్రీన్– బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మంఫొటోలు: రాధారపు రాజు -
Aafrin Hirani: ఆదిలాబాద్ అమ్మాయికి రెక్కలొచ్చాయి
అవును. ఇండిగో రంగు రెక్కలు. ఆకాశంలో దూసుకువెళ్లే రెక్కలు. ఆ రెక్కలు ఇకపై ఎందరినో గమ్యానికి చేర్చనున్నాయి. ఆదిలాబాద్ నుంచి మొదటి మహిళా పైలెట్ అయిన స్వాతి రావు స్ఫూర్తితో అదే అదిలాబాద్ జిల్లా నుంచి రెండో పైలెట్ అయ్యింది ఆఫ్రిన్ హిరానీ. ఇంద్రవెల్లిలో డిపార్ట్మెంటల్ స్టోర్ నడిపే ఆమె తండ్రి ఆఫ్రిన్‌కు ఆపాయింట్మెంట్ లెటర్ రావడంతోటే తన దగ్గర పని చేసే 15 మంది గిరిజన ఉద్యోగులను విమానం ఎక్కించి తిరుపతి తీసుకెళ్లడం విశేషం. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులను విమానంలో తీసుకెళ్తున్న ఆఫ్రీన్ తండ్రి ఆఫ్రిన్ హిరానీకి కొంత దారి ముందే పడింది.ఆ దారి వేసింది అదే జిల్లా నుంచి మొదటిసారి కమర్షియల్ పైలెట్ అయిన స్వాతి రావు. 2005లో స్వాతి రావు కమర్షియల్ పైలెట్ అవ్వాలని అనుకున్నప్పుడు వెనుకబడిన జిల్లా కావడం వల్ల ఆమెకు ఏ సమాచారం దొరకలేదు. ఇంటర్నెట్ లేదు. కోర్సు ఎక్కడ దొరుకుతుందో తెలియదు. తండ్రికి కూడా పెద్దగా వివరాలు తెలియలేదు. కాని అదే సమయంలో ఆమె తమ్ముడు బిట్స్ పిలానిలో చేరడంతో అక్కడి నుంచే వివరాలు తెలుసుకుని అక్కకు చెప్పాడు. దాంతో స్వాతి రావు మొదట హైదరాబాద్‌లో చదివి ఆ తర్వాత ఫిలిప్పైన్స్ వెళ్లి ‘కమర్షియల్ పైలెట్ లైసెన్స్’ (సి.పి.ఎల్) చేసింది. ఇండియా తిరిగొచ్చి పైలెట్ అయ్యింది. ‘నేను పైలెట్ అవ్వాలనుకున్నప్పుడు ఆమె నుంచే స్ఫూర్తి పొందాను’ అంది ఆఫ్రిన్ హిరానీ. ‘మా జిల్లా నుంచి ఆమె పైలెట్ అయినప్పుడు నేనెందుకు కాకూడదు అని గట్టిగా అనుకున్నాను’ అంటుంది ఆఫ్రిన్. 28 ఏళ్ల ఆఫ్రిన్ ఇప్పుడు ఇండిగో పైలెట్. మనం ఏ చెన్నైకో, ఢిల్లీకో ఇండిగోలో వెళుతున్నప్పుడు మనం ఎక్కిన ఫ్లయిట్‌ను ఆఫ్రిన్ నడపవచ్చు. ‘నేను మీ పైలెట్ ఆఫ్రిన్‌ని’ అని మైక్రోఫోన్లో మనకు గొంతు వినిపించవచ్చు. ఆదిలాబాద్ జిల్లా నుంచే మరో అమ్మాయి పైలెట్ కావడం అంటే చిన్న విషయం కాదు. చిల్లర అంగడి నుంచి నింగికి ఆఫ్రిన్ తండ్రి అజిజ్ హిరానీకి ఇంద్రవెల్లిలో పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది. అతను స్కూల్ చదువు మాత్రమే చదువుకున్నాడు. భార్య నవీన హిరాని గృహిణి. వారి కుమార్తె ఆఫ్రిన్ పైలెట్ కావాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ ఆమెకు మద్దతు పలికారు. ‘నా కూతురికి ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ ఇవ్వాలనుకున్నాను’ అంటాడు అజిజ్. అతను ఇంద్రవెల్లిలోని గిరిజనేతర పిల్లలతో పాటు గిరిజన పిల్లలకు కూడా సమాన చదువు అందాలని ‘ఇంద్రవెల్లి పబ్లిక్ స్కూల్’ పేరుతో ఒక స్కూల్ కూడా నడుపుతున్నాడు. ఆఫ్రిన్ తన ప్రాథమిక విద్యను అక్కడే చదివింది. హైదరాబాద్‌లో ఇంటర్ చేసి మల్లారెడ్డి కాలేజ్ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో రెండళ్ల ఫ్లయింగ్ కోర్సు చేసింది. 2020 సంవత్సరం నాటికి పూర్తి యోగ్యతతో ఆమె ఇండియా తిరిగి వచ్చింది. అయితే కోవిడ్ వల్ల ఆమె అపాయింట్మెంట్ ఆలస్యమైంది. ఇటీవలే ఇండిగోలో జాయిన్ అయ్యింది. ‘ఎప్పుడెప్పుడు నా దేశంలో విమానం ఎగరేద్దామా అన్న నా కోరిక ఇన్నాళ్లకు తీరింది’ అంటుంది ఆఫ్రిన్. మత సామరస్యం ఆఫ్రిన్‌కు పైలెట్‌గా అపాయింట్మెంట్ రాగానే ఆమె తల్లిదండ్రులతో పాటు స్టోర్‌లో పని చేసే సిబ్బంది కూడా ఆనందించారు. వారంతా చుట్టుపక్కల పల్లెలకు చెందినవారు. చిరు సంపాదనాపరులు. ఆఫ్రిన్ తండ్రి వారి కోసమని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వెంట ఉండి మరీ అందరినీ మొదటిసారి హైదరాబాద్ నుంచి విమానంలో తిరుమల యాత్రకు తీసుకెళ్లాడు. జీవితంలో మొదటిసారి విమానం ఎక్కినందుకు వారు ఆనందించారు. ఆఫ్రిన్ అంతటి విమానాన్ని నడపబోతుందా అని ఆశ్చర్యపోయారు. ఏమో... రేపు ఈ సిబ్బంది పిల్లల నుంచి మరో స్వాతి, మరో ఆఫ్రిన్ రావచ్చు. ఆడపిల్లలను స్కూల్ మాన్పించడం, చిన్న వయసులో వివాహం చేయడం వంటివి మానుకుని వారికి తగిన సపోర్ట్ ఇస్తే ఆకాశమే హద్దు. -
హైదరాబాద్.. ఇట్స్ డిఫరెంట్
ఈ ఇరానీ మహిళ పేరు.. అఫ్రీన్. ఇరాన్‌లోని మెషాద్ మెట్రోపొలిస్ యూత్ వింగ్‌లో వర్క్ చేస్తోంది. లెవెంత్ మెట్రోపొలిస్కి డెలిగేట్‌గా హాజరైంది. హైదరాబాద్ గురించి ఆమె మాటలు... నేను భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. డెఫినెట్లీ హైదరాబాద్ ఈజ్ డిఫరెంట్ సిటీ ఫ్రమ్ మైన్. మాది ఇరాన్‌లోని మెషాద్. ది సెకండ్ బిగ్గెస్ట్ సిటీ ఆఫ్ మై కంట్రీ. మా ఊరి జనాభా ముప్పై లక్షలు. ఇక్కడ మూడింతలు. అయినా నాకు ఈ ఊరు బాగా నచ్చింది. బికాజ్ ఆఫ్ వెదర్. వెరీ కోఆపరేటివ్ పీపుల్. ఇండియన్స్ ఇంత మంచివాళ్లని రియల్లీ ఐ డోంట్నో. ఈసారి సైకిల్ మీద ఇండియా యాత్ర చేయాలనుకుంటున్నా. ఇక్కడ చాలా రోజులు గడపాలనుకుంటున్నా. నేను మెషాద్ మెట్రోపొలిస్ యూత్ వింగ్‌లో వర్క్ చేస్తున్నా. వరల్డ్ మెట్రోపొలిస్ కాంగ్రెస్‌కు రావడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్‌తో చర్చలు జరిపాం. అభిప్రాయాలను పంచుకున్నాం. చాలా బాగుంది... చార్మినార్ చూశాను. చాలా బాగుంది. దాని పక్కనున్న మక్కా మసీద్ కూడా చూశా. ఓల్డ్ సిటీకి.. ఈ హైటెక్ సిటీకి చాలా అంతరం ఉందనిపించింది. ఓల్డ్ సిటీ అంతా పావర్టీలో మగ్గుతున్నట్టనిపించింది. దిసీజ్ మై అబ్జర్వేషన్ ఓన్లీ. మళ్లీ వచ్చేటప్పటికి ఈ అనీవెన్ డెవలప్మెంట్ ఈవెన్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ ఇళ్లనే లక్ష్యాన్ని ఈ సిటీ సాధించాలని ఆశిస్తున్నా. మహిళా శక్తి... అద్భుతం. ఇక్కడి మహిళల గురించి నేను చాలా విన్నాను. మాతో పోల్చుకుంటే వీరు చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారనిపించింది. అయినా ప్రపంచంలోని మిగిలిన మహిళలతో సమానంగా అన్ని రంగాల్లో పోటీపడుతున్నారు. చాలా శక్తిమంతులు. మెట్రోపొలిస్ కాంగ్రెస్‌కి వచ్చిన కొంతమంది భారతీయ మహిళలతో మాట్లాడితే తెలిసింది.. రాత్రి ఎనిమిదయ్యిందంటే ఆడవాళ్లు ఒంటరిగా బయటకు వెళ్లడం అస్సలు క్షేమం కాదు ఈ దేశంలో అని. ఆ మాట వింటే చాలా బాధేసింది. ఇండియా లాంటి కంట్రీలో ఇలాంటి దుస్థితి ఏంటని!