మీకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉద్యోగం కావాలా? అయితే రండి.. అందులో పనిచేసే వారి సంబంధీకులు ఎక్కడెక్కడున్నారో వెతికి పట్టుకోండి.. ఆ వరసా, ఈ వరసలతో చుట్టరికాన్ని చుట్టండి. ఇక మీరు గుండెల మీద చేయి వేసుకోండి.. ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇంటికి నడుచుకుంటూ వస్తాయి. ఎంత చుట్టమైనా ఊరికే ఏం రాదండోయ్... యథా రాజా తథా ప్రజా అన్నట్లు చేయి తడపాల్సిందే మరీ.
నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిబంధనలకు విరుద్ధంగా పలు కాంట్రాక్టు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పనిచేస్తున్న వారి అలుళ్లు, తమ్ముళ్లు, వారి చుట్టాలను ఇష్టారాజ్యంగా తెచ్చి ఉద్యోగాల్లో కూర్చోబెడుతున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో వేలాది రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు హల్‌చల్ చేస్తున్నాయి. అటెండర్ల దగ్గర నుంచి కంప్యూటర్ ఆపరేటర్లు, గార్డెనర్లు, డ్రైవర్ల వరకు నియామకాలు చేసినట్లు తెలుస్తోంది. ట్రిపుల్ ఐటీ ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నియమించుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్వయంప్రతిపత్తి కల్పనతో...
ట్రిపుల్ ఐటీలను స్వయంప్రతిపత్తి కిందకు తీసుకొచ్చిన తరువాత ఇక్కడే పనిచేస్తున్న కోసూరి హనుమంతరావు ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి ఇన్‌చార్జి డెరైక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి వరకు లేని పరిపాలనాధికారి పోస్టును కొత్తగా సృష్టించి ఇన్‌చార్జి పరిపాలనాధికారిగా పరిమి రామనరసింహాన్ని నియమించారు. ఇటీవల కాలంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ముగ్గురు, అటెండర్లు నలుగురు, గార్డెనర్లు ఇద్దరు, డ్రైవర్ ఒకరు, ల్యాబ్ అసిస్టెంట్ ఒకరు ఉద్యోగాల్లో చేరారు. ఈ నియామకాలన్నీ డెరైక్టర్ తన ఇష్టారాజ్యంగా చేసినట్లు తెలిసింది. ఇన్‌చార్జి పరిపాలనాధికారి పరిమి రామనరసింహం తన అల్లుడిని కంప్యూటర్ ఆపరేటర్‌గా నియమించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే అతని కార్డు డ్రైవర్ తన చుట్టాల అమ్మాయిని కంప్యూటర్ ఆపరేటర్‌గా, ఒక అడ్‌హాక్ లెక్చరర్ తన తమ్ముడిని అటెండర్‌గా నియమింపజేసుకున్నారు. ఇటీవలే ట్రిపుల్ ఐటీలో చేరిన ప్రొఫెసర్ తన పలుకుబడిని ఉపయోగించి తన సొంత కారు డ్రైవర్‌ను ట్రిపుల్ ఐటీలో డ్రైవర్‌గా నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నియామకాలన్నింటిలో వేలాది రూపాయలు చేతులు మారాయని ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వ పాఠశాలలో పది నెలల కాలానికి విద్యా వలంటీర్ల పోస్టులను భర్తీ చేయడానికే మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి రోస్టర్ విధానంలో పకడ్బందీగా, పారదర్శకంగా భర్తీ చేస్తుండగా, ఒక పెద్ద విద్యాసంస్థలో ఇష్టారాజ్యంగా, రెండో కంటికి తెలియకుండా కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయి.
ట్రిపుల్ ఐటీలో ఉద్యోగం కావాలా?
Published Wed, Nov 26 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement
Advertisement