మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వీటితోపాటు దేశ వ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి.
అయితే ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్‌లో పోలీసులు బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయడంపై వివాదం చేలరేగింది. దీనిపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. నిష్పక్షపాతంగా ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని భారత ఎన్నికల సంఘం బుధవారం అధికారులను కోరింది. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఈసీ సస్పెండ్ చేసింది.
అర్హత ఉన్న ఓటరు ఓటు వేయకుండా అడ్డుకోరాదని తెలిపింది. ఓటింగ్ సమయంలో ఎలాంటి పక్షపాత వైఖరిని సహించబోమని స్పష్టం చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరుపుతామని, ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక కొనసాగుతుండగా.. బురఖా ధరించిన ఓటర్ల గుర్తింపును సరిగ్గా తనిఖీ చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు బీజేపీ నేత అఖిలేష్ కుమార్ అవస్తీ లేఖ రాసింది. ముసుగులు ధరించిన మహిళలు చాలాసార్లు ఓటు వేయడానికి ప్రయత్నించిన కేసులు గతంలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అంతేకగాక కొంతమంది పురుషులు కూడా బురఖా ధరించి ఓటు వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
అయితే వీరిని ఈసీ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. బురఖా ధరించిన మహిళల గుర్తింపును తనిఖీ చేయకపోతే, నకిలీ ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. సరైన తనిఖీ మాత్రమే న్యాయమైన, పారదర్శకమైన ఓటింగ్‌కు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బురఖా ధరించిన మహిళలను తనిఖీ చేసేందుకు తగిన సంఖ్యలో మహిళా పోలీసులను పోలింగ్ కేంద్రాల వద్ద తప్పనిసరిగా మోహరించాలని ఆయన అన్నారు.
ఓటరు ఐడీ కార్డులను తనిఖీ చేస్తున్న పోలీసులపై ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ చీఫ్, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఇద్దరు పోలీసులు ఓటర్ల గుర్తింపు కార్డులు అడిగే వీడియోను షేర్ చేస్తూ.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ జోక్యాన్ని కోరారు.
"ఎన్నికల సంఘం యాక్టివ్‌గా ఉంటే.. పోలీసులు ఓటర్ల ఐడీలను తనిఖీ చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. రోడ్లు మూసివేయకుండా, ఐడీలను స్వాధీనం చేసుకోకుండా, ఓటర్లను బెదిరించకుండా, ఓటింగ్ వేగం మందగించకుండా, సమయం వృధా కాకుండా చూసుకోవాలని అన్నారు. అధికార పార్టీకి ప్రతినిధిగా ఉండకుండా పరిపాలనను చూసుకోవాలని తెలిపారు.
అయితే అఖిలేష్ యాదవ్ పోస్టుపై కాన్పూర్ పోలీసులు సైతం స్పందించారు. ఓటర్లను తనిఖీ చేసిన సంబంధిత అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.. ఎన్నికల సమయంలో రాష్ట్ర పోలీసులు ఎన్నికల సంఘం ఆధీనంలోకి వస్తారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment