
లండన్: ఫేస్‌బుక్ యూజర్ల డేటా దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌కు చెందిన డేటా కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా మూతపడింది. వ్యాపారంలో నష్టాలు రావడం వల్లే కేంబ్రిడ్జ్ అనలిటికాను మూసివేస్తున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించిన కేంబ్రిడ్జ్ అనలిటికా ఆ సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా వాడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అలాగే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఇదే విధానాన్ని ఉపయోగించినట్టు.. భారత్‌లోనూ సుమారు 5 లక్షల మంది యూజర్ల సమాచారాన్ని సేకరించి ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేసినట్టు వెలుగు చూడటంతో కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కార్యకలాపాలను తక్షణం ఆపేస్తున్నామని, దివాళా ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని కేంబ్రిడ్జ్ అనలిటికా ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే తాము ఎటువంటి తప్పూ చేయలేదని, మీడియాలో వచ్చిన వ్యతిరేక కథనాల వల్ల తమకు క్లయింట్లు లేకుండా పోయారని, దీనికితోడు లీగల్ ఫీజుల భారం పెరిగి పోవడంతో మూసివేత నిర్ణయం తప్పలేదని సీఏ యాజమాన్యం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment