సెనెట్ కమిటీ ముందు విచారణ సందర్భంగా నీళ్లు తాగుతున్న మార్క్
వాషింగ్టన్: కేంబ్రిడ్జి అనలిటికా(సీఏ) ఉదంతం నేపథ్యంలో అమెరికా సెనెట్ జ్యుడీషియరీ, కామర్స్ కమిటీల ముందు తొలిరోజు విచారణకు హాజరైన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను సెనెటర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫేస్ బుక్‌లో ఖాతాదారుల వివరాలు, సమాచార గోప్యతపై 44 మంది సభ్యులు 5 గంటలపాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. రాత్రి మీరు ఏ హోటల్‌లో బస చేశారో చెప్పగలరా? అని సెనెటర్ డిక్ డర్బిన్ అడిగిన ప్రశ్నకు జవాబివ్వడానికి జుకర్‌బర్గ్ తటపటాయించారు. దీం తో వ్యక్తిగత గోప్యత అలాంటిదేనంటూ ఆయ న జుకర్‌బర్గ్‌కు చురకలంటించారు.
ఫేస్‌బుక్ భవిష్యత్‌లోనూ స్వీయ నియంత్రణను పాటిస్తుందన్న నమ్మకం తమకు లేదని మెజారిటీ సెనెటర్లు అభిప్రాయపడ్డారు. కేంబ్రిడ్జి అనలిటికా యూజర్ల వివరాలను డిలీట్ చేసిందని నమ్మడం పెద్ద తప్పిదమేనని జుకర్‌బర్గ్ అంగీకరించారు. వినియోగదారుల సంభాషణలపై తాము నిఘా పెట్టబోమని స్పష్టం చేశారు. కేంబ్రిడ్జి అనలిటికా తనతో పాటు కోట్లాది మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల వ్యక్తిగత వివరాల్ని దొంగలించి అమ్ముకుందని జుకర్‌బర్గ్ తెలిపారు. లీకేజీపై ఫేస్‌బుక్ స్పందిస్తూ.. ‘‘మీ స్నేహితుడు ఒకరు ‘దిస్ ఈజ్ మై డిజిటల్ లైఫ్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో మీ సమాచారం ఈ యాప్ ద్వారా సీఏకు చేరింది’’ ఖాతాదారులకు అలర్ట్స్ పంపింది.
ఫేస్‌బుక్‌లో ఇకపై ఇవి చేయలేం
ఫేస్‌బుక్‌లో ఫోన్ నెంబర్లు, ఈ–మెయిల్ ఐడీల ద్వారా ఇతర వ్యక్తుల్ని ఇకపై మనం సెర్చ్ చేయలేమని జుకర్‌బర్గ్ తెలిపారు. ఇతరుల పోస్టులను షేర్ చేయడానికి కొన్ని పరిమితుల్ని విధించామన్నారు. యాప్ డెవలపర్స్ ఇక ఫేస్‌బుక్‌లో డేటాను వాడుకోలేరన్నారు.
ఎఫ్‌బీఐతో కలసి పనిచేస్తున్నాం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు జరుపుతున్న ఎఫ్‌బీఐతో ఫేస్‌బుక్ కలసి పనిచేస్తోందని జుకర్‌బర్గ్ తెలిపారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ తనను వ్యక్తిగతంగా విచారించలేదన్నారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రష్యన్ హ్యాకర్లు మరిన్ని సైబర్‌దాడులు చేస్తారనుకున్నామనీ, ఫేస్‌బుక్‌ను దుర్వినియోగం చేస్తారని ఊహించలేకపోయామని సెనెటర్లకు వివరించారు. ఇకపై కొత్తగా ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని, లొకేషన్‌ను ఇవ్వాల్సిందిగా యూజర్లను కోరతామనీ, దీనివల్ల రష్యాలో ఉండి అమెరికాలో ఉంటున్నామని చెప్పడం కుదరదని పేర్కొన్నారు.
భారత్ ఎన్నికల సమగ్రతని కాపాడతాం
అమెరికా సహా భారత్, బ్రెజిల్, పాకిస్తాన్, మెక్సికో దేశాల్లో ఈ ఏడాది జరగనున్న ఎన్నికల సమగ్రతను కాపాడటానికి కృషి చేస్తామని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. భారత్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా 13.3 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వాడటంతో పాటు 20,000 మంది సిబ్బందిని మోహరిస్తామన్నారు.
ముందే ప్రశ్నలు తెలుసా ?
అమెరికా సెనెటర్లు అడిగిన ప్రశ్నలు జుకర్‌బర్గ్‌కు ముందే తెలుసునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ ఎదుర్కోవడానికి ముందు జుకర్‌బర్గ్ లాబీయింగ్‌లో భాగంగా పలువురు సెనెటర్లను కలుసుకున్నారు. ఆ సమయంలో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, డేటా లీకేజీపై వారి ఆందోళన చూసిన జుకర్‌బర్గ్ ప్రశ్నల విషయంలో ఒక అంచనాకు వచ్చి ఉంటారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నా రు. అయితే సెనెట్ జ్యుడీషియరీ, కామర్స్ కమిటీలు గత పదేళ్లలో ఫేస్‌బుక్ నుంచి 6.4 లక్షల డాలర్ల విరాళాలు అందుకున్నాయి.
భారతీయుల వివరాలు సేకరించలేదు: సీఏ
ఫేస్‌బుక్ ఆధారంగా భారతీయులకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని సేకరించలేదని కేంబ్రిడ్జి అనలిటికా(సీఏ) స్పష్టం చేసింది. సమాచార దుర్వినియోగంపై ఏప్రిల్ 7న కేంద్రం రాసిన లేఖకు సీఏ ఈ మేరకు జవాబిచ్చింది. డేటా లీకేజీ ఉదంతంలో 5.62 లక్షల మంది భారతీయుల వివరాలు దుర్వినియోగమయ్యాయని ఫేస్‌బుక్ ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫేస్‌బుక్, సీఏ సమాధానాల్లో వ్యత్యాసమున్న నేపథ్యంలో మరిన్ని విషయాల్లో ఈ రెండు సంస్థల నుంచి స్పష్టతకోరే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment