
పారిస్: ఫ్రాన్స్ ప్రభుత్వం పెన్షన్ సంస్కరణల్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతోంది. దేశ పార్లమెంటులో ఓటింగ్ జరగకుండానే బిల్లు చట్టరూపం దాల్చేలా ప్రత్యేకమైన రాజ్యాంగ అధికారాన్ని పొందేలా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ చర్యలు తీసుకున్నారు.
రిటైర్‌మెంట్ వయసును 62 ఏళ్ల నుంచి 64 సంవత్సరాలకు పెంచుతూ తీసుకుని వచ్చిన ఈ బిల్లు నేషనల్ అసెంబ్లీలోని దిగువ సభలో ఆమోదం పొందే అవకాశం లేదు. అందుకే ఓటింగ్‌కి కొన్ని నిమిషాల ముందు ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్న్ చట్టసభలు ఆమోదించకుండానే బిల్లు చట్టంగా మారేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 49:3ని వినియోగించుకున్నారు. ఈ కొత్త పెన్షన్ బిల్లుపై గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.