ఫేస్‌బుక్ డేటా లీకేజీ ఘటనతో తెరపైకి వచ్చిన పేరు కేంబ్రిడ్జ్ అనలిటికా (సీఏ). ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల ఎన్నికల ఫలితాలను తమ సర్వేలు, వ్యూహాలతో తారుమారు చేసిన రికార్డు ఈ సంస్థకుంది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, కెన్యా సహా పలు ఆఫ్రికా దేశాల ఎన్నికల్లో, బ్రెగ్జిట్ రెఫరెండంలోనూ వేలుపెట్టిన సీఏ 2014లో భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలనూ మార్చేందుకు ప్రయత్నించింది. ఆనాడు అసలేం జరిగింది? ఎందుకు వీరి ప్రయత్నం బెడిసికొట్టింది? ఆనాటి బృందంలో సభ్యుడైన ఎలక్షన్ కన్సల్టెంట్ అవ్నీ శ్ కుమార్ ‘ద ప్రింట్’ సంస్థకు వెల్లడించిన వివరాలు..
భారత ఎస్‌సీఎల్ కంపెనీ ఏర్పాటు
కేంబ్రిడ్జ్ అనలిటికా మాతృ సంస్థ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఎస్‌సీఎల్) భారత్‌లో కాలుమోపేందుకు ఎస్‌సీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ప్రారంభించింది. ఇందులో అలెగ్జాండర్ జేమ్స్, అష్‌బర్నర్ నిక్స్, అలెగ్జాండర్ ఓక్స్ (ముగ్గురూ బ్రిటీషర్లు) అమ్రీశ్ త్యాగి, అవ్నీశ్ కుమార్ రాయ్ (ఇద్దరు భారతీయులు) డైరెక్టర్లుగా ఉన్నారు. జేమ్స్, నిక్స్ ఇద్దరూ ఎస్‌సీఎల్ (యూకే) వ్యవస్థాపకులు. అమ్రీశ్ త్యాగి జేడీయూ నేత కేసీ త్యాగి కుమారుడు, ప్రస్తుతం సీఏతో కలిసి పనిచేస్తున్న ఓవ్లినో బిజినెస్ ఇంటెలిజెన్స్ (ఓబీఐ) యజమాని. రాయ్ 1984నుంచీ దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.
ఓటర్ల మనసును చదివి..
2009లో యూపీలోని గౌతమబుద్ధ నగర్ పార్లమెంటు స్థానం ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎంపీ అభ్యర్థి మహేశ్ శర్మ (ప్రస్తుత కేంద్ర మంత్రి)కు రాయ్ సహకరించినా 16వేల ఓట్లతో శర్మ ఓడిపోయారు. ఫలితాన్ని సమీక్షించుకుంటున్న నేపథ్యంలో ఎస్‌సీఎల్–యూకే హెడ్ డాన్ మురేసన్‌తో రాయ్‌కు పరిచయమైంది. రాయ్ కోరిక మేరకు ముగ్గురు బిహేవియరల్ డైనమిక్స్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులతో భారత్ వచ్చిన మురేసన్.. తనదైన శైలిలో సర్వే నిర్వహించి శర్మ ఓటమికి కారణాలు వెల్లడించారు. దీనికి ముచ్చటపడిన రాయ్.. దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వేలు నిర్వహించేందుకు మురేసన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాడు. 2010 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులకు రాయ్ సహకరించారు. ఈ అభ్యర్థులంతా ఘన విజయం సాధించారు.
డేటాను అమ్ముకుంటేనే!
రాయ్ విజ్ఞప్తి మేరకు లండన్ నుంచి ఎస్‌సీఎల్ నిపుణుల బృందం (అలెగ్జాండర్ నిక్స్ సహా) భారత్‌కు వచ్చింది. అప్పటికే రాయ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని జనాభా వివరాలను సేకరించి (కుల, మత, లింగ తదితర) వారి రాజకీయ అభిప్రాయాలను క్రోడీకరించే పనిలో ఉన్నారు. డేటాను మరింత శాస్త్రీయంగా రూపొందించి 2014 పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అమ్ముకోవాలని ఎస్‌సీఎల్ బృందం సూచించింది. ఇందుకోసం నిక్స్, మురేసన్, త్యాగి, రాయ్‌లు వివిధ పార్టీల నేతలను కలిశారు. పార్టీలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీజేపీ మొదట్లోనే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ చూద్దాం అన్నట్లు వ్యవహరించింది.
నైతికత కాదు.. డబ్బే ముఖ్యం: నిక్స్
అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో జతకలిస్తే ఎక్కువ డబ్బులొస్తాయని నిక్స్ వీరందరినీ ఒప్పించారు. కాంగ్రెస్ నేతలను ఒప్పించేందుకు మరింత పకడ్బందీగా శాంపిల్ డేటా సిద్ధం చేయాలని నిర్ణయించారు. అయితే ఓటర్లను అడగాల్సిన ప్రశ్నలు.. ప్రజానాడిని తెలుసుకునే బదులు కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారంలాగా కనిపించటంతో రాయ్ అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉండే ఓ గుజరాతీ ఎన్నారై ఒకరు రాయ్ బృందాన్ని కలిసి.. కాంగ్రెస్ ఓడిపోయేందుకు డీల్ కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి కాంట్రాక్ట్ తీసుకుందామనుకుని వారికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం అనైతికమని రాయ్ చెప్పినా నిక్స్ వినలేదు.
భారత్‌కు వచ్చింది డబ్బులు సంపాదించుకునేందుకేనని నిక్స్ చెప్పాడు. సర్వే వివరాలన్నీ భారత సర్వర్లలో దాచిపెట్టాలని రాయ్ చెప్పినా వినకుండా కావాలని నిక్స్ యూఎస్ సర్వర్లలో భద్రపరచటంతో రాయ్ అసంతృప్తితో టీమ్ నుంచి బయటకొచ్చారు. జనాభా లెక్కల ప్రకారం వివరాల విశ్లేషణలో రాయ్ పాత్ర కీలకం కావటంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పటినుంచి రాయ్ సొంతంగా పనిచేస్తుండగా సీఏ టీం త్యాగితో పనిచేస్తోంది. ఈ మధ్యలోనే కెన్యా ఎన్నికల పనికోసం నైరోబీ వెళ్లిన మురేసన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. కేవలం డబ్బుకోసమే పనిచేసే నిక్స్ కావాలనే మురేసన్‌ను చంపించాడని సీఏ యూకే ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.
– సాక్షి నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment