నంగునూరు: మండల పరిధిలోని రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం బీఈడీ కౌన్సెలింగ్ ప్రారంభించారు. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా ఒకే సెంటర్‌లో కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. మొదటి రోజు 148 మంది హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. తమ కళాశాలలో మొదటిసారిగా ఎడ్‌సెట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. సబ్జెక్ట్‌ల వారీగా ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని చెప్పారు. ఈ నెల 23 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నేటినుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్...
మెదక్ టౌన్: బీఈడీ కౌన్సెలింగ్ కోసం పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో వెబ్ కౌన్సిలింగ్ హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రారంభం కావాల్సిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌ను ఐసెట్ కౌన్సెలింగ్ కారణంగా సోమవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన, ర్యాంక్‌ల ఆధారంగా కళాశాలల ఎంపిక, వెబ్ ఆప్షన్ల కోసం ఏర్పాట్లు చేసినట్లు సెంటర్ పరిశీలకులు వెంకట్రాంరెడ్డి తెలిపారు.
కౌన్సెలింగ్‌లో భాగంగా 22న గణితం, 23న ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్, 24న బయోసైన్స్, 26, 27, 28న సోషల్ స్టడీస్ అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తై విద్యార్థులు స్క్రాచ్‌కార్డు పొంది వెబ్ ఆప్షన్ ఎంచుకోవచ్చని తెలిపారు. వెబ్ ఆప్షన్‌లో ఏఏ కేంద్రాలు ఇచ్చుకోవచ్చునో హెల్ప్‌లైన్ కేంద్రంలో తెలుపుతామని చెప్పారు.
బీఈడీ కౌన్సెలింగ్ ప్రారంభం
Published Mon, Sep 22 2014 12:05 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
Advertisement