Voters inquiry
-
భారత్‌లోనూ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’లు
న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కన్సల్టెన్సీ సంస్థ 8.7 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అంతకు మించిన సమాచార కుంభకోణాలు మన దేశంలోనే జరుగుతున్న విషయం ‘ఇండియా టుడే’ రహస్య పరిశీలనలో తాజాగా తేటతెల్లమైంది. ఆన్లైన్ వ్యవస్థ, సమాచారంపై దేశంలో సరైన నియంత్రణ, చట్టాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రజల ఓట్లను ప్రభావితం చేయడం కోసం భారత్‌లోనూ వివిధ ప్రధాన నగరాల్లో కన్సల్టెన్సీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఉద్యోగాల కోసం జాబ్ పోర్టళ్లలో రెజ్యూమె పెట్టినప్పుడు, షాపింగ్ యాప్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో షాపింగ్ చేసినప్పుడు, క్రెడిట్, డెబిట్ కార్డులు వాడినప్పుడు, బ్యాంకులు, టెలికం, డీటీహెచ్ సేవలను ఉపయోగించుకున్నప్పుడు.. ఇలా ప్రతీ సందర్భంలోనూ కోట్లాది మంది ప్రజల అమూల్యమైన సమాచారాన్ని అవి తస్కరిస్తున్నాయి. తర్వాత ఆ వివరాలను ఉపయోగించుకుని వినియోగదారుల అభిరుచులను బట్టి వారి ఓట్లను ప్రభావితం చేసేలా వివిధ రాజకీయ పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని మొబైల్‌తోపాటు వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లోనూ మెసేజ్‌లు పంపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేస్తాం.. ఢిల్లీకి చెందిన ‘జనాధార్’ అనే కన్సల్టెన్సీ సంస్థ వ్యవస్థాపకుడు మనీశ్ మాట్లాడుతూ అనేక మార్గాల్లో సేకరించిన ఓటర్ల జాబితా తమ వద్ద ఉందనీ, ఈ నెలలోనే జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తామని ఇండియా టుడే విలేకరికి హామీనిచ్చాడు. రెండోసారి విలేకరి మనీశ్‌ను కలిసినప్పటికి దక్షిణ బెంగళూరు నియోజకవర్గానికి చెందిన రెండు లక్షల ఓటర్ల వివరాలను అతను సేకరించి పెట్టాడు. ఓటరు పేరు, చిరునామా, ఫోన్ నంబర్, పాన్, ఆధార్ నంబర్, ఆర్థిక పరమైన వివరాలు కూడా ఉన్నాయి.‘ఎవరైనా ఉద్యోగం కోసం జాబ్ పోర్టళ్లలో రెజ్యూమె పెట్టినా, క్రెడిట్ కార్డు వాడినా, లాయల్టీ ప్రోగ్రాంలలో సభ్యత్వం తీసుకున్నా వారికి సంబంధించిన సమాచారం నాకు అందుతుంది. వారు వారి సమాచారాన్ని ఎక్కడ ఇచ్చినా అది నాకు చేరుతుంది’ అని మనీశ్ చెప్పుకొచ్చాడు. అయితే బెంగళూరు నగరంలోని ఒక నియోజకవర్గ ఓటర్ల సమాచారాన్ని ఇచ్చేందుకే అతను ఏకంగా 1.2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. టెలికం అధికారులతో లాలూచీ.. టెలికాం కంపెనీల అధికారులతో కుమ్మక్కయ్యి ఒక్కో ప్రాంతంలోని టవర్ల నుంచి ప్రతి వినియోగదారుడి సమాచారాన్ని తాము సేకరిస్తున్నామని పోల్స్టర్ అనే మరో సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అలాగే ఓటు హక్కుపై అవగాహన కల్పించే నెపంతో తమ సిబ్బంది వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి ఓటర్ల సమాచారాన్ని సేకరిస్తారని కూడా ఆయన తెలిపారు. ఈ విధంగా వచ్చిన సమాచారంతో కనీసం 5 నుంచి 6 శాతం ఓటర్లను ప్రభావితం చేయొచ్చని వివరించారు. ఢిల్లీకి చెందిన మావరిక్ డిజిటల్, ముంబై కేంద్రంగా పనిచేసే క్రోనో డిజిటల్ తదితర కంపెనీలు కూడా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇండియా టుడే పరిశీలనలో బయటపడింది. -
పారదర్శకంగా ఓటర్ల విచారణ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఓటర్ల విచారణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా రోల్ అబ్జర్వర్, వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదనరావు వెల్లడించారు. ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావులేకుండా ఓటర్ల జాబితా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఓటర్ల విచారణ ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం మధ్యాహ్నం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నాటికి ఓటర్ల నమోదుపై విచారణ పూర్తి చేస్తామన్నారు. గతంలో రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన అభ్యంతరాలపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఓటర్ల విచారణ ప్రక్రియకు సంబంధించి ఇతర శాఖల నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల విచారణపై ఎవరికైనా అనుమానాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఓటర్ల వివరాలను కంప్యూటరీకరించే సమయంలో ఏ ఆపరేటరైనా ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆ రెండు గ్రామాల్లో పూర్తిస్థాయిలో విచారించాలి : కేవీ రమణారెడ్డి ఉలవపాడు మండలంలోని వీరేపల్లి, బద్దిపూడి గ్రామాల్లో ఓటర్ల నమోదుపై పూర్తిస్థాయిలో విచారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఆ రెండు గ్రామాల్లో పెద్దఎత్తున బోగస్ ఓట్లను చేరుస్తున్నారని రోల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకువచ్చారు. ఒంగోలులో వాస్తవ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీటిపై సమగ్రంగా విచారించాలని కోరారు. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై.వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కే అరుణ, పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆన్లైన్ దరఖాస్తులను 10లోపు విచారించాలి ఓటర్ల నమోదుకు సంబంధించి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోపు విచారించి కంప్యూటరీకరించాలని మధుసూదనరావు ఆదేశించారు. 16వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రచురించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితా ప్రచురణకు తీసుకోవాల్సిన చర్యలపై నియోజకవర్గ నమోదు అధికారులు, తహసీల్దార్లతో మంగళవారం సాయంత్రం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరుగా నమోదు కావడానికి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధుల నుంచి ఓటర్ల జాబితాలపై అనుమానాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ ఆన్లైన్లో వచ్చిన అర్జీలన్నింటినీ రెండురోజుల్లో కంప్యూటరీకరించాలన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై కొంత గందరగోళం ఉందన్నారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా జాబితాలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, డీఆర్డీఏ పీడీ పద్మజ, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, డిప్యూటీ కలెక్టర్లు పీ గ్లోరియా, కొండయ్య, రవీంద్ర, కందుకూరు, మార్కాపురం ఆర్డీఓలు టీ బాపిరెడ్డి, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.