కల నిజం అయ్యేది కష్టంతోనే. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆఫ్రీన్ కుటుంబానికి కలలు కనేంత వెసులుబాటు లేకపొవచ్చు. అయినా సరే.... ఆ తండ్రి కల కన్నాడు. ఆయన కూతురు కల కన్నది. ఆ కల సాకారం అయింది. ఖమ్మంకు చెందిన షేక్ ఆఫ్రీన్ జాతీయ స్థాయిలో అథ్లెట్‌గా రాణిస్తోంది....
‘ఇది వేరే ప్రపంచం’ అనుకున్నారు అక్కాచెల్లెళ్లు సమ్రీన్, ఆఫ్రీన్. ఆ ప్రపంచం పేరు....స్టేడియం. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కొందరు రన్నింగ్ చేస్తున్నారు. కొందరు జంపింగ్ చేస్తున్నారు. ఒకవైపు క్రికెట్ ఆడుతున్నారు. కొందరు వాలీబాల్ ఆడుతున్నారు. వారి ఒంటికి పట్టిన చెమటల మాట ఎలా ఉన్నా...అందరి కళ్లల్లోనూ అంతులేని ఉత్సాహం పొంగిపొర్లుతుంది.
ఆ ఉత్సాహమే పద్నాలుగు సంవత్సరాల ఆఫ్రీన్‌ను ఆ స్టేడియంకు దగ్గర చేసింది. ‘పప్పా... మేము నీతో పాటు రోజూ స్టేడియంకు వస్తాం’ అని అడిగారు. ఆఫ్రీన్ తండ్రి రహీమ్ హోంగార్డ్. స్పోర్స్›్టపర్సన్ కూడా. రోజూ తప్పకుండా స్టేడియంకు వచ్చి ఎక్సర్‌సైజ్‌లు చేయడం ఆయన దినచర్యలో భాగం. కుమార్తె విన్నపాన్ని విన్న రహీమ్... ‘అలాగే’ అన్నాడు. దీనికి ముందు ‘ఇక్కడికి వచ్చి ఏంచేస్తారు?’ అన్నాడు నవ్వుతూ. ‘మీలాగే ఎక్సర్‌సైజ్‌లు చేస్తాం’ అన్నారు సీరియస్‌గా.
‘వీరిది ఒకటి రెండు రోజుల ఉత్సాహం. ఆ తరువాత అంతా మామూలే!’ అనుకున్నాడు రహీమ్. కానీ, అతడి అంచనా తప్పయింది. రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం నుంచి ఆటల వరకు ఆఫ్రీన్‌కు స్టేడియం ప్రాణం అయింది. స్టేడియంకు రాని రోజూ అంటూ ఉండేది కాదు. ‘ఎప్పుడూ స్టేడియంలోనే కనిపిస్తావు. ఎప్పుడు చదువుకుంటావు!’ అని అడిగే వాళ్లు కొందరు.
‘స్టేడియంలో కూడా చదువుకుంటూనే ఉన్నాను’ అని ఆఫ్రీన్ అన్నదో లేదు తెలియదుగానీ స్టేడియంలో తాను ఆటల ప్రపంచాన్ని చదువుతోంది. కట్ చేస్తే... షేక్ అఫ్రీన్ ప్రస్తుతం ఖమ్మంలోని ‘కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్’లో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు అథ్లెటిక్స్‌లోనూ రాణిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పొటీల్లో ఎన్నో పతకాలు సాధించింది.
ఎంతో మంది పేదింటి అమ్మాయిలకు రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. మొదట్లో కుమార్తెల ఉత్సాహానికి సంతోషపడిపొయిన రహీం ఆ ఇద్దరికి పరుగు పందెం నిర్వహించాడు. రన్నింగ్‌లో వారి ప్రతిభను చూసి ‘ఈ వజ్రాలకు సానబెట్టాల్సిందే’ అనుకున్నాడు. అదే సమయంలో కోచ్ గౌస్.... ‘ఆఫ్రీన్‌కు శిక్షణ ఇస్తే మంచి అథ్లెట్ అవుతుంది’ అన్నాడు. అతడి నోటి వాక్కు ఫలించింది. ఆఫ్రీన్ తో పాటు సమ్రీన్ కూడా అథ్లెటిక్స్‌లో రాణించింది. జాతీయ, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో పాల్గొంది.
ఆఫ్రీన్ ట్రాక్ రికార్డ్
2016లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 600 మీటర్ల పరుగులో మూడో స్థానం, 2017లో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో 800 మీటర్ల పరుగులో మొదటిస్థానం, 400 మీటర్లలో రెండోస్థానంలో నిలిచింది. (నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)
2022లో జరిగిన తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో 300 మీటర్ల పరుగులో ద్వితీయస్థానం, లాంగ్‌జంప్‌లో ద్వితీయస్థానం సాధించింది. 2023లో వరంగల్‌లో నిర్వహించిన సౌత్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో ట్రిపుల్‌జంప్‌లో 5వ స్థానంలో నిలిచింది. 2023లో కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ సౌత్‌జోన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో ట్రిపుల్ జంప్‌లో ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి 19 వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించినసౌత్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో మిడిల్‌రిలేలో 3వ స్థానం సాధించింది.
ఇంకా ఎన్నో సాధించాలి...సాధిస్తాను
పొటీల్లో పాల్గొనేటప్పుడు ఆటపైనే ధ్యాస ఉంటుంది. ఫలితం గురించి ఆలోచించను. మా నాన్న కూడా అదే చెబుతారు. నీ వంతుగా శ్రమిస్తే ఓడిపొయినా ఫర్వాలేదని ధైర్యం చెబుతారు. నేను పొటీల్లో రాణించడానికి నాన్న, అమ్మ కష్టపడుతున్నారు. అమ్మ జమీలా అసలు చదువుకోలేదు. నేను అథ్లెటిక్స్‌లో పాల్గొన్న వీడియోలు చూస్తూ నన్ను అభినందిస్తోంది. దేశం తరుపున పొటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించాలనేదే లక్ష్యం.
– షేక్ ఆఫ్రీన్
– బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మం
ఫొటోలు: రాధారపు రాజు
Comments
Please login to add a commentAdd a comment