Cambridge Analytics
-
క్లౌడ్ డేటా భారత్‌లోనే..!
న్యూఢిల్లీ: క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీలకు భారత ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఆయా సంస్థలు భారతీయుల సమాచారాన్ని భారత్‌లోనే భద్రపరచాలని ఆదేశించనుంది. జాతీయ క్లౌడ్ కంప్యూటింగ్ విధానం రూపకల్పనకు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ ఇదే తరహా సిఫార్సులతో ముసాయిదా నివేదికను రూపొందించింది. దేశ భద్రత దృష్ట్యా భారతీయుల సమాచారాన్ని విదేశాల్లో కాకుండా భారత్‌లోని డేటా సెంటర్లలోనే స్టోర్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. వీటిలో ఈ–కామర్స్ సైట్లతో పాటు డిజిటల్ పేమెంట్ విభాగాలనూ చేర్చాలంది. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడితే అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు దెబ్బేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ్థ ఫేస్బుక్ నుంచి ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ సంస్థ కోట్లాది మంది వినియోగదారుల సమాచారాన్ని తస్కరించిన నేపథ్యంలో భారతీయుల డేటా స్థానికంగానే ఉండటం మంచిదనే వాదన పెరిగింది. సత్వర విచారణకు దోహదం.. డేటా సెంటర్లను భారత్‌లోనే ఏర్పాటు చేస్తే నేరాలకు సంబంధించి విచారణ సంస్థలు కేసుల సమాచారాన్ని సులభంగా పొందవచ్చని కమిటీ చెబుతోంది. దీంతో కేసుల విచారణ వేగవంతమవుతుందని అభిప్రాయపడింది. డేటా సెంటర్ల ఏర్పాటుకు దేశంలో అనువుగా ఉన్న 20 ప్రాంతాలను ఎంపిక చేయాలని కోరింది. క్లౌడ్ సేవల్ని ఒకే ఛత్రం కిందకు తెచ్చేందుకు ‘నేషనల్ క్లౌడ్ స్ట్రాటజీ’ని రూపొందించాలని సూచించింది. కేంబ్రిడ్జ్ అనలిటికా భారతీయుల సమాచారాన్ని ఫేస్బుక్ నుంచి దొంగలించిన నేపథ్యంలో కమిటీ ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. కాగా, ఈ ముసాయిదా నివేదికను ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ 15లోపు కేంద్ర ఐటీ శాఖకు సమర్పిస్తామని గోపాలకృష్ణన్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే తీసుకురానున్న సమాచార భద్రత చట్టంలో ఈ ప్రతిపాదనలకు చోటుదక్కే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ప్రతిపాదనలతో నష్టాలేంటి? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులను అమలు చేస్తే క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లో అగ్రగామిగా ఉన్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం సంస్థలు భారత్‌లో తమ డేటా సెంటర్లను ప్రారంభించక తప్పదు. దీంతో క్లౌడ్ సేవల ధరలు పెరిగే అవకాశముందని, అంతిమంగా ఇది చిన్న, మధ్య తరహా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్పారు. భారత్‌లో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉండటం, డేటా సెంటర్ల కోసం చాలా అనుమతులు తీసుకోవాల్సి రావడం క్లౌడ్ కంపెనీలకు ఇబ్బందికరంగా మారవచ్చు. విదేశీ క్లౌడ్ కంపెనీలు సైతం కమిటీ నివేదికపై పెదవి విరుస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సాధారణంగా కంపెనీలు తమ సమాచారాన్ని నిల్వ చేయడంతో పాటు కొత్త సాఫ్ట్‌వేర్స్‌ను కొనుగోలు చేయాలంటే భారీగా ఖర్చవుతుంది. దీన్ని పెద్దపెద్ద కంపెనీలు తప్ప చిన్న సంస్థలు భరించలేవు. ఈ నేపథ్యంలోనే క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు పుట్టుకొచ్చాయి. దీనికింద అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు చిన్నచిన్న సంస్థలకు సాఫ్ట్వేర్స్, సర్వర్లు, డేటాబేస్, నెట్వర్కింగ్, స్టోరేజ్ సౌకర్యాలను తక్కువ ఫీజుకే అందిస్తాయి. దీనివల్ల ఆయా సంస్థలకు డబ్బులు గణనీయంగా ఆదా అవుతాయి. అంతేకాకుండా క్లౌడ్‌లో సమాచారం అత్యంత సురక్షితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలావరకూ చిన్న, మధ్య స్థాయి కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు పొందేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం సంస్థలు ముందంజలో ఉన్నాయి. దీంతో చాలావరకూ భారత కంపెనీల సమాచారం విదేశాల్లోని డేటా సెంటర్లలోనే స్టోర్ అవుతోంది. ► భారత్‌లో డేటా సెంటర్లు (22 ప్రాంతాల్లో) 141 ► వీటిలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోనే ఉన్నవి 80% ► 2022 కల్లా భారత క్లౌడ్ మార్కెట్ విలువ రూ.47,964 కోట్లు -
ఫేస్బుక్ డేటా దుర్వినియోగంపై విచారణ
న్యూఢిల్లీ: ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ సంస్థ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతుందని కేంద్రం తెలిపింది. ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ గురువారం రాజ్యసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా ఉల్లంఘించిందో? లేదో? సీబీఐ నిర్ధారిస్తుందని తెలిపారు. ఫేస్బుక్, కేంబ్రిడ్జ్ అనలిటికాకు నోటీసులు జారీచేయగా, డేటా చౌర్యం ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఫేస్బుక్ బదులిచ్చిందని చెప్పారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తుండటంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో నకిలీ వార్తలు, విద్వేషపూరిత సమాచార కట్టడికి మార్గాలు కనుగొనాలని ఆ సంస్థలను ఆదేశించినట్లు చెప్పారు. మనుషుల అక్రమరవాణా బిల్లు ఆమోదం మనుషుల అక్రమ రవాణా నిరోధించేందుకు ప్రవేశపెట్టిన బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. కాంగ్రెస్, సీపీఎం బిల్లును స్థాయీ సంఘానికి పంపాలని డిమాండ్ చేయగా, చట్టం చేయడానికి ఇప్పటికే ఆలస్యమైందని మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ బదులిచ్చారు. బాధితులను దృష్టిలో పెట్టుకునే ఈ చట్టం తెస్తున్నామని, దోషులకు శిక్షలు పడే రేటు పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బాధితులు, సాక్షులు, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచేలా ఈ బిల్లులో నిబంధనలు చేర్చారు. మూడేళ్లలో అధ్యాపక పోస్టుల భర్తీ వర్సిటీలు, కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను మూడేళ్లలోగా భర్తీ చేయాలని వర్సిటీలను కేంద్రం ఆదేశించింది. ఆలిండియా సర్వే ఆన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ 2016–17 ప్రకారం దేశవ్యాప్తంగా 3,06,017 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని మానవ వనరుల అభివృద్ధి మంత్రి జవడేకర్ చెప్పారు. వీటిలో 1,37,298 పోస్టులు పట్టణ ప్రాంతాల్లో, 1,68,719 అధ్యాపక పోస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మహిళల సాధికారతకు కొత్త పథకం ప్రజల భాగస్వామ్యం ఆధారంగా గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించేందుకు ‘మహిళా శక్తి కేంద్ర’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి వీరేంద్ర‡ రాజ్యసభకు తెలిపారు. 2017–20 మధ్యకాలంలో ఈ పథకం అమలుకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. పంచాయితీ స్థాయి కార్యక్రమంలో భాగంగా 115 జిల్లాల్లో ప్రభుత్వం ఎంపిక చేసిన విద్యార్థి వాలంటీర్లు గ్రామీణ మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వాలు తెచ్చిన పథకాలతో పాటు ఇతర సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తారని కుమార్ పేర్కొన్నారు. -
నిబంధనల మేరకే సీజేఐ ఎంపిక
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఎంపిక విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ప్రస్తుత సీజేఐ తన తర్వాత ఉన్న సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరిని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేస్తారని.. అనంతరం కార్యనిర్వాహక వ్యవస్థ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. సీజేఐ దీపక్ మిశ్రా పదవీ కాలం అక్టోబర్ 2న ముగియనున్న నేపథ్యంలో.. సీనియర్ అయిన రంజన్ గొగోయ్‌కు సీజేఐ పదవి దక్కుతుందా అన్న ప్రశ్నకు రవిశంకర్ ఈ సమాధానమిచ్చారు. ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసెస్ (ఏఐజేఎస్) విషయంలో న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య భేదాభిప్రాయాలున్న విషయాన్ని అంగీకరిస్తూనే.. కిందిస్థాయి కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపికలోనూ ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే విధంగా.. పలు సంస్థలు భారతీయుల డేటాను దుర్వినియోగం చేయడాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. వీరిపై కఠిన చర్యలు తప్పవన్నారు. దీనిపై ఇప్పటికే ఫేస్బుక్ క్షమాపణలు చెప్పిందని.. కేంబ్రిడ్జ్ అనలిటికా నుంచి ఇంకా వివరాలు సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్‌ను రవిశంకర్ సమర్థించుకున్నారు. 121 కోట్ల మంది భారతీయులకు కేంద్ర పథకాల లబ్ధిని అందించడంలో ఆధార్ కీలకమన్నారు. ఆధార్ వ్యవస్థను మరింత పకడ్బందీగా మారుస్తున్నట్లు ఆయన చెప్పారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతివ్వాలని సీనియర్ మహిళా నేతలైన సోని యా గాంధీ, మాయావతి, మమత బెనర్జీలను మంత్రి కోరారు. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా స్పందిం చాల్సిన అవసరం ఉందన్నారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరస్తులపై కఠినంగా వ్యవహరించేలా చట్టాల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. -
కేంబ్రిడ్జ్ అనలిటికా మూసివేత
లండన్: ఫేస్బుక్ యూజర్ల డేటా దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌కు చెందిన డేటా కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా మూతపడింది. వ్యాపారంలో నష్టాలు రావడం వల్లే కేంబ్రిడ్జ్ అనలిటికాను మూసివేస్తున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించిన కేంబ్రిడ్జ్ అనలిటికా ఆ సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా వాడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఇదే విధానాన్ని ఉపయోగించినట్టు.. భారత్‌లోనూ సుమారు 5 లక్షల మంది యూజర్ల సమాచారాన్ని సేకరించి ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేసినట్టు వెలుగు చూడటంతో కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కార్యకలాపాలను తక్షణం ఆపేస్తున్నామని, దివాళా ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని కేంబ్రిడ్జ్ అనలిటికా ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే తాము ఎటువంటి తప్పూ చేయలేదని, మీడియాలో వచ్చిన వ్యతిరేక కథనాల వల్ల తమకు క్లయింట్లు లేకుండా పోయారని, దీనికితోడు లీగల్ ఫీజుల భారం పెరిగి పోవడంతో మూసివేత నిర్ణయం తప్పలేదని సీఏ యాజమాన్యం స్పష్టం చేసింది. -
భారత్‌లోనూ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’లు
న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కన్సల్టెన్సీ సంస్థ 8.7 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అంతకు మించిన సమాచార కుంభకోణాలు మన దేశంలోనే జరుగుతున్న విషయం ‘ఇండియా టుడే’ రహస్య పరిశీలనలో తాజాగా తేటతెల్లమైంది. ఆన్లైన్ వ్యవస్థ, సమాచారంపై దేశంలో సరైన నియంత్రణ, చట్టాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రజల ఓట్లను ప్రభావితం చేయడం కోసం భారత్‌లోనూ వివిధ ప్రధాన నగరాల్లో కన్సల్టెన్సీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఉద్యోగాల కోసం జాబ్ పోర్టళ్లలో రెజ్యూమె పెట్టినప్పుడు, షాపింగ్ యాప్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో షాపింగ్ చేసినప్పుడు, క్రెడిట్, డెబిట్ కార్డులు వాడినప్పుడు, బ్యాంకులు, టెలికం, డీటీహెచ్ సేవలను ఉపయోగించుకున్నప్పుడు.. ఇలా ప్రతీ సందర్భంలోనూ కోట్లాది మంది ప్రజల అమూల్యమైన సమాచారాన్ని అవి తస్కరిస్తున్నాయి. తర్వాత ఆ వివరాలను ఉపయోగించుకుని వినియోగదారుల అభిరుచులను బట్టి వారి ఓట్లను ప్రభావితం చేసేలా వివిధ రాజకీయ పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని మొబైల్‌తోపాటు వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లోనూ మెసేజ్‌లు పంపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేస్తాం.. ఢిల్లీకి చెందిన ‘జనాధార్’ అనే కన్సల్టెన్సీ సంస్థ వ్యవస్థాపకుడు మనీశ్ మాట్లాడుతూ అనేక మార్గాల్లో సేకరించిన ఓటర్ల జాబితా తమ వద్ద ఉందనీ, ఈ నెలలోనే జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తామని ఇండియా టుడే విలేకరికి హామీనిచ్చాడు. రెండోసారి విలేకరి మనీశ్‌ను కలిసినప్పటికి దక్షిణ బెంగళూరు నియోజకవర్గానికి చెందిన రెండు లక్షల ఓటర్ల వివరాలను అతను సేకరించి పెట్టాడు. ఓటరు పేరు, చిరునామా, ఫోన్ నంబర్, పాన్, ఆధార్ నంబర్, ఆర్థిక పరమైన వివరాలు కూడా ఉన్నాయి.‘ఎవరైనా ఉద్యోగం కోసం జాబ్ పోర్టళ్లలో రెజ్యూమె పెట్టినా, క్రెడిట్ కార్డు వాడినా, లాయల్టీ ప్రోగ్రాంలలో సభ్యత్వం తీసుకున్నా వారికి సంబంధించిన సమాచారం నాకు అందుతుంది. వారు వారి సమాచారాన్ని ఎక్కడ ఇచ్చినా అది నాకు చేరుతుంది’ అని మనీశ్ చెప్పుకొచ్చాడు. అయితే బెంగళూరు నగరంలోని ఒక నియోజకవర్గ ఓటర్ల సమాచారాన్ని ఇచ్చేందుకే అతను ఏకంగా 1.2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. టెలికం అధికారులతో లాలూచీ.. టెలికాం కంపెనీల అధికారులతో కుమ్మక్కయ్యి ఒక్కో ప్రాంతంలోని టవర్ల నుంచి ప్రతి వినియోగదారుడి సమాచారాన్ని తాము సేకరిస్తున్నామని పోల్స్టర్ అనే మరో సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అలాగే ఓటు హక్కుపై అవగాహన కల్పించే నెపంతో తమ సిబ్బంది వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి ఓటర్ల సమాచారాన్ని సేకరిస్తారని కూడా ఆయన తెలిపారు. ఈ విధంగా వచ్చిన సమాచారంతో కనీసం 5 నుంచి 6 శాతం ఓటర్లను ప్రభావితం చేయొచ్చని వివరించారు. ఢిల్లీకి చెందిన మావరిక్ డిజిటల్, ముంబై కేంద్రంగా పనిచేసే క్రోనో డిజిటల్ తదితర కంపెనీలు కూడా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇండియా టుడే పరిశీలనలో బయటపడింది. -
‘కేంబ్రిడ్జి అనలిటికా’లు ఇంకెన్నో?
న్యూయార్క్/వాషింగ్టన్: ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా మాదిరిగా మరికొన్ని సంస్థలు దుర్వినియోగం చేసి ఉండొచ్చని ఫేస్బుక్ సీవోవో (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) షెరిల్ శాండ్‌బర్గ్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇప్పుడే నిర్ధారించలేమనీ, వివరాలను పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 8.7 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ ఎన్నికల కోసం వాడుకోవడం తెల్సిందే. ఫేస్బుక్లో రాజకీయపరమైన ప్రకటనలు ఇచ్చేందుకు నిబంధనలు కఠినతరం కానున్నాయి. ప్రకటన ఇస్తున్న వారి చిరునామా సహా మిగిలిన గుర్తింపు వివరాలను ధ్రువీకరించుకున్న తర్వాతే ప్రకటనలు తీసుకుంటామని ఫేస్బుక్ ప్రకటించింది. ఫేస్బుక్లో ‘అన్‌సెండ్’ ఫీచర్ ఫేస్బుక్లో ఎవరికైనా మెసేజ్ పంపితే దానిని డిలీట్ లేదా మార్పు చేసే వీల్లేదు. వాట్సాప్‌లో ఇలాంటి అవకాశముంది. ఇకపై ఇతరులకు పంపిన సందేశాలను డిలీట్ చేసేలా ‘అన్‌సెండ్’ ఫీచర్‌ను ఫేస్బుక్ ప్రవేశపెట్టబోతున్నట్లు సాంకేతిక వార్తల వెబ్సైట్ టెక్‌క్రంచ్ తెలిపింది. ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేంతవరకూ జుకర్‌బర్గ్ గతంలో కస్టమర్లకు పంపిన మెసేజ్‌లను సంస్థ డిలీట్ చేయదు. -
ఫేస్‘బుక్’!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫేస్బుక్ డేటా లీక్ ఘటనలో 5.62 లక్షల మంది భారతీయుల వివరాలు ఉండొచ్చని ఫేస్బుక్ గురువారం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మొదట ఐదుకోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల డేటా లీక్ అయినట్లు భావించినప్పటికీ.. తాజా వివరాల ప్రకారం ఇది 8.7 కోట్లు ఉండొచ్చని ఫేస్బుక్ ప్రతినిధి స్పష్టం చేశారు. ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారుల సమాచారం మాత్రమే లీకైందని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ అలెగ్జాండర్ కోగాన్ ఈ యాప్‌ను రూపొందించగా.. దీన్నుంచి కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ సమాచారాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. ‘భారత్‌లో మొత్తం 20 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారులున్నారు. ఇందులో కేవలం 335 మంది మాత్రమే నేరుగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవటంతో వీరిపై ప్రత్యక్ష ప్రభావం ఉంది. 5,62,120 మందిపై పరోక్షంగా దీని ప్రభావం ఉండొచ్చు’ అని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు. ఈ డేటా సేకరణ పూర్తిగా అనధికారికంగా జరిగిందని.. ఫేస్బుక్ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు వివరాలు తీసుకునేందుకు ఎప్పుడూ అనుమతివ్వలేదన్నారు. డేటా లీక్‌పై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫేస్బుక్ సమాధానం ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. భారీ తప్పిదమే: ప్రపంచవ్యాప్తంగా 8.7 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల డేటా దుర్వినియోగం.. భారీ తప్పిదమని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అంగీకరించారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత పొరపాటేనని.. ఇకపై తప్పులు జరగకుండా చూసుకుంటామన్నారు. తప్పులు సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. డేటా దుర్వినియోగం కారణంగా ఎక్కువగా ప్రభావితమైంది అమెరికా వినియోగదారులే. -
భారీగా సంపద కోల్పోయిన జుకర్‌బర్గ్