contract post
-
ట్రిపుల్ ఐటీలో ఉద్యోగం కావాలా?
మీకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉద్యోగం కావాలా? అయితే రండి.. అందులో పనిచేసే వారి సంబంధీకులు ఎక్కడెక్కడున్నారో వెతికి పట్టుకోండి.. ఆ వరసా, ఈ వరసలతో చుట్టరికాన్ని చుట్టండి. ఇక మీరు గుండెల మీద చేయి వేసుకోండి.. ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇంటికి నడుచుకుంటూ వస్తాయి. ఎంత చుట్టమైనా ఊరికే ఏం రాదండోయ్... యథా రాజా తథా ప్రజా అన్నట్లు చేయి తడపాల్సిందే మరీ. నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిబంధనలకు విరుద్ధంగా పలు కాంట్రాక్టు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పనిచేస్తున్న వారి అలుళ్లు, తమ్ముళ్లు, వారి చుట్టాలను ఇష్టారాజ్యంగా తెచ్చి ఉద్యోగాల్లో కూర్చోబెడుతున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో వేలాది రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు హల్చల్ చేస్తున్నాయి. అటెండర్ల దగ్గర నుంచి కంప్యూటర్ ఆపరేటర్లు, గార్డెనర్లు, డ్రైవర్ల వరకు నియామకాలు చేసినట్లు తెలుస్తోంది. ట్రిపుల్ ఐటీ ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నియమించుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంప్రతిపత్తి కల్పనతో... ట్రిపుల్ ఐటీలను స్వయంప్రతిపత్తి కిందకు తీసుకొచ్చిన తరువాత ఇక్కడే పనిచేస్తున్న కోసూరి హనుమంతరావు ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి ఇన్చార్జి డెరైక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి వరకు లేని పరిపాలనాధికారి పోస్టును కొత్తగా సృష్టించి ఇన్చార్జి పరిపాలనాధికారిగా పరిమి రామనరసింహాన్ని నియమించారు. ఇటీవల కాలంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ముగ్గురు, అటెండర్లు నలుగురు, గార్డెనర్లు ఇద్దరు, డ్రైవర్ ఒకరు, ల్యాబ్ అసిస్టెంట్ ఒకరు ఉద్యోగాల్లో చేరారు. ఈ నియామకాలన్నీ డెరైక్టర్ తన ఇష్టారాజ్యంగా చేసినట్లు తెలిసింది. ఇన్చార్జి పరిపాలనాధికారి పరిమి రామనరసింహం తన అల్లుడిని కంప్యూటర్ ఆపరేటర్‌గా నియమించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అతని కార్డు డ్రైవర్ తన చుట్టాల అమ్మాయిని కంప్యూటర్ ఆపరేటర్‌గా, ఒక అడ్హాక్ లెక్చరర్ తన తమ్ముడిని అటెండర్‌గా నియమింపజేసుకున్నారు. ఇటీవలే ట్రిపుల్ ఐటీలో చేరిన ప్రొఫెసర్ తన పలుకుబడిని ఉపయోగించి తన సొంత కారు డ్రైవర్‌ను ట్రిపుల్ ఐటీలో డ్రైవర్‌గా నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నియామకాలన్నింటిలో వేలాది రూపాయలు చేతులు మారాయని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలో పది నెలల కాలానికి విద్యా వలంటీర్ల పోస్టులను భర్తీ చేయడానికే మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి రోస్టర్ విధానంలో పకడ్బందీగా, పారదర్శకంగా భర్తీ చేస్తుండగా, ఒక పెద్ద విద్యాసంస్థలో ఇష్టారాజ్యంగా, రెండో కంటికి తెలియకుండా కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయి. -
పంచాయతీ కార్యదర్శుల భర్తీలో కొత్త మలుపు
సాక్షి, సంగారెడ్డి: పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల భర్తీ ప్రక్రియ కొత్త మలుపు తిరిగింది. నిరుద్యోగ దరఖాస్తుదారులను పక్కనపెట్టి కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులనే క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ తాజా మార్గదర్శకాల అనుసారం డిగ్రీ విద్యార్హత కలిగిన కాంట్రాక్టు అభ్యర్థులను రెగ్యులరైజ్ చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పరిశీలన కోసం బుధవారం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్‌కు పంపించింది. ప్రస్తుతం జిల్లాలో 206 మంది కాంట్రాక్టు కార్యదర్శులు పనిచేస్తుండగా, వారిలో 192 మంది డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నారు. డిగ్రీ విద్యార్హత లేని కాంట్రాక్టు కార్యదర్శుల విషయమై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా యథాస్థితిని కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది. కొలవుదీరిన ఆశానిరాశలు జిల్లాలోని 1066 గ్రామ పంచాయతీలను 514 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో పంచాయతీ కార్యదర్శి పోస్టు మంజూరు చేశారు. ప్రస్తుతం 316 పంచాయతీ కార్యదర్శులు మాత్రమే పనిచేస్తుండగా అందులో 206 మంది కాంట్రాక్టు ఉద్యోగులుండగా మిగిలిన 110 మంది రెగ్యులర్ ఉద్యోగులు. మొత్తం 504 ఖాళీలు ఉండగా ప్రభుత్వం ఈ పోస్టులను విభజించి రెండు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా నియామకాలు చేపట్టింది. 206 మంది కాంట్రాక్టు కార్యదర్శులను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. గతేడాది అక్టోబర్ 31న కలెక్టర్ 210 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ఏపీపీఎస్సీ ద్వారా మరో 182 ఖాళీల భర్తీకి గత డిసెంబర్ 30న మరో ప్రకటన జారీ అయింది. అయితే నిరుద్యోగ అభ్యర్థుల నుంచీ దరఖాస్తులు ఆహ్వానించి ప్రభుత్వం సరికొత్త వివాదానికి శ్రీకారం చుట్టింది. 210 పోస్టులకు గాను 15,434 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతి మార్కులపై వెయిటేజీ ఆధారంగా ఎంపికలు జరుపుతున్నట్లు ఆనాడు ప్రకటనలో తెలిపారు. అయితే, కాంట్రాక్టు కార్యదర్శులకు 75 మార్కులను అదనపు వెయిటేజీగా ఇచ్చారు. ఈ ప్రక్రియపై అభ్యంతరాలు తెలుపుతూ 90 మంది కాంట్రాక్టు కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో అప్పట్లో భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. డిగ్రీ విద్యార్హత గల కాంట్రాక్టు కార్యదర్శులందరినీ క్రమబద్ధీకరించాలని తాజాగా ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. డిగ్రీ విద్యార్హత లేని కాంట్రాక్టు అభ్యర్థుల భవితవ్యంపై ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టి యథాస్థితిని కొనసాగించాలని సూచించింది. దీంతో కాంట్రాక్టు కార్యదర్శుల్లో ఆనందం వెల్లివెరిసింది. నిరాశలో నిరుద్యోగులు పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీలో సర్కార్ అవలంబించిన ద్వంద్వ ప్రమాణాలు నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశను కలిగించాయి. ప్రకటన ద్వారా ఆశపెట్టడంతో దరఖాస్తు చేసుకున్న 15 వేల మంది అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.