iiit nuzvid
-
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీ విద్యార్థి మండల రామూనాయుడు (16) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా గుర్ల మండలం దమరసింగికి చెందిన రామానాయుడు పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్‌లోని ఐ2 హాస్టల్లో ఉంటున్నాడు. గురువారం ఉదయం తరగతులకు వెళ్లడంతో పాటు మధ్యాహ్నం మెస్‌కు వెళ్లి భోజనం చేశాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఈనెల 4న ట్రిపుల్ఐటీకి రానున్న ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం మూడో ఫ్లోర్‌లోని గదుల్ని సిద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో వారు గదిలో ఉరికి వేలాడుతున్న రామూనాయుడిని గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే రామూనాయుడు మృతి చెందాడు. గతనెల 25నే ట్రిపుల్ ఐటీకి వచ్చిన అతడు ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతుడి తల్లి గతంలోనే మరణించగా తండ్రి, అక్క ఉన్నారు. వీరికి దూరంగా ఉండాల్సి వస్తోందనే వేదనతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఈ కారణంతోనే గతనెల 13నే కాలేజీకి రావాల్సిన అతడు 25న వచ్చినట్లు ట్రిపుల్ఐటీ వర్గాలు తెలిపాయి. -
నేటి నుంచి ట్రిపుల్ ఐటీల్లో తరగతులు
నూజివీడు: నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సామ్రాజ్యలక్ష్మి చెప్పారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఒక్కోక్యాంపస్‌లో పీయూసీ ద్వితీయ సంవత్సరానికి చెందిన 1,000 మంది హాజరవుతారని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ప్రొటోకాల్‌ను పక్కాగా అమలుచేస్తూ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. -
హౌజ్ కీపింగ్ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటుచేసుకుంది. సీనియర్ల వేధింపులు తాళలేని ఓ మహిళా హౌజ్ కీపింగ్ ఉద్యోగిని శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో హౌజ్ కీపింగ్ విభాగంలో మహిళా ఉద్యోగిని చల్లా రమణ(35) పని చేస్తున్నారు. కొంతకాలంగా తరచూ జూనియర్ ఉద్యోగులను.. సీనియర్లు వేధింపులకు గురి చేస్తున్నారు. ఏమి చేయాలో దిక్కుతోచని బాధితురాలు రమణ ఆత్యహత్యకు యత్నించింది. పురుగుల మందు తాగిన రమణను వెంటనే చికిత్స నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
ముగిసిన నూజివీడు ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సీట్ల కేటాయింపు కోసం చేపట్టిన కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ ఏడాది వెనకబడిన అగ్రవర్ణ పేదల కోసం 10 శాతం రిజర్వేషన్లు పెంచాలన్న కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ 39 విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలోని కళాశాలలో ఉన్న 4 వేల సీట్లతో పాటు మరో 400 సీట్లు పెరిగాయి. వాటిని భర్తీ చేసేందుకు కళాశాల యజమాన్యం సోమ, మంగళవారాల్లో విద్యార్థులకు చివరిదశ కౌన్సెలింగ్ ఏర్పాటు చేసింది. స్పెషల్ కేటగిరి, పీహెచ్సీ, స్పోర్ట్స్ కోటాలతో పాటు అగ్రవర్ణ పేదల కోసం కేటాయించిన 400 సీట్లను పూర్తిగా భర్తీ చేసినట్లు ట్రిపుల్ ఐటీ ఆడిషన్స్ కన్వీనర్ ఎస్ఎస్ఎస్వి గోపాలరాజు ‘సాక్షి’కి తెలిపారు. అయితే మొదటిదశ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఇంకా 219 సీట్లు మిగిలి ఉన్నాయని, వాటిని కూడా ఇప్పుడు భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులకు సెప్టెంబర్ 4 నుండి తరగతులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నూతన విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించామని, కార్యక్రమంలో వారికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ(ఆర్జేయూకేటీ) ఛాన్స్లర్ ప్రొఫెసర్ కెసి రెడ్డి ఐడీ కార్డులను అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు, శ్రీకాకుళం డైరెక్టర్లు ప్రొఫెసర్ డి. సూర్యచంద్రరావు, హర శ్రీరాములు పలువురు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యంగా నిర్ణయాలు
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలపై సిబ్బందిలో సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రిపుల్ఐటీ ప్రారంభంలో నాన్ టీచింగ్ స్టాఫ్ కింద తీసుకున్న హెచ్ఆర్టీలు దాదాపు 25 మందిని ఇటీవలే ఐటీ మెంటార్ల పేరుతో టీచింగ్ స్టాఫ్‌గా మార్చడంతో పాటు జీతాలను కూడా పెంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జరిగిందిదీ.. ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసినప్పుడు హోమ్ రూమ్ ట్యూటర్ల(హెచ్ఆర్టీ)లను తీసుకోవడం జరిగింది. వీరు ప్రతి తరగతికి ఒకరు చొప్పున ఉన్నారు. వీరిని అప్పట్లో పీజీ డిప్లొమా ఇన్ ఐటీ అర్హతతో తీసుకుని అప్పట్లో నెలకు రూ.10వేల చొప్పున జీతం ఇచ్చారు. తరగతిలో మెంటార్ లేనప్పుడు తరగతిని పర్యవేక్షించడం, ల్యాప్‌ట్యాప్‌ల వాడకాన్ని విద్యార్థులకు నేర్పించడం, విద్యార్థులకు నిర్వహించే స్టడీ అవర్స్‌ను పర్యవేక్షించడం వీరి పని. నాలుగేళ్లు గడిచిన తర్వాత హెచ్‌ఆర్‌టీలను రద్దు చేసి వీరినే ఐటీ ఎస్ఎస్లుగా మార్చి జీతాన్ని రూ.15వేలుకి పెంచారు. ఆ తర్వాత మరలా కొంతకాలానికి టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)గా మార్చడంతో పాటు వేతనాన్ని రూ.20వేలకు పెంచారు. ఈ మూడు రకాల హోదాలు కూడా నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు సంబంధించినవే. అనంతరం కొంతకాలానికి వారి జీతాన్ని రూ.25వేలకు పెంచారు. నోటిఫికేషన్ లేదు.. ఇక్కడ టీఏలుగా పనిచేస్తున్న వారు ఉద్యోగం చేసుకుంటూనే నాగార్జున యూనివర్సిటీ నుంచి దూరవిద్యా విధానంలో ఎమ్మెస్సీ ఐటీ చదివారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు టీఏలను ఐటీ మెంటార్లు(టీచింగ్ స్టాఫ్)గా మారుస్తూ, జీతాన్ని కూడా రూ.33వేలకు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీచేసి వారందరికి ఆర్డర్లను అందజేసింది. ప్రస్తుతం ఇదే వివాదాస్పదం అవుతోంది. ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలతో యూనివర్సిటీ ప్రమాణాలు పతనం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఐటీ మెంటార్లను నియమించాల్సి ఉంటే నోటిఫికేషన్ జారీ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి నియమించుకోవాలే గాని ఇలా చేయడమేమిటని మెంటార్లు సైతం ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ హెచ్ఆర్టీలందరూ 20వ శతాబ్దపు గురుకులంలో చదువుకున్న విద్యార్థులు కావడం వల్లనే కావాలనే వారికి ఇలా లబ్ది చేస్తున్నారనే ప్రచారం ట్రిపుల్‌ఐటీలో జరుగుతోంది. -
అదనపు బాధ్యతలకు మూకుమ్మడి రాజీనామా
నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న మెంటార్లు, ఫ్యాకల్టీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితర సిబ్బంది అందరూ తమకు అదనంగా అప్పగించిన బాధ్యతలకు మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు. తాము బోధన బాధ్యతతో పాటు విద్యా సంస్థ శ్రేయస్సు దృష్ట్యా మిగిలిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు యాజమాన్యం తమకు అండగా ఉండటం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో అదనపు బాధ్యతలకు రాజీనామా చేస్తున్నామని డైరెక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసుకు రాజీనామా పత్రం అందజేశారు. రాజీనామాకు అసలు కారణం ఇదే.. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఈ నెల 14న దబ్బాడ రమాదేవి ఆత్మహత్య విషయాన్ని ట్రిపుల్ ఐటీ అధికారులు సకాలంలో పోలీసులకు తెలపలేదు. ఉదయం 5.30 గంటలకు ఘటన జరిగితే 11.30 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై అదేరోజు రాత్రి డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు చీఫ్‌వార్డెన్ ఫణికుమార్‌ను పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ విషయం తెలుసుకుని బోధనా సిబ్బంది అంతా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లడంతో ఫణికుమార్‌ను పంపించేశారు. బాలిక ఆత్మహత్యకు పాల్పడితే చీఫ్ వార్డెన్ ఎలా బాధ్యుడవుతారని సిబ్బంది ప్రశ్నించడంతో పాటు పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన విషయంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గాని, వైస్ చాన్సలర్ గాని చీఫ్ వార్డెన్‌కు అండగా నిలబడలేదని సిబ్బంది పేర్కొంటున్నారు. తామందరం అదనంగా బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబంతో గడిపే సమయాన్ని సైతం కోల్పోతుంటే, చీఫ్ వార్డెన్‌ను పోలీసులు తీసుకెళ్తుంటే డైరెక్టర్ గాని, వీసీ గాని ఎందుకు ఒక్కమాట కూడా పోలీసులకు చెప్పలేదని వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతోనే వారంతా కలిసి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అదనపు పదవులన్నింటికి రాజీనామా.. ట్రిపుల్‌ఐటీలో దాదాపు 60 మంది బోధనా సిబ్బంది అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఫైనాన్స్ అధికారి నుంచి హెచ్వోడీలు, హాస్టల్ వార్డెన్లు, చీఫ్ వార్డెన్లు, మెస్ ఇన్చార్జిలు, మెస్ కమిటీ సభ్యులు, ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారులు, కోఆర్డినేటర్లు, హౌస్ కీపింగ్ కమిటీ ఇన్చార్జిలు, సెక్యూరిటీ గార్డు కమిటీ ఇన్చార్జిలు, ప్లేస్మెంట్ సెల్ ఇన్చార్జిలు, డీన్ అకడమిక్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్, విద్యార్థుల క్రమశిక్షణ కమిటీ, ఇలా అనేక కమిటీల బాధ్యతలను అదనంగా చూస్తున్నారు. దీనిపై డైరెక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు 15 రోజుల గడువు కోరగా, అలాంటిదేమీ లేదని తిరస్కరించారు. -
ట్రిపుల్ ఐటీలో ఉద్యోగం కావాలా?
మీకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉద్యోగం కావాలా? అయితే రండి.. అందులో పనిచేసే వారి సంబంధీకులు ఎక్కడెక్కడున్నారో వెతికి పట్టుకోండి.. ఆ వరసా, ఈ వరసలతో చుట్టరికాన్ని చుట్టండి. ఇక మీరు గుండెల మీద చేయి వేసుకోండి.. ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇంటికి నడుచుకుంటూ వస్తాయి. ఎంత చుట్టమైనా ఊరికే ఏం రాదండోయ్... యథా రాజా తథా ప్రజా అన్నట్లు చేయి తడపాల్సిందే మరీ. నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిబంధనలకు విరుద్ధంగా పలు కాంట్రాక్టు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పనిచేస్తున్న వారి అలుళ్లు, తమ్ముళ్లు, వారి చుట్టాలను ఇష్టారాజ్యంగా తెచ్చి ఉద్యోగాల్లో కూర్చోబెడుతున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో వేలాది రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు హల్చల్ చేస్తున్నాయి. అటెండర్ల దగ్గర నుంచి కంప్యూటర్ ఆపరేటర్లు, గార్డెనర్లు, డ్రైవర్ల వరకు నియామకాలు చేసినట్లు తెలుస్తోంది. ట్రిపుల్ ఐటీ ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నియమించుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంప్రతిపత్తి కల్పనతో... ట్రిపుల్ ఐటీలను స్వయంప్రతిపత్తి కిందకు తీసుకొచ్చిన తరువాత ఇక్కడే పనిచేస్తున్న కోసూరి హనుమంతరావు ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి ఇన్చార్జి డెరైక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి వరకు లేని పరిపాలనాధికారి పోస్టును కొత్తగా సృష్టించి ఇన్చార్జి పరిపాలనాధికారిగా పరిమి రామనరసింహాన్ని నియమించారు. ఇటీవల కాలంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ముగ్గురు, అటెండర్లు నలుగురు, గార్డెనర్లు ఇద్దరు, డ్రైవర్ ఒకరు, ల్యాబ్ అసిస్టెంట్ ఒకరు ఉద్యోగాల్లో చేరారు. ఈ నియామకాలన్నీ డెరైక్టర్ తన ఇష్టారాజ్యంగా చేసినట్లు తెలిసింది. ఇన్చార్జి పరిపాలనాధికారి పరిమి రామనరసింహం తన అల్లుడిని కంప్యూటర్ ఆపరేటర్‌గా నియమించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అతని కార్డు డ్రైవర్ తన చుట్టాల అమ్మాయిని కంప్యూటర్ ఆపరేటర్‌గా, ఒక అడ్హాక్ లెక్చరర్ తన తమ్ముడిని అటెండర్‌గా నియమింపజేసుకున్నారు. ఇటీవలే ట్రిపుల్ ఐటీలో చేరిన ప్రొఫెసర్ తన పలుకుబడిని ఉపయోగించి తన సొంత కారు డ్రైవర్‌ను ట్రిపుల్ ఐటీలో డ్రైవర్‌గా నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నియామకాలన్నింటిలో వేలాది రూపాయలు చేతులు మారాయని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలో పది నెలల కాలానికి విద్యా వలంటీర్ల పోస్టులను భర్తీ చేయడానికే మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి రోస్టర్ విధానంలో పకడ్బందీగా, పారదర్శకంగా భర్తీ చేస్తుండగా, ఒక పెద్ద విద్యాసంస్థలో ఇష్టారాజ్యంగా, రెండో కంటికి తెలియకుండా కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయి.