ఆసుపత్రికి తాళం వేసిన సర్పంచ్‌ | Sarpanch in a locked hospital | Sakshi
Sakshi News home page

ఆసుపత్రికి తాళం వేసిన సర్పంచ్‌

Published Mon, Aug 1 2016 12:05 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

ఆసుపత్రికి తాళం వేసిన సర్పంచ్‌

ఆసుపత్రికి తాళం వేసిన సర్పంచ్‌

డాక్టర్‌ కుర్చీలో శునకం దర్జా
అపరిశుభ్రంగా ఆసుపత్రి
డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు

 నంగునూరు: చికిత్స కోసం వస్తే వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో గ్రామ సర్పంచ్‌ ఆసుపత్రికి తాళం వేసిన సంఘటన ఆదివారం నంగునూరులో చోటు చేసుకుంది. డాక్టర్‌ కూర్చోవాల్సిన కుర్చీలో దర్జాగా శునకం కూర్చోవడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు జిల్లా వైద్యాధికారికి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజలు వ్యాధుల బారిన పడుతుంటే వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంగునూరుకు చెందిన వార్డు సభ్యుడు దానం కిషన్‌ పనులు చేస్తున్న క్రమంలో చేతి వేలికి తీవ్ర గాయమైంది.

గ్రామ సర్పంచ్‌ యాదగిరి, మరి కొందరు గ్రామస్తులు కిషన్‌ను నంగునూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో డాక్టర్‌ గదిలోకి వెళ్లారు. డాక్టర్‌ కూర్చోవాల్సిన కుర్చీలో శుకనం ఉండడంతో ఆశ్చర్యపోయిన గ్రామస్తులు పక్కనే ఉన్న మందుల గదిలోకి వెళ్లగా ఫార్మసిస్ట్‌ సైతం లేదు. దీంతో వారు ఆసుపత్రిలోని గదులను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి వైద్యాధికారి సదానందంతోపాటు జిల్లా వైద్యాధికారికి ఫోన్‌ చేసి ఆసుపత్రి పరిస్థితిని వివరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ యాదగిరి, గ్రా‍మస్తులు మాట్లాడుతూ నంగునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదన్నారు. వారం రోజుల క్రితం కొండంరాజ్‌పల్లికి చెందిన నారదాసు కనకయ్యకు గాయమైతే ఆసుపత్రిలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడన్నారు. అలాగే మూడు రోజుల క్రితం సిద్దన్నపేటకు చెందిన మహిళ కడుపునొప్పితో ఆసుపత్రికి వస్తే సిబ్బంది లేకపోవడంతో తాను వైద్యాధికారికి ఫోన్‌ చేశానని, తన డ్యూటీ కాదని అతడు సమాధానం ఇచ్చాడన్నారు.

ఆసుపత్రిలో ఏడుగురు డాక్టర్లతో కలపి 72 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా ఒక్కరైనా డ్యూటీలో లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలు వాంతులు, వీరేచనాలు, జ్వరంతో ఆసుపత్రికి వస్తే డాక్టర్లు లేక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేస్తూ ఆసుపత్రికి తాళం వేశారు. ఈ విషయమై ఆసుపత్రి వైద్యాధికారి సదానందం మాట్లాడుతూ విధుల్లో ఉండాల్సిన ఏఎన్‌ఎం సామ్రాజ్యంకు వీరేచనాలు కావడంతో ఇంటికి వెళ్లిందని సమాధానం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement