న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కన్సల్టెన్సీ సంస్థ 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అంతకు మించిన సమాచార కుంభకోణాలు మన దేశంలోనే జరుగుతున్న విషయం ‘ఇండియా టుడే’ రహస్య పరిశీలనలో తాజాగా తేటతెల్లమైంది. ఆన్‌లైన్ వ్యవస్థ, సమాచారంపై దేశంలో సరైన నియంత్రణ, చట్టాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రజల ఓట్లను ప్రభావితం చేయడం కోసం భారత్‌లోనూ వివిధ ప్రధాన నగరాల్లో కన్సల్టెన్సీ సంస్థలు పుట్టుకొచ్చాయి.
ఉద్యోగాల కోసం జాబ్ పోర్టళ్లలో రెజ్యూమె పెట్టినప్పుడు, షాపింగ్ యాప్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో షాపింగ్ చేసినప్పుడు, క్రెడిట్, డెబిట్ కార్డులు వాడినప్పుడు, బ్యాంకులు, టెలికం, డీటీహెచ్ సేవలను ఉపయోగించుకున్నప్పుడు.. ఇలా ప్రతీ సందర్భంలోనూ కోట్లాది మంది ప్రజల అమూల్యమైన సమాచారాన్ని అవి తస్కరిస్తున్నాయి. తర్వాత ఆ వివరాలను ఉపయోగించుకుని వినియోగదారుల అభిరుచులను బట్టి వారి ఓట్లను ప్రభావితం చేసేలా వివిధ రాజకీయ పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని మొబైల్‌తోపాటు వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లోనూ మెసేజ్‌లు పంపిస్తున్నాయి.
కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేస్తాం..
ఢిల్లీకి చెందిన ‘జనాధార్’ అనే కన్సల్టెన్సీ సంస్థ వ్యవస్థాపకుడు మనీశ్ మాట్లాడుతూ అనేక మార్గాల్లో సేకరించిన ఓటర్ల జాబితా తమ వద్ద ఉందనీ, ఈ నెలలోనే జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తామని ఇండియా టుడే విలేకరికి హామీనిచ్చాడు. రెండోసారి విలేకరి మనీశ్‌ను కలిసినప్పటికి దక్షిణ బెంగళూరు నియోజకవర్గానికి చెందిన రెండు లక్షల ఓటర్ల వివరాలను అతను సేకరించి పెట్టాడు.
ఓటరు పేరు, చిరునామా, ఫోన్ నంబర్, పాన్, ఆధార్ నంబర్, ఆర్థిక పరమైన వివరాలు కూడా ఉన్నాయి.‘ఎవరైనా ఉద్యోగం కోసం జాబ్ పోర్టళ్లలో రెజ్యూమె పెట్టినా, క్రెడిట్ కార్డు వాడినా, లాయల్టీ ప్రోగ్రాంలలో సభ్యత్వం తీసుకున్నా వారికి సంబంధించిన సమాచారం నాకు అందుతుంది. వారు వారి సమాచారాన్ని ఎక్కడ ఇచ్చినా అది నాకు చేరుతుంది’ అని మనీశ్ చెప్పుకొచ్చాడు. అయితే బెంగళూరు నగరంలోని ఒక నియోజకవర్గ ఓటర్ల సమాచారాన్ని ఇచ్చేందుకే అతను ఏకంగా 1.2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు.
టెలికం అధికారులతో లాలూచీ..
టెలికాం కంపెనీల అధికారులతో కుమ్మక్కయ్యి ఒక్కో ప్రాంతంలోని టవర్ల నుంచి ప్రతి వినియోగదారుడి సమాచారాన్ని తాము సేకరిస్తున్నామని పోల్‌స్టర్ అనే మరో సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అలాగే ఓటు హక్కుపై అవగాహన కల్పించే నెపంతో తమ సిబ్బంది వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి ఓటర్ల సమాచారాన్ని సేకరిస్తారని కూడా ఆయన తెలిపారు.
ఈ విధంగా వచ్చిన సమాచారంతో కనీసం 5 నుంచి 6 శాతం ఓటర్లను ప్రభావితం చేయొచ్చని వివరించారు. ఢిల్లీకి చెందిన మావరిక్ డిజిటల్, ముంబై కేంద్రంగా పనిచేసే క్రోనో డిజిటల్ తదితర కంపెనీలు కూడా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇండియా టుడే పరిశీలనలో బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment