వాటికంత సామర్థ్యముందా: సుప్రీం
3 వారాల్లో స్పందించాలని ఈసీకి నిర్దేశం
ఒక్క ఓటర్‌నూ విస్మరించొద్దన్న ధర్మాసనం
ఒక్కో ఈవీఎంలో గంటకు సగటున 45 ఓట్లే
రోజంతా కలిపి 600కు మించవు: పిటిషనర్
న్యూఢిల్లీ: ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో పోలయ్యే గరిష్ట ఓట్ల సంఖ్యను 1,200 నుంచి 1,500కు పెంచుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో హేతుబద్ధతపై సుప్రీంకోర్టు అనుమానాలు లేవనెత్తింది. ‘‘ఒక్క ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం) పోలింగ్ గడువులోగా అన్ని ఓట్లను నమోదు చేయగలదా? దానికి అంత సామర్థ్యముందా? 1,500 కంటే ఎక్కువ మంది ఓటర్లు నమోదయ్యే పోలింగ్ స్టేషన్ల విషయంలో ఏం చేస్తారు? ఒక్కో ఈవీఎం ద్వారా గంటకు సగటున 45కు ఓట్లకు మించి పోల్ కావన్న పిటిషనర్ వాదన నిజమైతే హెచ్చు పోలింగ్ శాతం నమోదయ్యే సందర్భాల్లో ఓటర్ల తాకిడిని తట్టుకోవడం ఎలా సాధ్యం? నిర్దేశిత గడువులోపు అందరూ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తదా?’’ అంటూ ఈసీకి ప్రశ్నలు వేసింది.
ఇందుప్రకాశ్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్‌కుమార్ ధర్మాసనం సోమవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ లేవనెత్తిన పలు అంశాలపై తాము ఆందోళన చెందుతున్నట్టు స్పష్టం చేసింది. ఏ కారణంతోనైనా సరే, ఒక్క ఓటర్ కూడా ఓటింగ్‌కు దూరంగా ఉండే పరిస్థితి రాకూడదని పేర్కొంది. ఈవీఎంల సంఖ్యాపరమైన సామర్థ్యంతో పాటు తాము లేవనెత్తిన సందేహాలన్నింటికీ సమగ్రంగా వివరణ ఇస్తూ ఈసీ మూడు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది.
1,200కు తగ్గించాలి: పిటిషనర్
ఒక్కో పోలింగ్ స్టేషన్ సామర్థ్యాన్ని 1957 నుంచి 2016 దాకా అమల్లో ఉన్న మేరకు 1,200 ఓటర్లకు తగ్గించాలని పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వీ డిమాండ్ చేశారు. ‘‘పోలింగ్ స్టేషన్ సామర్థ్యాన్ని 1,500 మంది ఓటర్లకు పెంచడం వారిని తీవ్ర అసౌకర్యానికి గురి చేయడమే. దీనివల్ల బూత్‌ల వద్ద రద్దీ పెరిగి ఓటేసేందుకు చాలా సమయం పడుతుంది. అంతసేపు వేచి చూడలేక ఓటర్లు ఓటేయకుండానే వెనుదిరిగే ప్రమాదముంది. ఎందుకంటే సగటున 11 గంటలపాటు పోలింగ్ జరుగుతుంది. ఈవీఎంల ద్వారా ఒక్కో ఓటు వేసేందుకు 60 నుంచి 90 సెకన్ల దాకా పడుతుంది. ఆ లెక్కన రోజంతా కలిపినా ఒక్కో ఈవీఎంలో 490 నుంచి 660 ఓట్ల కంటే పోలయ్యే అవకాశం లేదు’’ అన్నారు.
ఈ వాదనను ఈసీ తరఫు న్యాయవాది మణీందర్‌సింగ్ తోసిపుచ్చారు. ‘‘ఈవీఎంల సామర్థ్యంపై అనుమానాలే అవసరం లేదు. ఒక్కో పోలింగ్ స్టేషన్లలో గరిష్టంగా 1,200కు బదులు 1,500 ఓట్లు పోలయ్యే విధానం 2019 నుంచీ అమల్లో ఉంది. పార్టీలన్నింటికీ ముందుగా వివరించాకే ఈసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు. పైగా పోలింగ్ నాడు సాధారణంగా ఉదయపు వేళల్లో పెద్దగా రద్దీ ఉండదు. ఓటర్లంతా ఒకేసారి ఓటేసేందుకు వస్తే మధ్యాహ్నం తర్వాత కాస్త క్యూలు పెరుగుతాయేమో. అలాంటివారు పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా ఓటేసేందుకు ఈసీ అనుమతిస్తూనే ఉంది.
అవసరమైన చోట్ల పోలింగ్ బూత్‌ల సంఖ్యను పెంచడం వంటి చర్యలూ ఉంటాయి’’ అన్నారు. ఈవీఎంలపై ఏదో రకమైన ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, అది ధర్మాసనానికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఓటింగ్ శాతం పెరగాలని, తద్వారా ఎన్నికల ప్రక్రియలో ప్రజలు వీలైనంత ఎక్కువగా పాల్గొనాలని ధర్మాసనం అభిప్రాయపడింది. బ్యాలెట్ పేపర్‌కు బదులు ఈవీఎంలు తేవడంలో ఉద్దేశమూ అదేనని గుర్తు చేసింది. ఇరు వర్గాల వాదనల అనంతరం విచారణను జనవరి 25కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment