ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఓటర్ల విచారణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా రోల్ అబ్జర్వర్, వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదనరావు వెల్లడించారు. ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావులేకుండా ఓటర్ల జాబితా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఓటర్ల విచారణ ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం మధ్యాహ్నం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నాటికి ఓటర్ల నమోదుపై విచారణ పూర్తి చేస్తామన్నారు.
గతంలో రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన అభ్యంతరాలపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఓటర్ల విచారణ ప్రక్రియకు సంబంధించి ఇతర శాఖల నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల విచారణపై ఎవరికైనా అనుమానాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఓటర్ల వివరాలను కంప్యూటరీకరించే సమయంలో ఏ ఆపరేటరైనా ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆ రెండు గ్రామాల్లో పూర్తిస్థాయిలో విచారించాలి : కేవీ రమణారెడ్డి
ఉలవపాడు మండలంలోని వీరేపల్లి, బద్దిపూడి గ్రామాల్లో ఓటర్ల నమోదుపై పూర్తిస్థాయిలో విచారించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఆ రెండు గ్రామాల్లో పెద్దఎత్తున బోగస్ ఓట్లను చేరుస్తున్నారని రోల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకువచ్చారు. ఒంగోలులో వాస్తవ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీటిపై సమగ్రంగా విచారించాలని కోరారు. సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై.వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కే అరుణ, పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తులను 10లోపు విచారించాలి
ఓటర్ల నమోదుకు సంబంధించి ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోపు విచారించి కంప్యూటరీకరించాలని మధుసూదనరావు ఆదేశించారు. 16వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రచురించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితా ప్రచురణకు తీసుకోవాల్సిన చర్యలపై నియోజకవర్గ నమోదు అధికారులు, తహసీల్దార్లతో మంగళవారం సాయంత్రం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరుగా నమోదు కావడానికి ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధుల నుంచి ఓటర్ల జాబితాలపై అనుమానాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో వచ్చిన అర్జీలన్నింటినీ రెండురోజుల్లో కంప్యూటరీకరించాలన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై కొంత గందరగోళం ఉందన్నారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా జాబితాలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, డీఆర్‌డీఏ పీడీ పద్మజ, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, డిప్యూటీ కలెక్టర్లు పీ గ్లోరియా, కొండయ్య, రవీంద్ర, కందుకూరు, మార్కాపురం ఆర్‌డీఓలు టీ బాపిరెడ్డి, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.
పారదర్శకంగా ఓటర్ల విచారణ
Published Wed, Jan 8 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement