‘వుయ్’ యాప్ పేరుతో ఎన్నికల అక్రమాలకు బరితెగింపు
రూ.వేల కోట్లతో ఓట్ల కొనుగోలుకు సిద్ధం
అధికారంలో ఉండగా ప్రజా సాధికార సర్వే పేరుతో డేటా చౌర్యం
ఇప్పుడు ‘వుయ్’ యాప్‌లో ఓటర్ల సమగ్ర సమాచారం.. ఓటర్ల స్లిప్పులతో ప్రత్యేక బార్‌కోడ్ ఉన్న కరపత్రాల పంపిణీ
బార్‌కోడ్ స్కాన్ చేయగానే హైదరాబాద్ నుంచి డిజిటల్ చెల్లింపులు.. ఓటరుకు రూ.5 వేలు చెల్లిస్తున్నట్టు సమాచారం
ఇందుకోసం మూడంచెల వ్యవస్థ ఏర్పాటు
బూత్ కమిటీల ద్వారా ఇంటింటా స్లిప్పుల పంపిణీ.. దీని పర్యవేక్షణ, బార్‌కోడ్ స్కాన్‌కు మరో బృందం
మొత్తం పర్యవేక్షణకు హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్.. నియోజకవర్గానికి రూ.87.50 కోట్ల చొప్పున డిజిటల్ చెల్లింపులు
మూడంచెల వ్యవస్థలకు అదనపు చెల్లింపులు
మాచర్ల, మైలవరం, ఒంగోలులో బయటపడ్డ వ్యవహారం.. చర్యలు తీసుకోవాలని ఈసీకి, డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులు
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో ప్రజా నిర్ణయం వ్యతిరేకంగా ఉందని, టీడీపీ కూటమికి ఓటమి తప్పదని స్పష్టం కావడంతో చంద్రబాబు తన వికృత రాజకీయానికి తెరతీశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి, ఆ డేటా ద్వారా వేల కోట్లు వెదజల్లి ఓట్లు కోనేందుకు హైదరాబాద్ కేంద్రంగా పక్కా భారీ కుట్ర పన్నారు. కేవలం ఓట్ల కొనుగోలుకే ఏకంగా రూ. వేల కోట్లు వెదజల్లుతూ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మార్చేస్తున్నారు. అందుకోసం ‘వుయ్’ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. దీనిద్వారా పకడ్బందీగా కుట్రను అమలు చేస్తున్నారు.
ఓటర్లకు ఓటర్ స్లిప్పులతో పాటు ప్రత్యేక బార్ కోడ్ ఉన్న కరపత్రాలను పంపిణీ చేస్తూ.. హైదరాబాద్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నారు. అందుకోసం ఐటీ చట్టాన్ని ఉల్లంఘించి, డేటా చౌర్యానికి పాల్పడి, ఓటర్ల వివరాలను వుయ్ యాప్‌లో పొందుపరిచారు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, ఎన్నికల కమిషన్ (ఈసీ) మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా ఓట్ల కొనుగోలుకు బరితెగించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా దొరక్కుండా ఎన్నికల కమిషన్‌ను బోల్తా కొట్టిస్తున్నారు.
‘వుయ్’ యాప్ ఇలా..
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సాధికార సర్వే పేరుతో సేకరించిన ఓటర్ల సమాచారాన్ని సేకరించి, అప్పట్లోనే డేటా చౌర్యానికి పాల్పడి టీడీపీ సేవా మిత్ర యాప్‌లో పొందుపరిచిన విషయం తెలిసిందే. దానికి అప్‌డేటెడ్ వెర్షన్ కింద ఇప్పుడు ‘వుయ్’ యాప్ తెచ్చారు. ఇందులో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఆధార్, ఫోన్ నంబర్లు, ఓటరు ఐడీ నంబర్లు, వృత్తి తదితర వ్యక్తిగత వివరాలన్నీ పొందుపరిచారు. వారు ఏ పార్టీ సానుభూతిపరులో కూడా ఇందులో ఉంది. ఇది ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు పూర్తి విరుద్ధం.
మూడంచెల వ్యవస్థతో..
ఈ యాప్ ద్వారా ఎన్నికల అక్రమాల కోసం చంద్రబాబు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల ద్వారా స్లిప్పుల పంపిణీ, వీటిని పర్యవేక్షించి, స్కాన్ చేసేందుకు మరో ప్రత్యేక బృందం, ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. యాప్‌లో ఉన్న వివరాల ఆధారంగా బూత్ కమిటీ సభ్యులు ఓటర్ల వద్దకు వెళ్లి, ఓటరు స్లిప్పులు, బార్‌కోడ్ ఉన్న కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఈ బార్ కోడ్‌ను ప్రతి ఓటరుకు ప్రత్యేకంగా (యూనిక్)గా కేటాయించారు.
స్లిప్పుల పంపిణీ అయిన తరువాత రెండో బృందం ఓటర్ల ఇళ్లకు వెళ్లి స్లిప్పులపై ఉన్న బార్ కోడ్‌ను స్కాన్ చేస్తుంది. ఆ వెంటనే హైదరాబాద్ నుంచి ఫోన్ పే, గూగుల్ పే తదితర డిజిటల్ చెల్లింపుల ద్వారా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఒక్కో ఓటుకు సగటున రూ.5 వేల వరకు చెల్లిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే చేస్తున్నారు. డబ్బులు హైదరాబాద్ నుంచి ఓటర్ల ఖాతాల్లో జమ అవుతున్నందున.. పోలీసులు, ఫ్లయింగ్ స్వా్కడ్‌లు తనిఖీ చేసినా బూత్ కమిటీలు, పర్యవేక్షక బృందాల వద్ద డబ్బు దొరకదు.
నియోజకవర్గానికి రూ.87.50 కోట్లు
వుయ్ యాప్ ద్వారా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 1.75 లక్షల ఓట్లు కొంటున్నారు. ఓటుకు రూ.5 వేలు రేటు కట్టినట్టు సమాచారం. ఆ ప్రకారం నియోజకవర్గానికి రూ.87.50 కోట్లు చొప్పున అన్ని నియోజకవర్గాలకు కలిపి మొత్తం రూ.15,312 కోట్లు వెచ్చిస్తున్నారు. నేరుగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసి ప్రలోభాలకు గురి చేసేది దీనికి అదనం. బార్ కోడ్ స్లిప్పులను సక్రమంగా పంపిణీ చేసిన బూత్ కమిటీలకు ఒక్కో దానికి రూ. 5 లక్షలు, పర్యవేక్షక బృందానికి రూ.5 లక్షల చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకాలు చెల్లిస్తునట్టు తెలుస్తోంది.
ఇందుకోసం మరో రూ.2,500 కోట్ల వరకు చంద్రబాబు ప్రకటించినట్టు సమాచారం. వుయ్ యాప్‌ను రూపొందించి హైదరాబాద్ కేంద్రంగా కుట్రను అమలు చేస్తున్న బృందానికి మరో రూ.2 వేల కోట్లకు పైగా ప్యాకేజీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ ప్రకారం రూ. 20 వేల కోట్లతో చంద్రబాబు ఓట్ల కొనుగోలుకు భారీ కుట్ర అమలు చేస్తున్నారన్నది సుస్పష్టమైంది. దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల అక్రమానికి చంద్రబాబు తెగించారన్నది బహిర్గతమైంది.
కుట్ర ఇలా బట్టబయలు..
రెండు రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ పంపిణీ చేసిన బార్ కోడ్ ఓటరు స్లిప్పులు బయటపడ్డాయి. తర్వాత మైలవరంలో, తాజాగా ఒంగోలులోనూ ఈ బార్ కోడ్ స్లిప్పుల బాగోతం బట్టబయలైంది. ఆ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థుల ఫొటోలు ముద్రించిన కరపత్రాలు, బార్ కోడ్ ఉన్న ఓటరు స్లిప్పులు లభించాయి. బార్ కోడ్‌ను పరిశీలించగా వాటిపై ‘ వుయ్ యాప్’కు అవి అనుసంధానించి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు టీడీపీ శ్రేణుల కోసం గూగుల్‌లో అందుబాటులో ఉంచిన ‘వుయ్ యాప్’ను పరిశీలించగా మొత్తం ఎన్నికల అక్రమాల గుట్టు బట్టబయలైంది.
ఎన్నికల నియామవళి ఉల్లంఘనే
ప్రస్తుత లోక్‌సభ, రాష్ట్ర శాసన సభ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(1) ప్రకారం స్పష్టమైన విధి విధానాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళిని వెల్లడించింది. దాంతోపాటు ఓటర్ల నమోదు, సర్వే పేర్లతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని, పథకాలను ప్రకటించవద్దని, అవినీతి కార్యకలపాలకు పాల్పడవద్దని స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
కానీ చంద్రబాబు ఈసీ మార్గదర్శకాలు, ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వుయ్ యాప్ ముసుగులో ఎన్నికల అక్రమాలకు బరితెగించారు. ఇది ఎన్నికల నియామావళి ఉల్లంఘనే కాకుండా డేటా చౌర్యం కూడా. దాంతోపాటు ఐటీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారు.
ఈసీ, డీజీపీలకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
వుయ్ యాప్ పేరుతో టీడీపీ పాల్పడుతున్న ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమిషన్(ఈసీ), రాష్ట్ర డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత కె. శ్రీనివాసరెడ్డి ఈసీకి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. మాచర్ల, ఒంగోలులో టీడీపీ వారి నుంచి స్వాధీనం చేసుకున్న బార్ కోడ్ ఉన్న ఓటరు స్లిప్పులు, డౌన్‌లోడ్ చేసిన వుయ్ యాప్, ఇతర వీడియో ఆధారాలను కూడా సమర్పించారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ మేరకు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, దర్యాప్తు అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ కార్యాలయాల్లో తనిఖీలు చేసి వుయ్ యాప్‌కు సంబంధించిన ఆధారాలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కోరారు.
ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం
ఈసీకి, డీజీపికి ఫిర్యాదు అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. వుయ్ యాప్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం ఉందని చెప్పారు. ప్రజల ఓటర్ ఐడీలు, వారి సచివాలయ పరిధి, ఓటర్ నంబరు, ఏ పార్టీ సానుభూతిపరులు తదితర వివరాలన్నీ ఉన్నాయన్నారు. వాటితో టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ స్లిప్‌తో పాటు బార్ కోడ్ కలిగిన స్లిప్‌ను, మేనిఫెస్టోను ఇస్తున్నారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని తెలిపారు. బార్ కోడ్ స్లిప్ స్కాన్ చేసిన అనంతరం వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment