న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫేస్‌బుక్ డేటా లీక్ ఘటనలో 5.62 లక్షల మంది భారతీయుల వివరాలు ఉండొచ్చని ఫేస్‌బుక్ గురువారం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మొదట ఐదుకోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల డేటా లీక్ అయినట్లు భావించినప్పటికీ.. తాజా వివరాల ప్రకారం ఇది 8.7 కోట్లు ఉండొచ్చని ఫేస్‌బుక్ ప్రతినిధి స్పష్టం చేశారు. ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారుల సమాచారం మాత్రమే లీకైందని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ అలెగ్జాండర్ కోగాన్ ఈ యాప్‌ను రూపొందించగా.. దీన్నుంచి కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ సమాచారాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. ‘భారత్‌లో మొత్తం 20 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారులున్నారు. ఇందులో కేవలం 335 మంది మాత్రమే నేరుగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటంతో వీరిపై ప్రత్యక్ష ప్రభావం ఉంది. 5,62,120 మందిపై పరోక్షంగా దీని ప్రభావం ఉండొచ్చు’ అని ఫేస్‌బుక్ ప్రతినిధి తెలిపారు. ఈ డేటా సేకరణ పూర్తిగా అనధికారికంగా జరిగిందని.. ఫేస్‌బుక్ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు వివరాలు తీసుకునేందుకు ఎప్పుడూ అనుమతివ్వలేదన్నారు. డేటా లీక్‌పై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫేస్‌బుక్ సమాధానం ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది.
భారీ తప్పిదమే: ప్రపంచవ్యాప్తంగా 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల డేటా దుర్వినియోగం.. భారీ తప్పిదమని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అంగీకరించారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత పొరపాటేనని.. ఇకపై తప్పులు జరగకుండా చూసుకుంటామన్నారు. తప్పులు సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. డేటా దుర్వినియోగం కారణంగా ఎక్కువగా ప్రభావితమైంది అమెరికా వినియోగదారులే.
Comments
Please login to add a commentAdd a comment