
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ డేటా లీకేజీతో ప్రకంపనలు సృష్టించిన కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ) 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేయడానికి ముందుకొచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం రూ.2.5 కోట్లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తాజాగా వెలుగుచూసింది. ఫేస్‌బుక్ డేటా ఉల్లంఘన కుంభకోణం బహిర్గతం కావడానికి కొన్ని నెలల ముందు కాంగ్రెస్‌కు సీఏ ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు సీఏ ప్రతిపాదించినట్లుగా భావిస్తున్న 49 పేజీల పత్రంలో ఈ విషయాలున్నాయి. ప్రస్తుతం ఈ పత్రం సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతోంది.
ఫేస్‌బుక్ డేటాను వినియోగించి ఓటర్లను ప్రభావితం చేద్దామని సీఏ అందులో ప్రతిపాదించింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. సీఏ సేవలను తాము ఉపయోగించుకోలేదని వివరణ ఇచ్చింది. ‘కాంగ్రెస్ జాతీయ పార్టీ. ఇలాంటి ప్రతిపాదనలు రోజూ ఎన్నో వస్తాయి. ప్రచారానికి సంబంధించి సీఏతో ఎలాంటి అవగాహనా ఒప్పందం కుదరలేదు’ అని ఆ పార్టీ డేటా అనలిటిక్స్ ఇన్‌చార్జి ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. ఇటీవల కుంభకోణం నేపథ్యంలో వేటుకు గురైన సీఏ మాజీ సీఈఓ అలెగ్జాండర్ నిక్స్ ఈ ప్రతిపాదనను 2017 ఆగస్టులో రూపొందించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సంధి కాలంలో ఉన్న సమయంలో ఈ ఆఫర్ ఇస్తున్నామని అందులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment