న్యూఢిల్లీ : ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారాన్ని తస్కరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌సీఎల్ గ్రూప్, దాని అనుబంధ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాలు మూతపడినట్లు ఆ సంస్థల యాజమాన్యం వెల్లడించింది. సంస్థ ఎలాంటి తప్పు చేయలేదని, మీడియా ప్రతికూల ప్రచారం వల్ల ఖాతాదారులు లేకుండా పోయారని పేర్కొంది. సంస్థ మూసివేయడానికి కావాల్సిన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని మేనేజర్లు పేర్కొన్నారు. సంస్థపై ఆరోపణలు ఉన్నప్పటికి ఉద్యోగులు విలువలతో, న్యాయంగా పని చేశారని యాజమాన్యం పేర్కొంది.
డేటా లీక్ వివాదంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాజకీయ డేటా విశ్లేషణ సంస్థ కేంబ్రిడ్జి అనాలిటికా తక్కువ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది. ఈ సంస్థ ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని తస్కరించి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఆ సమాచారాన్ని వాడినట్టు వెల్లడి కావడం, అలాగే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఇదే విధానాన్ని ఉపయోగించినట్టు వెలుగు చూడటంతో వివాదాల్లో చిక్కుకుంది.
భారత్‌లో కూడా ఫేస్‌బుక్ డేటా లీకేజీపై రాజకీయ దుమారం రేగింది. 2014లో బీజేపీ 272 లోక్‌సభ సీట్లు గెలువడానికి డేటా లీకేజీయే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా బీజేపీ కూడా కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు చేసింది. ఫేస్‌బుక్ డేటా లీకేజీపై వివరణ ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వం కేంబ్రిడ్జ్ అనలిటికా ఆదేశించింది. కానీ సంస్థ మాత్రం సంతృప్తికరమైన వివరణను ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment